అవినీతి వల్లే రైతులకు ఈ దుస్థితి
ఈ నెల 10న రైతు సదస్సు: జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: రైతుల ప్రస్తుత దుస్థితికి కారణం అవినీతి అని, అవినీతితో పేరుకుపోయిన రాజకీయాలను యువత కడిగేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2,800 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న రైతులు, భూనిర్వాసితులు, ఆదివాసీల సమస్యలపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సదస్సు పోస్టర్‌ను మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డితో కలసి ఆవిష్కరించారు.
గతేడాది కందులు, మిర్చి క్వింటాలుకు రూ.12 వేల వరకు ధర పలకగా, ప్రస్తుతం రూ. 5,500–6000 మధ్య మాత్రమే పలుకుతోందని, దీంతో మిర్చి రైతులు మార్కెట్‌లోనే పంటను తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పంటలను కొనుగోలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని విమర్శించారు. రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో దాతల సాయంతో ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతులకు నష్టపరిహారం అందించామని, 10న జరిగే సదస్సులోనూ దాతల సాయంతో పలువురికి నష్టపరిహారం అందిస్తామన్నారు.
సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తోంది కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతు సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైతే అల్లకల్లోలం సృష్టించాలని అప్పుడే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి ఆకుల భిక్షపతి, తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు మన్నారం నాగరాజు, సాంబశివుడు, కామేశ్వరరావు, సోగెరాబేగం తదితరులు పాల్గొన్నారు.