చిత్రం విడుదలకు కేవలం ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలింది. రిలీజ్‌కు సంబంధించి కౌంట్‌డౌన్ ముగియనుంది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మరో అద్భుతమైన పాత్రలో తమ ఫేవరెట్ స్టార్‌ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏ పెద్ద స్టార్ సినిమా విడుదల ముందైనా సర్వసాధారణంగా జరిగేవే. అవన్నీ అలా ఉంచితే... ఇటీవల భారీ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు బాగా చర్చకు నోచుకుంటున్నాయి. గత కొంత కాలంగా భారతీయ సినిమాలకు సంబంధించి హిట్స్, ఫ్లాప్స్ అన్నీ వసూళ్లతోనే ముడిపడడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది.
ఈ నేపధ్యంలో గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్ గురించి కూడా సినిమా వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి భారీగా హైప్ వచ్చినప్పటికీ అడ్వాన్స్ టిక్కెట్ల విక్రయం ప్రకారం చూస్తే ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి. భారీ సంచలన చిత్రాల దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ ల కలయికే ఓ సెన్సేషన్ కావడంతో ఈ టాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ అందరి దృష్టినీ ఆకర్షించింది, అయితే కనపడుతున్న స్పందన మాత్రం అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా డైరెక్టరే అని పలువురు భావిస్తున్నారు.
ఊహించిన దానికన్నా శంకర్ ప్రేక్షకుల్లో తన పట్ల ఆదరణ తగ్గించుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. అదే సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. నిజానికి ఒకప్పుడు శంకర్ అంటే పెద్ద బ్రాండ్, కానీ ఇటీవల ఈ డిఫరెంట్ సినిమాల ఫిల్మ్ మేకర్ తన క్రేజ్‌ను కోల్పోయాడు. అతని సినిమాలు గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాయి ఆయన చివరి సినిమా భారతీయుడు 2 ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో మనం చూశాం.
కలెక్షన్లలో వ్యత్యాసం..చెబుతోంది అదే...
సినిమా విడుదలకు మరో రోజు మిగిలి ఉండగా...గురువారం ఉదయం 10 గంటల నాటికి గేమ్ ఛేంజర్ 1వ రోజు మన దేశంలో దాదాపు 5 లక్షలకు పైగా టిక్కెట్‌లను విక్రయించిందని సమాచారం. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ విలువ 14.83 కోట్ల గ్రాస్ (బ్లాక్ చేసిన సీట్లు మినహా)కు చేరింది. ఇప్పటివరకు దాదాపు 8,000 షోలు లిస్ట్ చేశారు. తర్వాత వాటి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.
ఆంధ్రలో టాప్..తమిళనాడులో డ్రాప్...
రాష్ట్రాల వారీగా చూస్తే టిక్కెట్ల విక్రయంలో ఆంధ్రప్రదేశ్ భారీ తేడాతో ముందంజలో ఉంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే గేమ్ ఛేంజర్ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 8.72 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ 3.06 కోట్లు, కర్ణాటక 1 కోటి ఉన్నాయి. విశేషం ఏమిటంటే తమిళనాట ఇంకా 1 కోటి మార్కును సైతం ఈ సినిమా టచ్ చేయలేదు, విచిత్రంగా తమిళనాడుకు చెందిన టాప్ డైరెక్టర్ శంకర్ సినిమా అయినప్పటికీ అక్కడ ఈ పరిస్థితి ఉండడం షాకింగ్ అనే చెప్పాలి. శంకర్ పట్ల జనాదరణ ఎంతగా తరిగిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
గుంటూరు కారం కన్నా..ఘాటు తక్కువే...
రామ్ చరణ్ నటించిన సినిమా బుకింగ్స్ విలువ గురువారం ముగిసే సరికి 20 కోట్ల మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు, కానీ అప్పటికీ ముందస్తు అంచనాలను ఇది అందుకోవడం లేదనే చెప్పాలి. ఇంత భారీ చిత్రంగా పేర్కొనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను సైతం బీట్ చేయడంలో ఇది ఖచ్చితంగా విఫలమవుతుంది, గత సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మొదటి రోజు 24.90 కోట్ల గ్రాస్ టిక్కెట్లను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment