తెలంగాణ సర్కారు ఉత్తర్వులు
రూ. 3.13 కోట్ల అవినీతి అక్రమాలు జరిగినందునే
ఖమ్మం జిల్లాలోనూ రూ. 1.60 కోట్లు పక్కదారి
రాష్ట్ర వ్యవసాయశాఖలో అధికారుల ఇష్టారాజ్యం
రేపు జేడీఏలతో వ్యవసాయశాఖ కార్యదర్శి ప్రత్యేక సమావేశం
హైదరాబాద్: మెదక్ జిల్లా వ్యవసాయశాఖలో జరిగిన అవినీతి దెబ్బకు ఏడుగురు అధికారులు, ఉద్యోగులపై వేటు పడింది. ఆ జిల్లా వ్యవసాయశాఖకు చెందిన రూ. 3.13 కోట్ల నిధులు కాజేసిన సంఘటనలో ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించింది. జిల్లా వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు (జేడీఏ), డిప్యూటీ డెరైక్టర్ బి.హుక్యా, అసిస్టెంట్ డెరైక్టర్ కె.పద్మ, వ్యవసాయాధికారి జి.రమేష్, సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, సూపరింటెండెంట్ కె.కృష్ణారావు, ఆర్కేవీవైలో వ్యవసాయ యంత్రాల సెక్షన్‌కు చెందిన సీనియర్ అసిస్టెంట్ శ్యాంసుందర్, జాతీయ ఆహార భద్రత మిషన్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎం.రాములను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాము, శ్యాంసుందర్‌లను ఇప్పటికే జిల్లాస్థాయిలో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ అయిన వీరంతా ప్రభుత్వ అనుమతి లేకుండా మెదక్ జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. వ్యవసాయశాఖ తీసుకున్న ఈ చర్యతో రాష్ట్రవ్యాప్తంగా ఆ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వ్యవసాయశాఖలో ఏమాత్రం పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇటువంటి అవినీతి అక్రమాల సంఘటన జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నా పైస్థాయిలో అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నందునే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్న ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లాలోనూ... ఖమ్మం జిల్లాలో వ్యవసాయాంత్రీకరణ కింద 2014-15 ఆర్దిక సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గోల్‌మాల్ అయ్యాయని తేలింది.
ఆ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నార్మల్ స్టేట్ ప్లాన్ పథకం(ఎన్.ఎస్.పి) కింద రూ.4.79 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం(ఆర్.కె.వి.వై) కింద రూ.2.82 కోట్లు, జాతీయ ఆహార భద్రతా పథకం(ఎన్.ఎస్.ఎఫ్.ఎం) కింద రూ. 11.71 మంజూరు చేశారు. ఎన్‌ఎస్‌పి పథకం కింద పశువులతో నడిచే పరికరాలు, ట్రాక్టర్, రోటోవేటర్లు, రూ.లక్ష లోపు పరికరాలు, రూ.లక్ష నుంచి ఐదు లక్షల వరకున్న పరికరాలు, తైవాన్ స్ప్రేయర్లు, టార్పాలిన్లు, చిన్న ట్రాక్టర్లు, కలుపు తీసే యంత్రాలు తదితర వాటికి ఈ నిధులను వెచ్చించాలని విడుదల చేశారు. 40 నుంచి 50 శాతం వరకు సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యంత్ర పరికరాల కోసం నిధులను మంజూరు చేస్తుంది. ఆ నిధులను యంత్ర పరికరాలను అందించే కంపెనీల పేరిట చెక్కులను అందించాల్సి ఉంటుంది. కాని అందుకు బిన్నంగా మొత్తం నిధుల్లో దాదాపు రూ.కోటి సెల్ఫ్ చెక్కుల రూపంలో విడుదల చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ నిధులు కంపెనీలకు చేరాయా? లేదా? అనేది ప్రశ్నార్దకం. ఇవిగాక మరో రూ.60 లక్షల మేరకు లెక్కలు సక్రమంగా లేనట్లు సమాచారం. మొత్తంగా రూ.1.60 కోట్లకు సరైన లెక్కలు లేనట్లు సమాచారం. అయితే తమకు బకాయిలు చెల్లించాల్సి ఉందనీ... వాటిని చెల్లించాలని పరికరాల సరఫరా చేసిన కంపెనీలు వ్యవసాయశాఖను కోరాయి. కానీ బకాయిలు విడుదల కాకపోవడంతో ఆ కంపెనీలు హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
మొత్తం నిధుల్లో దాదాపు రూ. 6 కోట్ల వరకు ఈ కంపెనీకు చెల్లించాల్సి ఉందని తెలిసింది. ఎందుకింత బకాయిలు పేరుకుపోయాయన్నది తేలాల్సి ఉంది. రైతులకు చుక్కలు చూపిస్తోన్న వ్యవసాయాధికారులు... మండల స్థాయిలో లబ్దిదారులను ఎంపిక చేసి ఆ జాబితాలను జిల్లా వ్యవసాయ శాఖకు పంపితే అక్కడ జాబితాను పరిశీలించి తుది జాబితాను ప్రకటిస్తారు. కానీ ఈ విషయంలో ఏవోలు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. స్ప్రేయర్లు మొదలు ట్రాక్టర్ల వరకు తమకు ముడుపులు ఇచ్చిన వారికే వచ్చేలా చేస్తున్నారు. లేకుంటే ఆయా రైతుల దరఖాస్తులను పక్కనపడేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ దరఖాస్తులు కుప్పలు కుప్పలుగా మూలనపడి ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుంటే దరఖాస్తులు తీసుకునే దిక్కులేదు. కరువులో కొట్టుమిట్టాడే రైతుల పట్ల వ్యవసాయాధికారుల తీరు అత్యంత విచారకరం. ఇంత తంతు జరుగుతున్నా పైస్థాయి నుంచి పర్యవేక్షణ ఏమాత్రం లేకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వేలాది దరఖాస్తులు పేరుకుపోయాయి. దీనిపై విమర్శలు రావడంతో రెండు బృందాలు జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. రేపు జేడీఏలతో కార్యదర్శి ప్రత్యేక సమావేశం... మెదక్ అవినీతి, అక్రమాల వ్యవహారం బయటపడడంతో వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి బుధవారం జిల్లా జేడీఏలతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేయనున్నారు. జిల్లాలో కొనసాగుతోన్న పథకాలు, విడుదలైన నిధులు, ఖర్చు అయిన నిధులు, వాటికి సంబంధించిన ఆడిట్ నివేదికలన్నింటినీ తీసుకురావాల్సిందిగా ఆయన ఆదేశించారు.
జేడీఏ సహా ఏడుగురి సస్పెన్షన్...
Published Tue, Jan 26 2016 4:17 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement