కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీ వాసి పుష్ప శర్మ (96)
ముంబై: కరోనా వైరస్ బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నప్పటికీ బ్లాక్ ఫంగస్ ముప్పు భయపెడుతోంది. అరుదుగా వచ్చే ఈ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్) ప్రమాదకరమైనదేనని, బాధితులు చూపు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలో బ్లాక్ ఫంగర్ కారణంగా ఇప్పటిదాకా 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న లేదా కోలుకుంటున్నవారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు.
తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, ముక్కు మూసుకుపోవడం, పాక్షికంగా చూపు కోల్పోవడం వంటివి ఈ ఫంగస్ లక్షణాలు. మహారాష్ట్రలో మ్యూకోర్‌మైకోసిస్ వల్ల మరణించిన 52 మంది కరోనా నుంచి కోలుకున్నవారే కావడం గమనార్హం. రాష్ట్ర ఆరోగ్య శాఖ తొలిసారిగా బ్లాక్ ఫంగస్ మృతుల జాబితాను బయటపెట్టింది. రాష్ట్రంలో 1,500 దాకా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు యాంఫోటెరిసిన్–బి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. మహారాష్ట్రలో ఈ ఫంగస్ వల్ల 8 మంది చూపు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు.
రికవరీలు 2 కోట్లకు పైనే..
24 గంటల్లో 3,43,144 పాజిటివ్ కేసులు
ఒక్కరోజులో మృతుల సంఖ్య 4వేలు దేశంలో రికవరీ రేటు 83.5% నమోదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మార్పు కనిపిస్తున్నప్పటికీ, మరణాల్లో మాత్రం తగ్గుదల నమోదు కావట్లేదు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 24 గంటల్లో 3,43,144 మందికి కరోనా వైరస్ సోకింది. ఇందులో 10 రాష్ట్రాల వాటా 72.37%గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2,40,46,809కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 42,582 కొత్త కేసులు రాగా, కేరళలో 39,955, కర్ణాటకలో 35,297 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో 24 గంటల్లో 4వేల మంది వైరస్‌తో మృత్యువాతపడగా మొత్తం మృతుల సంఖ్య 2,62,317కు చేరుకుంది.
మరణాల రేటు 1.09%గా ఉంది. ఇందులో 10 రాష్టాలకు చెందినవారే 72.70% మంది ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 850 మంది, కర్ణాటకలో 344 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య శుక్రవారం 2,00,79,599కు పెరిగింది. దీంతో దేశంలో కరోనా రికవరీలు 83.50%గా ఉన్నాయి. దేశంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 37,04,893కు తగ్గింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 15.41%గా ఉంది. గత 24 గంటల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య నికరంగా 5,632 తగ్గింది. మరోవైపు దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటివరకు ప్రజలకు అందించిన డోస్‌ల సంఖ్య 18 కోట్లకు చేరువైంది.
కేరళలో 23 వరకూ లాక్‌డౌన్
కేరళ ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 16వరకూ విధించిన లాక్‌డౌన్‌ను 23వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, కేరళలో విధించిన లాక్‌డౌన్ ప్రభావం ఇంకా కనిపించట్లేదు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య తగ్గట్లేదు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం వెల్లడించారు. తిరువనంతపురం, ఎర్నాకులం, త్రిచూర్, మలప్పురంలో ట్రిపుల్ లాక్‌డౌన్ ప్రకటించారు. అలాగే, దేశంలోని మరో 17 రాష్ట్రాల్లో పూర్తి లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మిజోరం, గోవా, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment