వాహనం దిగే డ్రైవర్లు, ప్రయాణికులకు వైరస్ సోకకుండా ఉండేందుకు హైవే టోల్‌ప్లాజా వద్ద చెల్లింపుల కోసం డ్రోన్ సాయంతో క్యూఆర్ కోడ్‌ను వాహనాల వద్దకే పంపిస్తున్న దృశ్యం. చైనాలోని షెంజెన్‌లో తీసిందీ ఫొటో.
బీజింగ్: రోజులు గడుస్తున్నా చైనాలో కోవిడ్–19 (కరోనా వైరస్) కల్లోలానికి అంతం లేకుండా పోతోంది. గత ఏడాది డిసెంబర్‌లో తొలికేసు నమోదైన నాటి నుంచి చూస్తే మంగళవారం నాటికి వైరస్ బాధితుల మరణాల సంఖ్య 1,115కు చేరింది. ప్రస్తుతం 44,763 మంది వ్యాధి బారినపడినట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం తెలిపారు. జపాన్ తీరంలో లంగరేసిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో తాజాగా 39 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో నౌకలో వైరస్ బాధితుల సంఖ్య 174కు చేరింది.
మొత్తం 3700 మంది ప్రయాణీకులు ఉన్న ఈ నౌకలో ఇంకా వందలాది మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉందని జపాన్ ఆరోగ్య మంత్రి కట్సునోబూ కాటో తెలిపారు. కోవిడ్ బారిన పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు మహిళలు రష్యాలోని ఆసుపత్రి నుంచి పరారైనట్లు రష్యా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు సరిగా సహకరించకపోవడం, ఆసుపత్రిలోని పరిస్థితులు, వైరస్ సోకుతుందేమో అన్న భయం కారణంగానే తాము పారిపోయినట్లు ఆ మహిళలు చెప్పినట్లు వార్తలొచ్చాయి.
ఇద్దరు భారతీయులకు కోవిడ్
టోక్యో: జపాన్‌లో క్రూయిజ్ నౌకలో చిక్కుకున్న 138 మంది భారతీయుల్లో ఇద్దరికి కోవిడ్ సోకినట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వ్యాధి సోకిన వారిని ఆస్పత్రులకు తరలించి జపనీస్ నియమనిబంధనల ప్రకారం చికిత్స అందిస్తున్నామని జపాన్ అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ వైరస్ ఉన్నందున ఈ నెల 19 వరకూ క్రూయిజ్ నౌకను తమ అదుపులోనే ఉంచుకోనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు తెలుకునేందుకు భారత రాయబార అధికారులు జపాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment