మీరు పండించి రైతులకు చెప్పండి
‘ప్రత్యామ్నాయం’పై సీఎంకు జస్టిస్ చంద్రకుమార్ సూచన
సాక్షి, హైదరాబాద్: ప్రత్యామ్నాయ పంట లు వేయాలని సూచిస్తున్న సీఎం, వ్యవసాయ మంత్రి తొలుత వారు ఆ పంటలను పండించి ఆ తరువాత రైతులకు చెప్పాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కోరారు. పత్తి తదితర వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా కంది తర హా చిరుధాన్యాల పంటలను వేసి ఆచరించి చూపాలన్నారు. అలాగే ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం హామీ, మార్కెటింగ్ గ్యారంటీ కల్పించాలన్నారు. దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, సదరన్ యాక్షన్ ఆన్ జెనెటిక్ ఇంజనీరింగ్ సంస్థలు మంగళవారం ‘తెలంగాణ వ్యవసాయ భవిష్యత్తు’ అంశంపై నిర్వహించిన సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు.
‘అధిక ఆదా యం రావడం వల్లే రైతులు పత్తి పంట వేశారే తప్ప మరోటి కాదు. దానికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర వంటి పంటలు వేస్తే మద్దతు ధర ఇస్తారా? హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలకు చిరుధాన్యాలను సరఫరా చేయాలి. అందుకోసం ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయాలి. కల్తీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చి రైతులకు నష్టం చేకూరుస్తున్నాయి. వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్‌గా మారిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోయాయి. అనేకసార్లు బోర్లు వేయడం, అవి విఫలం కావడం వల్లే రైతు లు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. బహుళజాతి సంస్థలు, ధనికులు లాభపడడమే అభివృద్ధి కాదు. అత్యధిక ప్రజలకుపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలి’ అని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.
పత్తి వద్దనడం అంతర్జాతీయ కుట్ర...
కేసీఆర్ ప్రభుత్వం పత్తి వద్దని చెప్పడం రైతుల పట్ల ప్రేమతో కాదని... అందులో అంతర్జాతీయ కుట్ర దాగుందని వ్యవసాయరంగ నిపుణులు డి.నర్సింహారెడ్డి అన్నారు. బీటీ-2 విఫలమయినందున దాన్ని ప్రోత్సహిస్తే రైతులు ఊరుకోరని... అందుకే ప్రత్యామ్నాయంగా సోయాబీన్‌ను తెరపైకి తెచ్చారన్నారు. విత్తనాలు రైతుల చేతుల్లో లేవనీ... కంపెనీల చేతుల్లోకి వెళ్లాయని మండిపడ్డారు. ఉర్దూ వర్సిటీ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక 2,200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ‘ఇది బంగారు తెలంగాణ కాదని... బొందలగడ్డ తెలంగాణ’ అన్నారు. సారంపల్లి మల్లారెడ్డి, పీవీ సతీష్, జయశ్రీ, అరిబండ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.