సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో అపరాధం జరిగింది. ఒకరికి చెందిన మృతదేహాన్ని మరొకరికి అప్పగించిన ఘటన చోటుచేసుంది. దీంతో మృతుడి బంధువులు నిరసనకు దిగారు. పోలీసులు తమ తప్పు తెలుసుకుని.. అంత్యక్రియలు నిర్వహించిన శవానికి గురువారం రీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియ ఆస్పత్రి మార్చురీకి తరలించిన ఘటన ఇది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శివరాంపల్లికి చెందిన పాండురంగాచారి (70) కట్టెల మిల్లులో దినసరి కూలీ. ఈ నెల 10న మైలార్‌దేవ్‌పల్లిలో స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పాండురంగాచారి ఈ నెల 12న మృతి చెందాడు. పని నిమిత్తం వెళ్లి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు యజమానిని సంప్రదించారు. అతను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఉస్మానియా మార్చురీలో ఉన్న గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించాల్సిందిగా సూచించారు.
ఈ క్రమంలో సంజీవరెడ్డి నగర్‌కు చెందిన ఇతరులు పొరపాటున పాండురంగాచారి మృతదేహం తమకు చెందినదేనని అంగీకరించడంతో ఎస్సార్‌నగర్ పోలీసులు పాండురంగాచారి మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహానికి వారు అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం పాండురంగాచారి కుటుంబీకులు మార్చురీకి వచ్చారు. అదేరోజు మిస్సింగ్ కేసు నమోదైన మరో వ్యక్తి మృతదేహాన్ని వారికి చూపించారు. అది పాండురంగాచారి శవం కాదని వారు నిర్ధారించారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో.. అప్పటికే అంత్యక్రియలు నిర్వహించిన పాండురంగాచారి మృతదేహాన్ని రీ పోస్టుమార్టం చేసేందుకు మార్చురీకి తరలించారు. పోలీసుల నిర్వాకంతో రెండు కుటుంబాల సభ్యులు మనోవేదనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment