న్యాయం చేయకపోతే ఆత్మహత్యే
- సాగుభూమి కోసం రైతు ఆందోళన
- పురుగు మందుడబ్బాతో ధర్నా
ఉరవకొండ : తాను 12 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి సాగుచేసుకుంటున్న భూమిని అధికారులు ప్రస్తుతం ప్రభుత్వ భూమి అంటున్నారని తనకు న్యాయం చేయాలని మండల పరిధిలోని రాకెట్ల గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి రమేష్ వాపోయాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని పురుగుమందు డబ్బాతో మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ 2005లో దాసరి చెన్నమ్మ అనే మహిళ తన తండ్రి ఎర్రిస్వామి, తల్లి అక్కమ్మకు 12.85 ఎకరాల భూమి విక్రయించిందన్నాడు.
వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నామని తెలిపాడు. భూమికి పాసుపుస్తకం కూడా మంజురైందని, అందులో వేరుశనగ, పప్పుశనగ సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా కూడా అధికారులు మంజురు చేశారని, అయితే అధికారులు ప్రస్తుతం ఈభూమి డైక్లాడ్‌లో ప్రభుత్వ భూమిగా చూపుతున్నారన్నారు. ఈ భూమి ప్రభుత్వ భూమి అయినపుడు ఎలా రిజిస్ట్రేషన్ చేశారో అధికారులు చెప్పాలని రమేష్ డిమాండ్ చేశారు. తమ భూమి తమకు దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ తిమ్మప్ప బాధిత రైతును పిలిపించి వివరాలు సేకరించారు.