కొత్త భవనం కోసం పేద రోగుల ఎదురుచూపులు
శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతున్న భవనం
పాత బిల్డింగ్ కూల్చివేతపై కొనసాగుతున్న మీమాంస
కూలగొట్టి కడితేనే బహుళ ప్రయోజనమంటున్న కొందరు
హెరిటేజ్ భవనాన్ని కూల్చొద్దంటున్న మరికొందరు
కోర్టు పరిధిలో వివాదం.. ఎంతకూ తేల్చని ప్రభుత్వం
మహా నగరంతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు వందల ఏళ్ల నుంచి ప్రాణ ప్రదాయిని. లక్షలాది మంది పేద రోగులకు ప్రాణభిక్ష పెట్టిన ఘన చరిత్ర. అద్భుతమైన భవన నిర్మాణ శైలికి ప్రతీక.. అడుగడుగునా ఉట్టిపడే కళా సౌందర్యం. కానీ.. కాలం రివ్వున తిరిగింది. అన్నింటికీ ఎక్స్‌పైరీ డేట్ ఉన్నట్టే ఆ కళాఖండం కూడా చరమాంక దశకు చేరుకుంది.. అదే నగర నడి»ొడ్డున శతాబ్దం క్రితం నిర్మించిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించి రోగులకు మెరుగైన వసతులు కల్పించాలని కొందరు.. చారిత్రక కట్టడాలను కూల్చవద్దని మరికొందరు వాదిస్తుండటంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. ప్రభుత్వం కూడా ఎటూ తేల్చకుండా సందిగ్ధావస్థలో పడింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షి, సిటీబ్యూరో/అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని 1910లో రూ.50 వేల వ్యయంతో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మితమైంది. డంగు సున్నం, గచ్చుతో రెండంతస్తుల్లో దీనిని నిర్మించారు. అప్పట్లో 200 మంది రోగులు చికిత్స పొందేవారు. పెరుగుతున్న రోగుల తాకిడితో పాత భవనం ప్రాంగణంలోనే 1971లో ఓపీ బ్లాకును నిర్మించారు. 1992లో కులీ కుతుబ్‌షా బ్లాక్‌ను నిర్మించారు. ప్రస్తుతం రోజూ సుమారు 2 వేల మంది అవుట్ పేషెంట్లు, మరో 200 మంది రోగులు ఇన్‌పేòÙంట్లుగా చికిత్స పొందుతున్నారు. దేశంలోని అత్యున్నత బోధనాసుపత్రుల్లో ఉస్మానియా ఆస్పత్రి ఒకటి.
ప్రమాదకారిగా మారి..
ఎంతో మందికి ఎనలేని సేవలందిస్తూ వచి్చన ఉస్మానియా ఆస్పత్రి భవనం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడిపోయి.. ఎప్పుడు కూలిపోతుందో తెలియని దుస్థితికి చేరుకుంది. జులై 2020లో భారీ వర్షాల కారణంగా వరద నీరు ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరుకుంది. దీంతో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని ఖాళీ చేయించారు. రోగులను వేరే భవనాల్లోని ఇతర వార్డుల్లో సర్దుబాటు చేశారు. పరిపాలనా విభాగంతో పాటు శస్త్రచికిత్సల విభాగాలను కూడా ఖాళీ చేయించారు. ఇప్పుడు ఉన్న భవనాల్లో కొత్త పేషెంట్లను చేర్చుకోవడం, రోగులకు సేవలందించడం చాలా కష్టంగా మారిపోయింది.
ఎన్నాళ్లుగానో ఎదురుచూపులు..
ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం కోసం వేల మంది రోగులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కాకపోతే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఆస్పత్రి భవనం నిర్మాణానికి సవాలక్ష సవాళ్లు ఎదురవుతున్నాయి. చిక్కుముడుల వలలో చిక్కుకుపోతోంది. వందేళ్ల కింద నిర్మించిన భవనం కావడం.. హెరిటేజ్ భవనాల జాబితాలో ఉండటంతో దీన్ని కూల్చడం కష్ట సాధ్యంగా మారింది. దీన్ని ఇలాగే ఉంచి మిగిలిన ప్రాంతంలో కొత్త భవనం నిర్మించాలని కొందరు అంటున్నారు. అయితే.. పాత భవనాన్ని కూల్చేసి పూర్తిగా కొత్త భవనం నిర్మిస్తే పూర్తి స్థాయిలో రోగులకు అన్ని రకాల వసతులు అందుబాటులోకి తీసుకురావొచ్చని చెబుతున్నారు. గత ప్రభుత్వం కూడా పాత భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మాణం చేపట్టాలని భావించింది. కొందరు దీనిపై కోర్టుకెళ్లారు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
కమిటీ ఇలా చెప్పింది..
ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం స్థితిగతులు, కొత్త భవనం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై అప్పటి ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. పాత భవనం ఉపయోగించేందుకు పూర్తిగా పనికి రాదని తేలి్చంది. భవనానికి మరమ్మతులు చేయొచ్చని, ఆస్పత్రి కోసం కాకుండా వేరే వాటి కోసం వాడుకోవచ్చని సూచించింది. ఇలా చేస్తే ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించే స్థలం తక్కువ అవుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో మళ్లీ కథ మొదటికి
వచ్చింది.
25 ఎకరాల్లో పది అంతస్తుల్లో..
పాత భవనాన్ని కూల్చేసి కొత్త భవన సముదాయాన్ని దాదాపు 25 ఎకరాల్లో నిర్మించాలని ఆస్పత్రి పరిపాలనా విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో టవర్‌లో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పది అంతస్తుల్లో భవనం నిర్మించాలని సూచించింది. ఒక్కో టవర్‌ను 6 లక్షల చదరపు అడుగుల స్థలంలో నిర్మించాలని పేర్కొంది. దీంతో రోగులతో పాటు, వైద్య విద్యార్థులు, డాక్టర్లకు అన్ని రకాల సదుపాయాలు అందించవచ్చని తెలిపింది. నర్సింగ్ కాలేజీ కూడా నిర్మించే అవకాశం ఉంటుందని వివరించింది. ఇలా మొత్తం 35,75,747 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంది.
అక్కడ నిర్మించాలని ప్రతిపాదన..
పాత భవనం హెరిటేజ్ జాబితా కిందకు రావడంతో దాన్ని కూల్చకుండా మధ్య మార్గంలో వేరే ప్రాంతంలో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తే ఎలా ఉంటుందని కొందరు అంటున్నారు. చంచల్‌గూడ, కొత్తపేట మార్కెట్, గోషామహల్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రాంతాలను పరిశీలించారు. కానీ.. అందుకు కొందరు అంగీకరించట్లేదు. ఇప్పుడున్న ప్రాంతంలోనే భవనం నిర్మించాలని పట్టుబడు
తున్నారు.
చిక్కుముడులు విప్పేందుకు కృషి..
కొత్త భవనం నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. ఒక అడుగు ముందుకు పడితే రెండడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా ఎంతో నిబద్ధతతో ముందుకు వెళ్తోంది. కానీ.. చిక్కుముడులు మాత్రం వీడట్లేదు. ఎలాగైనా కొత్త భవనం నిర్మించి రోగులకు మేలైన సేవలు అందించాలనేదే నా కోరిక.
– డాక్టర్ బి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి
పాత భవనంతో ప్రయోజనం లేదు..
పాత భవనం అలాగే ఉంచితే అసాంఘిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఆ భవనాన్ని కూల్చేసి కొత్త భవనం నిర్మిస్తే పేద రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పాత భవనాన్ని చూసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది. ఎప్పుడు కూలిపోతుందో.. ఎప్పుడేం అవుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం.
– వి.నర్సింగ్ రావు, జియాగూడ
Comments
Please login to add a commentAdd a comment