‘ఉస్మానియా’ పనులు 4 ఏళ్లు పెండింగా?
ఎంఎస్‌ఐడీసీ అధికారులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఎంఎస్‌ఐడీసీ) పనితీరుపై ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరై నాలుగేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, ఎంఎస్‌ఐడీసీ ఎండీ రవిచంద్ర, వైద్యవిద్య సంచాలకుడు పుట్టా శ్రీనివాస్ తదితరులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం 200 కోట్లు మంజూరైనా నేటికీ పైసా కూడా ఖర్చు చేయని అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. స్థలం సమస్య సాకు చూపి మంజూరైన నిధులు ఖర్చు చేయకపోతే ఎలా అని రాజయ్య ప్రశ్నించారు.
ఏటా 50 కోట్లు ఖర్చు చేసినా ఈపాటికే ఉస్మానియా నూతన భవన నిర్మాణం పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమయ్యేవని అభిప్రాయపడ్డారు. ఆంధ్రపాలకుల నిర్లక్ష్యం, సంస్థలోని కొందరు అధికారుల అవినీతి, అలసత్వంవల్ల పనులు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎంఎస్‌ఐడీసీ పనులేవీ పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదని, ఉన్న నిధులన్నీ కచ్చితంగా వాడుకోవాలని ఆదేశించారు. చంచల్‌గూడ వద్దనున్న స్థలంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని సాధ్యమైనంత తొందర్లో నిర్మించేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అవినీతి, వసూళ్ల కేంద్రంగా ఎంఎస్‌ఐడీసీ మారుతున్నాయనే ఆరోపణలను సమావేశంలో ప్రస్తావించారు. ఒక ఉన్నతాధికారి, ఫార్మాసిస్టు కలసి సంస్థను అవినీతి కూపంగా మార్చారని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎంఎస్‌ఐడీసీని విభజించినప్పటికీ సాంకేతిక కారణాలవల్ల అధికారులను నియమించలేదు. తొందర్లోనే తెలంగాణ ఎంఎస్‌ఐడీసీకి పూర్తిస్థాయి యంత్రాంగాన్ని సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.