
నిలోఫర్, పేట్లబురుజు వైపే మొగ్గు!
ఉస్మానియా ఆస్పత్రి పడకల సర్దుబాటుపై వైద్యుల సమాలోచనలు
ఏరియా ఆస్పత్రుల్లో ఎంఎల్‌సీ కేసుల అంశంలో సమస్యలు వ చ్చే అవకాశం
ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, పేట్లబురుజు మూడు, నాలుగో అంతస్తులు ఉత్తమం
విభాగాలన్నీ ఒకే చోట ఉంటాయని భావన
సిటీబ్యూరో: శిథిలావస్థకు చేరిన ఉస్మానియా పాతభవనంలోని 857 పడకల సర్ధుబాటుపై ప్రభుత్వం తర్జన భర్జనలో పడుతోండగా, వైద్యులు మాత్రం నిలోఫర్, పేట్లబురుజు ఆస్పత్రుల వైపే మొగ్గుచూపుతున్నారు. అధికారులు ప్రతిపాదించిన కింగ్‌కోఠి, వనస్థలిపురం, నాంపల్లి, మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రులకు బదులు వీటిని ఎంపిక చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదని వారు భావిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి స్వయంగా ఆస్పత్రిని పరిశీలించారు. వారం రోజుల్లో పాతభవనాన్ని ఖాళీ చేయించి,ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడంతో వారు కింగ్‌కోఠి, నాంపల్లి, మలక్‌పేట్, ఫీవర్, నిలోఫర్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రుల ను ప్రతిపాదించారు.
ప్రతిపాదిత ఆస్పత్రుల్లో మంత్రి తనిఖీలు
క్యాజువాలిటీ బిల్డింగ్‌లోని రేడియాలజీతో పాటు అన్ని విభాగాలకు సంబంధించిన అవుట్‌పేషెంట్ విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. కులికుతుబ్‌షా భవనంలో ఎంఆర్‌ఐ, సీటీస్కాన్ విభాగాలతో పాటు కార్డియాలజీ, సీటీసర్జరీ, నెఫ్రాలజీ, పాథాలజీ లేబోరే టరీ కొనసాగుతోంది. పాతభవనంలో ప్రస్తుతం జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరాల జీ, డెర్మటాలజీ, సుఖవ్యాధులు, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఇన్‌పేషంటు వార్డుల్లో 857 పడకలు ఉన్నాయి. వీటిలో జనరల్ మెడిసిన్, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, డీవీఎల్ జైల్ వార్డుల్లోని 316 పడకలను ఫీవర్‌ఆస్పత్రికి, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట రాలజీ, పోస్టు ఓపీవార్డుల్లోని 356 పడకలను నిలోఫర్, మలక్‌పేట్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులకు, ఆర్థోపెడిక్స్‌లోని 120 పడకలను కింగ్‌కోఠి ఆస్పత్రికి, న్యూరాలజీ వార్డులోని 46 పడకలను ఫీవర్, గాంధీ ఆస్పత్రులకు తరలించాలని భావించారు. ఆరోగ్యశ్రీవార్డులోని 19 పడకలను ఏరియా ఆస్పత్రికి, న ర్సింగ్ స్కూల్‌ను వెంగల్‌రావునగర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు, డెంటల్ కాలేజీని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ఆయా ఆస్పత్రులను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు.
ఒకేచోట 450 పడకలు సర్దుబాటు..
ఇదిలా ఉండగా ఉస్మానియా వైద్యులు, సిబ్బంది, అధికారులు సమావేశమై ప్రత్యామ్నాయాలపై విస్త్రృతంగా చర్చించారు. కీలకమైన ఆర్థో, గ్యాస్ట్రో విభాగాలను ఏరియా ఆస్పత్రుల కు తరలించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడుతున్నారు. ఏరియా ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు చిన్నగా ఉండటంతో పాటు మెడికో లీగల్ కేసులు వస్తే ఏరియా ఆస్పత్రి వైద్యులు అటెండ్ కావాలా? ఉస్మానియా వైద్యులు అటెండ్ కావాలా? అంశంపై సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటికి పరిషా ్కరంగా నిలోఫర్ ఆస్పత్రి సమీపంలో 400 పడకల సామర్థ్యంతో ప్రస్తుతం సిద్ధంగా ఉన్న ఎన్‌ఆర్‌హెచ్‌ఎం బిల్డింగ్ వాటిని తరలిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఒకేచోట ఎనిమిది ఆపరేషన్ థియేటర్లు ఉండటం అనుకూలంగా ఉంటుందన్నారు. పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి మూడు, నాలుగో అంతస్థులు ఖాళీగా ఉన్నందున మిగిలిన పడకలను ఇక్కడ సర్దుబాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదనే వారు పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్ సేవలకు అవసరమైతే ఫీవర్ ఆస్పత్రిని కూడా వినియోగించు కోవచ్చు. ఇదిలా ఉండగా పడకల సర్ధుబాటు అంశాన్ని ప్రభుత్వం కూడా వైద్యుల అభీష్టానికే వదిలేయడం కొసమెరుపు.
కింగ్ కోఠికి ఆర్థోపెడిక్ విభాగం
సుల్తాన్‌బజార్, వనస్థలిపురం: ఉస్మానియా ఆసుపత్రి అర్థోపెడిక్ విభాగంలోని 99 పడకలను కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రికి తరలించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం కింగ్‌కోఠి ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆసుపత్రిలోని వార్డులు, ఓపి విభాగం ఇతర సౌకర్యాలను పరిశీలించారు. వారం రోజుల్లో ఆర్థోపెడిక్ విభాగాన్ని తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టిఎస్‌ఎంఐడీసీ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీఎంఈ డాక్టర్ రమణి, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వీణాకుమారి, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్, ఉషాబాల, సుజాత, శివప్రసాద్, ఆర్‌ఎంవో సరోజ తదితరులు ఉన్నారు.
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో:
కమిషనర్ వీణాకుమారి, డీఎంఈ రమణి, తదితరులు శుక్రవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిని సందర్శించి వసతులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో పేషెంట్ల తాకిడి, ఇన్‌పెషెంట్ బెడ్స్, ఆపరేషన్ థియేటర్లు, అదనపు గదులు తదితర అంశాలపై మంత్రి తదితర అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
నిలోఫర్‌లో...
ముఖ్యమంత్రి సూచన మేరకు ఉస్మానియా వైద్యులు నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించారు. కొత్తగా నిర్మించిన ఎన్‌ఆర్‌హెచ్‌ంఎం భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ బొంగు రమేష్, డాక్టర్ నాగేందర్ ఉన్నారు.