వసూళ్లకు కేంద్రం.. తహసీల్ కార్యాలయం
► మొగుళ్లపల్లిలో ప్రతీ పనికి ఒక రేటు
► కథ నడిపిస్తున్న వీఆర్వో, వీఆర్‌ఏలు
► రూ.5వేలు ఇస్తే విరాసత్ పట్టాలు మంజూరు
► పట్టించుకోని ఉన్నతాధికారులు
మొగుళ్లపల్లి : అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న వివిధ శాఖల అధికారుల్లో మార్పు రావడం లేదు. మొగుళ్లపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం ఇలాంటి అక్రమాలకు అడ్డాగా నిలుస్తోంది. నిబంధనలు అంగీకరించకున్నా సరే... చిరుద్యోగులను సం ప్రదించి వారు చెప్పిన నగదు సమర్పిస్తే చాలు ఆ పని అయిపోతుంది. వీరి వెనుక అధికారుల అండదండలు ఉండడం తో వసూళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దీంతో డబ్బు ఇవ్వలేని వారు ఇబ్బంది పడుతున్నారు.
రూ.5నుంచి రూ.7వేలు ఇస్తే..
రెవెన్యూ చట్టం ప్రకారం తండ్రి మృతి చెందిన తర్వాత వారసత్వంగా వారి కుమారులకు వ్యవసాయ భూములను విరాసత్ పట్టాలు చేస్తారు. దీనికోసం తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించడంతో పాటు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. అయితే, మండలంలో పలువురు రెవెన్యూ కార్యదర్శులు ఇలాంటేవీ లేకుండానే ఎకరానికి రూ.5నుండి రూ.7 వేల చొప్పున తీసుకుని విరాసత్ పట్టాలు చేశారు. ఇలా మం డల వ్యాప్తంగా 200కు పైగా పట్టాలు చేసినట్లు సమాచారం.
అలాగే, ఇసుక రవాణాపై నియంత్రణ ఉన్న నేపథ్యంలో వీ ఆర్వోలు ట్రాక్టర్ల యజమానుల నుండి రూ.5 నుండి రూ.8 వందలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా మండలంలో ఓ వీఆర్‌ఏ వద్ద తహసీల్దార్ సంతకాలతో కూడి న కొన్ని ఖాళీ ఇసుక పర్మిట్లు ఉండగా.. ఆయన డబ్బులు ఇచ్చిన వారికి వీటిని ఇస్తున్నట్లు సమాచారం. అయితే, పై అధికారి కనుసన్నుల్లోనే ఇది జరుగుతోందని తెలుస్తోంది.
స్పీకర్ హెచ్చరించినా తీరు మారని వైనం
తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న తతంగాన్ని పలువురు ప్రజాప్రతినిధులు స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆయన కొద్ది రోజుల క్రితం సదరు అధికారులను పిలిచి మందలించారని సమాచారం. అయినప్పటికీ అధికారులు, సిబ్బంది తీరులో మార్పు రాకపోవడం గమనార్హం.