
హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 32లోని స్థలానికి సంబంధించి అధికారులు తనకు పట్టా ఇవ్వడం లేదని, ఏళ్ల తరబడి వారి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ శేరిలింగంపల్లికి చెందిన శంకర్ హైకోర్టులో శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. వీపు, ఛాతీ భాగంలో మంటలు అంటుకొని గాయాలు కావడంతో అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కిరోసిన్‌తో శంకర్ హై కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించాడు. కిరోసిన్‌ను ఒంటిపై చల్లుకుని 8వ నంబర్ కోర్టు హాలు వద్దకు చేరుకున్నాడు. తనకు న్యాయం చేయడంలేదని అరుస్తూ.. శరీరానికి నిప్పంటించుకుని కోర్టులోనికి వెళ్లాడు. వీపు, ఛాతీ భాగంలో మంటలతో కోర్టులోకి వచ్చిన శంకర్‌ను చూసి న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ, న్యాయవాదులు నిర్ఘాంతపోయా రు. కె.చిదంబరం అనే న్యాయవాది తేరుకుని శంకర్ చొక్కాను చించేశారు. మిగిలిన న్యాయవాదులు కూడా సహకరించడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటన లో శంకర్ శరీరంపై 15 శాతం మేర గాయాలయ్యాయి. న్యాయమూర్తి ఆదేశంతో పోలీసులు శంకర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 32లో ఉన్న స్థలంలో రెవిన్యూ అధికారులు తనకు పట్టా ఇవ్వడం లేదని, ఎన్ని సార్లు కోరినా కూడా పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో శంకర్ ఆత్మహత్యాయత్నం చేశాడని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం, అది విచారణకు నోచుకోకపోవడంతోనే ఇలా చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ దిశగా అధికారులు విచారణ జరిపారు. అయితే హైకోర్టులో శంకర్‌కు సంబంధించి ఎలాంటి కేసు లేదని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఇదే విషయంలో శంకర్ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా హైకోర్టు భద్రతా అధికారుల వివరణ కోరినట్లు తెలిసింది. కాగా కోర్టు విధులకు భంగం కలిగించాడంటూ శంకర్‌పై చార్మినార్ పోలీసులు ఐపీసీ 186, 226 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.