ఇక్కడ ఇదే ఎక్స్‌రే
- ఉస్మానియా ఆస్పత్రిలో సెల్‌ఫోన్‌లోకి ఎక్స్‌రే చిత్రాలు
- బకాయి చెల్లించక పోవడంతో ఫిల్మ్‌ల సరఫరా నిలిపివేసిన కాంట్రాక్టర్
- బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తనిఖీ.. అధికారులపై ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : పేదలకు పెద్దదిక్కుగా నిలిచిన ఉస్మానియా ఆస్పత్రిలో ఎక్స్‌రే ఫిల్మ్‌ల కొరత వేధిస్తుంది. ఆస్పత్రిలో ఎక్స్‌రే ఫిల్మ్‌లు లేకపోవడంతో ఎక్స్‌రే మిషన్‌లోని రోగి ఎముకల చిత్రాలను వారి సెల్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఫోన్‌లో సరిగా కనిపించకపోవడంతో రోగులు ప్రైవేట్ డయాగ్నో స్టిక్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఉస్మానియా ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజూ 2000-2500 మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో నిత్యం 1500 మంది చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి 150 మంది వరకూ వస్తుంటారు. ప్రభుత్వం బకాయి చెల్లించకపోవడంతో సదరు గుత్తేదారు ఇటీవల ఎక్స్‌రే ఫిల్మ్‌ల సరఫరాను నిలిపివేశాడు. దీంతో వారం రోజుల నుంచి రోగులు ఎక్స్‌రే కోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది.
వైద్యాధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం...
ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సోమవారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ విషయం తెలుసుకుని.. అధికారుల తీరుపై మండిపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఫోన్ చేసి, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ఫిల్మ్‌లను పంపేందుకు ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని మాట్లాడుతున్నారని, అక్కడ కూర్చొని మాట్లాడితే ఆస్పత్రుల్లోని రోగుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.