గేమ్ ఛేంజర్(Game Changer) చిత్రాన్ని తమ లోకల్ ఛానెల్‌లో (local channel) ప్రసారం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. అయితే, ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చి వారం గడవక ముందే కొందరు పైరసీ కాపీని తమ లోకల్ ఛానల్స్‌లలో ప్రసారం చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది. ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ ఆగ్రహం చెందడమే కాకుండా పోలీసులను ఆశ్రయించింది. దీంతో గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తాజాగా ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
గేమ్ ఛేంజర్ విడుదలైన వెంటనే ఈ చిత్రం పైరసీ బారిన పడింది. నెట్టింట ఈ సినిమాకు సంబంధించిన లింకులు భారీగా షేర్ అయ్యాయి. అయితే, కేబుల్ నెట్‌వర్క్‌లో కూడా ఈ చిత్రం ప్రసారం అవతుందని కొందరు స్క్రీన్ షాట్స్ తీసి చిత్ర నిర్మాణ సంస్థకు ట్యాగ్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై చాలామంది ప్రముఖులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
(ఇదీ చదవండి: మహానగరంలో బాలీవుడ్ ప్రముఖలపై జరిగిన దాడులు ఇవే)
ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
కొందరు ఏకంగా చిత్ర నిర్మాణ సంస్థనే బెదిరించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. వారిపై కూడా చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని, సినిమా విడుదల కాగానే ఆన్‌లైన్‌లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.
రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే, ఈ కలెక్షన్లపై కూడా నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కలెక్షన్ల వివరాలు తప్పుగా చెప్పారని పలువురు నెటిజన్లు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment