
ఉస్మానియాలో తెగిన లిఫ్టు వైర్
- 15 మంది చిక్కుకుపోయిన వైనం
- ఆపరేటర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం
- తొలగించి రక్షించిన పోలీసులు
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: ఉస్మానియా ఆసుపత్రి పాత భవనంలోని లిఫ్టు హఠాత్తుగా మధ్యలో నిలిచిపోయింది. అందులో చిక్కుకుపోయిన రోగులు, వారి సహాయకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు రెండు గంటల పాటు లిఫ్టులో ఊపిరాడక నరకయాతన అనుభవించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగింది.
రెండో అంతస్తు నుంచి కిందకు వస్తున్న ఈ లిఫ్టులో ఆసుపత్రి వైద్యులు సాంబిరెడ్డి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, ఆయా లక్ష్మీ, లిఫ్టు ఆపరేటర్ సత్యనారాయణలతో పాటు నిలోఫర్ ఆసుపత్రి నుంచి వచ్చిన గర్భిణి శ్రీదేవి, అత్తాపూర్‌కు చెందిన సురేష్ కేతాన్, రమేష్ కేతాన్‌లతో పాటు మొత్తం 15 మంది ఉన్నారు. లిఫ్టు కిందకు వస్తున్న క్రమంలో హఠాత్తుగా లిఫ్టు వైరు తెగిపోయింది.
ఇది గమనించిన లిఫ్టు ఆపరేటర్ సత్యనారాయణ అప్రమత్తమై సమయ స్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ మధ్యలో నిలిచిపోయింది. లిఫ్టు ఒక వైపు కొంచెం ఒరిగి ఉండటంతో అందులో చిక్కుకున్న రోగులు, వారి సహాయకులు పెద్ద పెట్టున అరుపులు, కేకలు పెట్టారు. సుమారు అరగంటసేపు ఎవరూ వీరిని పట్టించుకోకపోవడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. లిఫ్టు నుంచి సెల్‌ఫోన్లకు సిగ్నళ్లు అందకపోవడంతో ఈ సమాచారాన్ని చేరవేసేందుకు అష్టకష్టాలు పడ్డారు.
చివరకు రమేష్ కేతాన్ సెల్‌ఫోన్ నుంచి అతని స్నేహితుడైన జిఎల్ బిరానియాకు మెసేజ్ అందడంతో.. విషయం పోలీసులకు, ఫైర్ సిబ్బందికి తెలిపి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నాడు. పోలీసులు, లిఫ్టు మెకానిక్‌లు గ్రిల్స్ తొలగించి అందులో చిక్కుకుపోయిన వారిని నిచ్చెన సహాయంతో కిందకు దింపడంతో రోగుల సహాయకులు, వారి బంధువులు ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన సంభవించిందని రమేష్ కేతాన్ ఆవేదన వ్యక్తంచేశారు.