రొళ్ల : పంట నష్టపరిహారం(ఇన్‌పుట్‌సబ్సిడీ) చెల్లించాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మండలంలోని కాకి, దొడ్డేరి, రత్నగిరి, గుడ్డుగుర్కి పంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులు రొళ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2014 నుంచి 2016 వరకు సంబంధించిన పంటనష్టపరిహారం చెల్లించాలన్నారు. 2014కు సంబంధించిన నష్టపరిహారం రొళ్ల, బీజీహళ్లి, ఎం రాయాపురం, హులీకుంట గ్రామాల రైతులకు మాత్రమే చెల్లించి తమకు చెల్లించలేదని వాపోయారు. అప్పట్లో పరిహారం చెల్లించేందుకు అధికారులు ప్రకటనలు కూడా చేశారన్నారు. అనంతరం మంజూరైన మొత్తాన్ని సస్పెన్స్ ఖాతాలోకి వెళ్లినట్లు తెలియజేశారన్నారు.
అయితే మిగిలిన పంచాయతీ రైతులకు చెల్లించడమేమీ తమకు మాత్రం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు చేతికందక నష్టాల పాలయ్యారన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగు ప్రారంభమైనప్పటికీ ఇంత వరకూ పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వడ్డీ వ్యాపారుల వద్ద నగదును తెచ్చుకొని సాగు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమది ప్రజాప్రభుత్వమని గొప్పగా చెప్పుకునే టీడీపీ రైతులను విస్మరించిందని విమర్శించారు. రైతుల పట్ల ఇలాగే వ్యవహరిస్తే రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయాన్ని ముట్టడించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ లక్ష్మినాయక్, ఎంపీడీఓ సరస్వతికి అందజేశారు. రైతులకు వైఎస్సార్‌సీపీ నాయకులు కాకి సర్పంచు నాగేంద్ర, నాయకులు లోకేష్, బసవరాజు, న్యాయవాది రంగనాథ్, నరసింహారెడ్డి, ప్రకాష్, రంగప్పరాజు, దేవరాజు, వీరానాయక్, మారేగౌడ్, నజీర్ తదితరులు మద్దతు తెలిపారు.
పంటనష్ట పరిహారం కోసం ధర్నా
Published Mon, Jun 12 2017 11:17 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement