మేం మారాం.. బతుకులే మారలే | Medak District Sarojini Nagar Store In Sakshi | Sakshi
Sakshi News home page

మేం మారాం.. బతుకులే మారలే

Published Wed, May 8 2019 11:44 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

చాపలు అల్లుతున్న మహిళలు  - Sakshi

ఒకప్పుడు వేశ్యా వృత్తే జీవనాధారంగా గడిపారు. రానురాను వారిలో మార్పు వచ్చింది. ఆ వృత్తికి పూర్తిగా స్వస్తి పలికారు. కానీ ఆ నీడ వారిని వెంటాడుతూనే ఉంది. కేసుల పాలై.. బెయిల్‌ కోసం తీసుకున్న అప్పులు కుప్పలుగా పేరుకుపోయి బతుకీడుస్తున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నారు. వృత్తిని మానేసినప్పటికీ ఆ ముద్ర అలానే ఉండడంతో ఉపాధి దొరక్క.. పునరావాస ప్యాకేజీ అందక దయనీయ స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఉదంతం ‘సాక్షి’ విజిట్‌లో వెలుగుచూసింది. ‘మేం మారాం.. మా బతుకులు మారలే.. అంటూ వాపోతున్న జాప్తిశివనూరులోని సరోజినీనగర్‌ వాసుల ఆక్రందనపై ప్రత్యేక కథనం.

సాక్షి, మెదక్‌: రామాయంపేట పట్టణ కేంద్రం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో.. హైదరాబాద్‌–నాగపూర్‌ జాతీయ రహదారి వెంట ఉన్న నార్సింగి మండలం జాప్తిశివనూరు గ్రామ శివారులోని సరోజినీనగర్‌ ఒకప్పుడు వేశ్యావాటిక. సీఐడీ దాడులు.. ఆ తర్వాత స్థానిక ప్రభుత్వ అధికారుల్లో వచ్చిన చలనంతో దాని రూపురేఖలే మారిపోయాయి. నిత్యం సీసీ కెమెరాల నిఘా.. అక్కడ నివసిస్తున్న వారిలో క్రమక్రమంగా వచ్చిన మార్పుతో వేశ్య వృత్తి సమూలంగా అంతరించింది. ఆ వృత్తిని మానిపించిన అధికారగణం  ప్రత్యామ్నాయం చూపించకుండా తూతూమంత్రపు చర్యలతో సరిపుచ్చుతుండడడం వారిని కుంగదీస్తోంది. సీఐడీ, ఆర్డీఓ, పోలీస్‌ కేసులు వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయి. ప్రతిఒక్కరూ అప్పుల పాలవడంతోపాటు ఉపాధి దొరకని దుస్థితి నెలకొంది.

ఇచ్చినట్లే ఇచ్చి.. 
గతంలో మెదక్‌ జాయింట్‌ కలెక్టర్‌గా దాసరి శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించగానే సరోజినీనగర్‌పై దృష్టి సారించారు. పునరావాసం చూపితే వారు వేశ్యవృత్తికి దూరమవుతారని భావించి.. ఈ మేరకు చర్యలు చేపట్టారు. వారు వ్యవసాయం చేసుకుని జీవించడానికి వీలుగా భూమి ఇప్పించారు. అక్కడ మొత్తం 32 కుటుంబాలు నివసిస్తుండగా.. ఏడు కుటుంబాలకు స్థానికంగా 13 ఎకరాల భూమి కేటాయించారు. పాస్‌ బుక్కులు సైతం అందజేశారు. సదరు లబ్ధిదారులు రూ.లక్షల్లో అప్పులు తెచ్చి భూమిని చదును చేశారు. బోర్లు వేసి.. కరెంటు మీటరు సైతం శాంక్షన్‌  చేయించుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులపాటు వేశ్యా వృత్తికి దూరంగా ఉన్నారు.  తీరా వ్యవసాయ పనులు ప్రారంభించే తరుణంలో అటవీశాఖ వారు రంగంలోకి దిగారు.

ఈ భూమి తమ పరిధిలో ఉందంటూ వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. చాలాకాలంపాటు తమకు న్యాయం జరుగుతుందని వేచిచూసినా.. పరిస్థితి మారలేదు. ఇదే క్రమంలో అప్పటి జేసీ దాసరి శ్రీనివాసులు బదిలీ అయ్యారు. ఆయన వెళ్లిపోగానే మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ 13 ఎకరాలే కాదు.. సరోజినీనగర్‌లో నివసిస్తున్న మూడు కుటుంబాలకు వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించి.. పాస్‌బుక్కులు కూడా ఇచ్చారు. మరికొన్ని కుటుంబాలకు కొల్చారం, నర్సంపల్లిలో భూమి కేటాయించినా పాస్‌బుక్కులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో నాలుగైదు నెలల తర్వాత తిరిగి వేశ్యావృత్తిలోకి వెళ్లారు.

కేసులు.. బెయిలు.. లక్షల్లో ఖర్చు
వేశ్యాగృహాలపై బెంగళూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన కేసు నేపథ్యంలో 2017 మార్చి 2న సీబీసీఐడీ, హైదరాబాద్, సంగారెడ్డికి చెందిన వందలాది మంది స్పెషల్‌ పోలీసులు ఒక్కసారిగా సరోజినీనగర్‌పై దాడి చేశారు. సివిల్‌ దుస్తుల్లో విటుల్లా వచ్చి.. బేరం మాట్లాడుకుని.. వేశ్యావాటికలను తమ అదుపులోకి తెచ్చుకున్నారు. పక్కా ప్రణాళిక, మెరుపువేగంతో సినీఫక్కీలో దాడులు నిర్వహించి సుమారు 30 గృహాల్లోని సెక్స్‌ వర్కర్లు, విటులు, వేశ్యావాటికల నిర్వహకులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అప్పటి నుంచీ వారిని కేసులు వెన్నాడుతున్నాయి. బెయిల్, వారం వారం కోర్టుకు, పోలీస్‌ స్టేషన్‌కు.. ఆ తర్వాత ఆర్డీఓ వద్దకు హాజరు వంటి వాటితో వారికి ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. సుమారు 70 మంది కేసుల విషయమై ఇప్పటివరకూ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తమకు బెయిల్,  కేసుల విషయమై రూ.లక్షల వరకు ఖర్చయ్యాయని.. అప్పులు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని.. పునరావాసం చూపించి ఆదుకుంటే సమాజంలో ఒకరిగా బతుకుతామని వారు వేడుకుంటున్నారు.

మారని ‘స్థానిక’ పరిస్థితులు 
సీఐడీ దాడులు.. ఆ తర్వాత స్థానిక పోలీసుల నిఘాతో ప్రస్తుతం సరోజినీ నగర్‌లో పరిస్థితులు మారిపోయాయి. వేశ్యావృత్తిని అందరూ స్వచ్ఛందంగా మానివేశారు. అయితే ఆ ముద్ర పడడంతో వారికి ఉపాధి దొరకని పరిస్థితి నెలకొంది. కూలీ పనులకు, ఏదైనా షాప్‌లో పనిచేసేందుకు వెళితే.. అవసరం లేదని, మిమ్మల్నెవరూ పనిలోకి తీసుకోరు.. అంటూ నిర్మోహమాటంగా సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు. చేసేదేమీ లేక ఇంటివద్ద చాపలు అల్లుకుంటూ జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రోజు మొత్తం పస్తులే ఉండాల్సి వస్తోందని.. పిల్లలను పోషించుకోలేక పోతున్నామని వాపోతున్నారు.

కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు
ఎవరూ ఆదరించని క్రమంలో.. పస్తులతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితుల్లో సరోజినీనగర్‌ వాసులు అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 2017 నుంచి ఇప్పటివరకూ కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. హోలికేర్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో పిల్లలతో సహా అందరం రెండు, మూడు సార్లు కలిశామని.. కలెక్టర్‌ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత జిల్లా అధికారులను రెండు సార్లు కలిశామని సరోజినీనగర్‌ వాసులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఏ అధికారి తమ కాలనీకి రాలేదని.. ఏ ఒక్క సమస్యనూ పరిçష్కరించలేదని చెబుతున్నారు. ఉపాధి దొర్క అల్లాడుతున్నామని.. తమ పిల్లలకు విద్య అందడం లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు.

రూ. 20 లక్షల వరకు ఖర్చయింది..
కేసులు అయ్యాక ప్రతి రోజు సంతకాలు పెట్టేందుకు తిరిగాం. ప్రయాణ ఖర్చులు భారమవుతున్నాయనే విషయంపై హైకోర్టులో పిటిషన్‌ వేశాం. కోర్టు ఆదేశాల మేరకు వారానికి ఒకసారి చొప్పున ఆరు నెలలు సంతకాలు పెట్టేందుకు తిరిగాం. ఆ తర్వాత 15 రోజులకు ఒక్కసారి తిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ కేసులతో  రూ.20 లక్షల వరకు ఖర్చయ్యాయి. అప్పుల్లో కూరుకుపోయాం. కేసులు కొట్టేస్తే ఏదో ఒక పని చేసుకుని బతుకుతాం. కేసులతో డిగ్రీ చదివిన వాళ్లు సైతం ఇబ్బందులు పడుతున్నారు.– సరోజినీనగర్‌ వాసులుపునరావాసం కల్పించండి.
.

వేశ్యావృత్తికి దూరమై రెండేళ్లు గడుస్తున్నా.. మాకు ఇంతవరకు పునరావాసం చూపలేదు. మా బతుకులు ఆగమైనయ్‌. తిండికి నోచుకోని పరిస్థితుల్లో సంసారాలు నెట్టుకొస్తున్నాం. మా బతుకులు రోడ్డున పడకముందే పునరావాసం కల్పించి ఆదుకోవాలి. – స్థానికురాలు

భూమి ఇచ్చినట్టే ఇచ్చి 
లాక్కున్నారు
మేం వృత్తికి దూరమైతే  వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పారు. కొందరికి మాత్రమే ఇచ్చారు. పట్టాదారు పాసుపుస్తకాలు సైతం అందజేశారు. కానీ భూమిని అటవీశాఖ వారు లాక్కున్నారు. భూమి ఇచ్చినట్లే ఇచ్చి లాక్కోవడం అన్యాయం. అందరికి భూమి కేటాయించి న్యాయం చేయాలి. –  స్థానికురాలు

రుణాలు మంజూరు చేయాలి

మాపై అనవసరంగా కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం మాకు బతుకే గగనంగా మారింది. ఇకనైనా అధికారులు మా గురించి పట్టించుకుని రుణాలు మంజూరు చేస్తే సమాజంలో బాధ్యతగా బతుకుతాం.– నర్సింగరావు, స్థానికుడు

 పునరావాసం కల్పించేలా కృషి చేస్తాం
సీఐడీ కేసు తర్వాత వారు వారు వృత్తి మానడానికి వీలుగా కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు టైలరింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాం. యువకులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారిని విడివిడిగా సమావేశపర్చి చైతన్యపర్చాం. దాతల సహకారంతో వారి కాలనీలో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 12 మంది యువకులకు నార్సింగి ఎస్‌బీఐలో ముద్ర లోను కోసం దరఖాస్తు చేయించాం. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రుణాలు మంజూరయ్యాయి. మరో పది మంది యువకులను ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు పెట్టించాం. – వెంకట్‌రెడ్డి, సీఐ, రామాయంపేట ]

టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించాం
పదేళ్ల క్రితం శిక్షణ ఇచ్చి ఉంటే వాళ్ల జీవితాలు మరోలా ఉండేవి. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి జ్యోతిపద్మ, పోలీస్‌ శాఖ నుంచి ఎస్పీ చందనాదీప్తి, సీఐ, ఎస్సైల ప్రోద్బలంతో శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చా. ఇంటికి ఒకరి చొప్పున మొత్తం 20 మంది మహిళలు, యువతులను ఎంపిక చేçసి.. ఆసక్తి గల వారికి టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించాం. ప్రస్తుతం శిక్షణ పూర్తయ్యింది. యూనిట్‌ పెట్టుకోవడం కోసం షెడ్‌ నిర్మించుకున్నారు. వాళ్లంతట వాళ్లే బతుకగల్గుతారు.   సునీతారాకేష్, ఎన్జీఓ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement