rolla
-
గుడిలోకెళ్లి గంట కొట్టిన ఎలుగుబంటి!.. 105 కిలోల బరువైన..
సాక్షి, సత్యసాయి జిల్లా (రొళ్ల): అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన ఎలుగుబంటి ఆలయంలోని గంటను మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సీసీకెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాలు... శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలోని జీరిగేపల్లిలో వెలసిన అమ్మాజీ ఆలయంలో సోమవారం రాత్రి పూజాదికాలు ముగించుకున్న తర్వాత అర్చకులు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి రెండు ఎలుగు బంట్లు ప్రవేశించాయి. అందులో ఒకటి నేరుగా గరుడ స్తంభం వద్ద ఏర్పాటు చేసిన 105 కిలోల బరువైన గంటకు కట్టిన తాడును నోటితో లాగేందుకు ప్రయత్నించింది. సాధ్యం కాకపోవడంతో ముందరి కాళ్లతో దానిని పట్టుకుని లాగి గంట మోగించి పక్కకు వైదొలిగింది. మంగళవారం ఉదయం ఆలయం తలుపులు తీసిన అర్చకులు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను చూసి అవాక్కయ్యారు. చదవండి: (ఇక కుప్పం పోలీసు సబ్‌డివిజన్.. విడుదలైన రాజపత్రం) -
200 లీటర్ల పాలు నేలపాలు
రొళ్ల: అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందించే పాలపాకెట్లు నేలపై పడేసిన ఘటన రొళ్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... గురువారం రొళ్ల చెరువు కట్ట గుంతలో పూడ్చిన పాలపాకెట్లను కుక్కలు వాసన పసిగట్టి గుర్తించాయి. అటుగా వెళ్లిన ఎస్సీ కాలనీ వాసులు పాలపాకెట్లను చూసి ఆశ్చర్యపోయారు. సుమారు 2 వేలకు పైగా పాలపాకెట్లు పడేయడంతో ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సంబంధిత సూపర్వైజర్ లతాకిరణ్ను ప్రశ్నించగా పాలపాకెట్లు చెడిపోవడంతో వాటిని గుంతలో పూడ్చిపెట్టినట్లు తెలిపారు. ఏదిఏమైనా పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు అందించే పాలు వృథా కావడం చర్చనీయాంశమైంది. -
పంటనష్ట పరిహారం కోసం ధర్నా
రొళ్ల : పంట నష్టపరిహారం(ఇన్‌పుట్‌సబ్సిడీ) చెల్లించాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మండలంలోని కాకి, దొడ్డేరి, రత్నగిరి, గుడ్డుగుర్కి పంచాయతీ పరిధిలోని గ్రామాల రైతులు రొళ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2014 నుంచి 2016 వరకు సంబంధించిన పంటనష్టపరిహారం చెల్లించాలన్నారు. 2014కు సంబంధించిన నష్టపరిహారం రొళ్ల, బీజీహళ్లి, ఎం రాయాపురం, హులీకుంట గ్రామాల రైతులకు మాత్రమే చెల్లించి తమకు చెల్లించలేదని వాపోయారు. అప్పట్లో పరిహారం చెల్లించేందుకు అధికారులు ప్రకటనలు కూడా చేశారన్నారు. అనంతరం మంజూరైన మొత్తాన్ని సస్పెన్స్ ఖాతాలోకి వెళ్లినట్లు తెలియజేశారన్నారు. అయితే మిగిలిన పంచాయతీ రైతులకు చెల్లించడమేమీ తమకు మాత్రం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు చేతికందక నష్టాల పాలయ్యారన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగు ప్రారంభమైనప్పటికీ ఇంత వరకూ పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వడ్డీ వ్యాపారుల వద్ద నగదును తెచ్చుకొని సాగు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమది ప్రజాప్రభుత్వమని గొప్పగా చెప్పుకునే టీడీపీ రైతులను విస్మరించిందని విమర్శించారు. రైతుల పట్ల ఇలాగే వ్యవహరిస్తే రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయాన్ని ముట్టడించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ లక్ష్మినాయక్, ఎంపీడీఓ సరస్వతికి అందజేశారు. రైతులకు వైఎస్సార్సీపీ నాయకులు కాకి సర్పంచు నాగేంద్ర, నాయకులు లోకేష్, బసవరాజు, న్యాయవాది రంగనాథ్, నరసింహారెడ్డి, ప్రకాష్, రంగప్పరాజు, దేవరాజు, వీరానాయక్, మారేగౌడ్, నజీర్ తదితరులు మద్దతు తెలిపారు. -
307 బస్తాల సబ్సిడీ వేరుశనగ కాయల సీజ్
రొళ్ల (మడకశిర) : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తన కాయలను దళారులు అక్రమంగా నిల్వ చేసుకున్నట్లు అందిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు బుధవారం రాత్రి దాడి చేశారు. 307 బస్తాల కాయలను సీజ్ చేశారు. విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు ఆదేశాల మేరకు రొళ్ల మండలం హెచ్ఎంపల్లిలో ఓ వ్యాపారి రెండు ఇళ్లలో సబ్సిడీ వేరుశనగకాయలు నిల్వ చేసినట్లు సమాచారం అందిన వెంటనే విజిలెన్స్ సీఐ రెడ్డప్ప తమ సిబ్బందితో కలసి దాడి చేశారు. రూ.7.91 లక్షల విలువ చేసే 307 బస్తాల విత్తన కాయలను సీజ్ చేశారు. పంచనామా అనంతరం వాటిని ఏఓ అబ్దుల్ ఆలీకి అప్పగించారు. విజిలెన్స్ ఏఓ ఉమాపతి, హెడ్‌కానిస్టేబుల్ చిరంజీవి, వీఆర్ఏలు అశ్వర్థప్ప, రంగనాథ్ పాల్గొన్నారు. కాగా పైన పట్టుకున్న వేరుశనగ బస్తాల గురించి జాయింట్ కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఏఓ తెలిపారు. -
ఘనంగా 101 ప్రసాద వినియోగం
రొళ్ల : మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా శనివారం 101 ప్రసాద వినియోగం నిర్వహించారు. శుక్రవారం జరిగిన భూతప్ప ఉత్సవాల్లో భక్తులు కానుకుల కింద నైవేద్యంగా సమర్పించిన వడిబియ్యం, కందిపప్పు, బెల్లం తదితర వాటితో నియమ నిష్టలతో ప్రసాదం తయారు చేసి భూతప్ప ఆలయ ముందు ప్రసాదాన్ని 101 ముద్దలుగా చేసి ఉంచి పూజలు చేశారు. భూతప్ప ప్రతిమలకు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. దాసప్పలు ప్రసాదం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. అదేవిధంగా ఆదివారం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల పెద్దలకు కమిటీ తరఫున ప్రసాదం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
రొళ్ల( మడకశిర) : రొళ్ల మండల పరిధిలోని హేటిహళ్లి సమీపంలో నరసింహమూర్తి (42) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో అటుగా వెళ్లిన రైతులు మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో రొళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ నాగన్న ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అగళి మండలం, ముత్తెపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి గురువారం రాత్రి సీసీగిరిలో జరిగిన డ్రామా చూసేందుకు వెళ్లాడు. శవమై పడి ఉండడాన్ని ఆదివారం కనుగొన్నారు. నరసింహమూర్తి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
చీకటి పనులు
రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్ పరిధిలోని గుడ్డగుర్కి సమీపంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడి పొలంలో ఐదు రోజుల క్రితం జేసీబీతో తీసిన ఫారంపాండ్ ఇది. వాస్తవానికి ఇక్కడ సేద్యపు కుంట తీయకుండానే బిల్లులు స్వాహా చేశారు. ‘సాక్షి’లో కథనాలు ప్రచురించడంతో హడావుడిగా ఫారంపాండ్ తవ్వారు. అనంతపురం టౌన్ / రొళ్ల : పరిగెత్తే నీటిని నడిపించడం.. నడిచే నీటిని నిలబెట్టడం.. ఇదీ వాటర్‌షెడ్ పథకం ఉద్దేశ్యం. అవసరం లేకపోయి నా చెక్‌డ్యాంలు నిర్మించడం..బాగున్నా మరమ్మతులు చేయడం.. పనులు చేయకుండా బిల్లులు చేసుకోవడం.. ఇదీ టీడీపీ నేతల తీరు. రొళ్ల మండలం రత్నగిరి మెగా వాటర్‌షెడ్ పరిధిలో కోట్లు కొల్లగొట్టిన తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో దడ మొదలైంది. ప్రాజెక్టు పరిధిలోని రత్నగిరి, కాకి, దొడ్డేరి, గుడ్డగుర్కి పంచాయతీలో ఏడున్నరేళ్లలో రూ.11 కోట్ల విలువైన పనులు జరిగితే కేవలం 2016లో మాత్రమే రూ.5.88 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో చూపారు. ఫారంపాండ్లు, కొత్త చెక్‌డ్యాం లు, పాత చెక్‌డ్యాంల మరమ్మతు పేరుతో ‘ఫోర్డ్’ స్వచ్ఛంద సం స్థ ప్రతినిధులు దోచుకున్నారు. ఆయా పంచాయతీల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తమ పొలాలు, గ్రామాల్లోని వంకల్లో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేశారు. సా మాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూసినా కేవలం రూ.79 లక్షలు మాత్రమే అవినీతి జరిగిందని తేల్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ జరిగిన అక్రమాలపై 10వ తేదీన అవి‘నీటి’ ప్రవాహం.. 11న గుంతగుంతలో గూడుపుఠానీ.. 12న పైపై పూత నిధుల మేత... 18వ తేదీన ‘సమయం లేదు ‘తమ్ముడూ’.. దొరికినంత దోచుడు’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలు కలకలం సృష్టిం చాయి. వాటర్‌షెడ్ కమిటీ ముసుగులో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పనులు చేపట్టడం.. అసలు పనులే చేయకుం డా బిల్లులు చేసుకున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే ఫోర్డ్ ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పూర్తిస్థాయి విచారణ జరిగితే క్షేత్రస్థాయిలో పనులు లేని విష యం తెలిసిపోతుందని టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. దీంతో వారం రోజులుగా ఫారంపాండ్స్, చెక్‌డ్యాం ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. పోనీ వీటిని నాణ్యత గా చేస్తున్నారా అంటే అదీ లేదు. ఉన్నాయంటే.. ఉన్నాయన్నట్టు కడుతున్నారు. పైగా ఇక్కడ జరిగిన పనులకు సం బంధించి ఎం–బుక్కులు, ఇతరత్రా రికార్డులు స్వాధీనం చేసుకోవడంలో డ్వామా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇటీవల ప్రాజెక్ట్ కార్యాలయంలో వాటర్‌షెడ్ అసిస్టెంట్లు రికార్డులన్నీ సరి చేశారు. ఈ క్రమంలోనే ఎక్కడెక్కడ పనులు చేసినట్లు బిల్లులు తీసుకున్నారో చూసి వాటి వివరాలను తెలుగుదేశం పార్టీ నేతలకు తెలియజేసినట్లు సమాచారం. దీంతో వారు ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు, నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రత్నగిరి పంచాయతీలోని అలుపనపల్లికి చెందిన టీడీపీ నాయకులు మూడ్రోజులుగా ఆరు చెక్‌డ్యాం నిర్మాణాలను రాత్రి వేళ చేపడుతున్నారు. కాకి పంచాయతీలోని ఓ నాయకుడు సైతం రెండు చెక్‌డ్యాంలు, మూడు ఫారంపాండ్లను తవ్విస్తున్నారు.