200 లీటర్ల పాలు నేలపాలు
రొళ్ల: అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందించే పాలపాకెట్లు నేలపై పడేసిన ఘటన రొళ్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... గురువారం రొళ్ల చెరువు కట్ట గుంతలో పూడ్చిన పాలపాకెట్లను కుక్కలు వాసన పసిగట్టి గుర్తించాయి. అటుగా వెళ్లిన ఎస్సీ కాలనీ వాసులు పాలపాకెట్లను చూసి ఆశ్చర్యపోయారు.
సుమారు 2 వేలకు పైగా పాలపాకెట్లు పడేయడంతో ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సంబంధిత సూపర్‌వైజర్ లతాకిరణ్‌ను ప్రశ్నించగా పాలపాకెట్లు చెడిపోవడంతో వాటిని గుంతలో పూడ్చిపెట్టినట్లు తెలిపారు. ఏదిఏమైనా పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు అందించే పాలు వృథా కావడం చర్చనీయాంశమైంది.