వాషింగ్టన్: కరోనా మహమ్మారి అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అమెరికా చరిత్రలో చీకటి రోజుగా చెప్పుకునే 2001 సెప్టెంబర్ 11 నాటి దాడిలో కంటే, ఇప్పుడు 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. బుధవారం ఒక్క రోజే 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ నాటి దాడిలో 2,977 మంది మరణిస్తే, ఇప్పుడు ఒకే రోజు కరోనా 3,054 మంది అమెరికన్ల ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా మే 7న 2,769 మంది మరణించడం ఒక రికార్డు అయితే ఇప్పుడు ఒక్కసారిగా 3 వేలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య సైతం లక్షా 6 వేల 688కి చేరుకుంది. బుధవారం ఒక్క రోజే 2,26,533 కేసులు నమోదయ్యాయి.
థ్యాంక్స్ గివింగ్ కొంప ముంచిందా?
శీతాకాలం కావడం, ప్రజలు మాస్కులు ధరించకపోవడం, థ్యాంక్స్ గివింగ్ వీక్ కావడంతో ప్రజలంతా పార్టీల్లో మునిగితేలడంతో కరోనా మరింతగా విజృంభిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సంబరాలకి కూడా సన్నాహాలు చేస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో కేసులు మరింతగా పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలందరూ మాస్కులు పెట్టుకోవాలని, ఇళ్లకే పరిమితం కావాలంటూ అధికారులు కోరుతున్నారు.
కరోనా రికవరీ రేటు 94.74%
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో మరో 31,521 కరోనా కేసులు నిర్ధారణయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,67,371కు చేరుకుంది. అదే సమయంలో కరోనా కారణంగా 412 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,41,772కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారానికి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 92,53,306 అయ్యింది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,72,293గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 3.81%గా ఉన్నాయి. మరణాల రేటు 1.45%గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment