ప్రశ్నించే స్థితిలో ప్రజలు
రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: ప్రజలు ప్రశ్నించే స్థితికి వచ్చారని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఉస్మానియా భూములు తీసుకుంటానన్నప్పుడు, ఉస్మానియా ఆసుపత్రి, సెక్రటేరియట్ తరలిస్తానన్నప్పుడు ప్రజలు, మేధావులు ఊరుకోలేదని, దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేధావుల సలహాలు తీసుకుని ముందుకు పోవాలని ఆయన సూచించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంశంపై మహారాష్ట్ర, తెలంగాణ చర్చల నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయమై ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చిస్తాననడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు.
చర్చలు ప్రజల ఒత్తిడి మేరకే జరిపేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రాజెక్టు కాళేశ్వరం వద్ద నిర్మిస్తామని ప్రకటించిన తర్వాత వచ్చిన ఒత్తిళ్లు, నిరసనల వల్లే చర్చలకు సిద్ధమయ్యారని అన్నారు. ఇదే వ్యాప్‌కోస్ సంస్థ గతంలో ఒక రిపోర్ట్ ఇచ్చిందని.. తిరిగి అదే సంస్థ మరో రిపోర్ట్ ఇచ్చిందంటే ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఇస్తుందో అర్థంకావడం లేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం అక్కడ పెద్దపెద్ద కాలువలు తవ్వారని, వేల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టారని అన్నారు. ప్రాజెక్టులలో అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.
ఇప్పటికే ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఒక్క ప్రాజెక్టులో అవినీతి ఆపితే రైతాంగ సమస్యలు తీర్చవచ్చునని అన్నారు. కాంగ్రెస్ పార్టి సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల తెలంగాణ ప్రజలకు సంజీవని వంటిదని అప్పడు ప్రారంభించారని, ప్రస్తుతం దాని డిజైన్ మారుస్తాననడం దారుణమని అన్నారు. మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎండల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది ఇంజనీర్లు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నారని అన్నారు.
ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం 1975లో మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడు డిజైన్ మారుస్తామని ఎందుకు అంటున్నారో, ఎవరి ప్రయోజనాలకోసం అంటున్నారో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రైతు సంక్షేమ సమితి ఉపాధ్యక్షుడు నైనాల గోవర్దన్, ప్రాణహిత చేవెళ్ల పరిరక్షణ కమిటీ ప్రతినిధి ప్రతాప్, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు మన్నారం నాగరాజు, అడ్వొకేట్ శారదాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.