సెల్‌ఫోన్ లైట్ ద్వారా ఫైళ్లు క్లియర్ చేస్తున్న ఉద్యోగి
- రెండు దఫాలు కరెంట్ కట్
- నిలిచిన శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు
అఫ్జల్‌గంజ్: రాష్ట్రంలోనే పెద్దాస్పత్రిగా ఖ్యాతిగాంచిన ఉస్మానియాకూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. సోమవారం ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు ఉస్మానియా ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో రోగ నిర్ధారణ పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో రోగులు, వారి సహాయకులు ఆందోళనకు గురయ్యారు. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వార్డుల్లో చికిత్సలు పొందుతున్న రోగులు, సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. దీంతో పాటు వివిధ విభాగాల్లో పని చేసే సిబ్బంది అత్యవసరమైన ఫైళ్లను క్లియర్ చేసేందుకు నానాపాట్లు పడ్డారు. సెల్‌ఫోన్ వెలుగులో ఫైళ్లను క్లియర్ చేశారు. అదే విధంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీజీ రఘురామ్ సైతం ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన ఫైళ్లను సెల్‌ఫోన్ వెలుగులో పరిశీలించి క్లియర్ చేయాల్సి వచ్చింది.