34 ఏళ్ల క్రితం కిడ్నీ మార్పిడి
♦ ఇప్పటికీ ఆరోగ్యంగా కిడ్నీ దాత, స్వీకర్త
♦1982 మే 16న ఉస్మానియా ఆస్పత్రిలో తొలిసారి శస్త్రచికిత్స
హైదరాబాద్: వైద్య చరిత్రలో ఇదో మైలురాయి. 34 ఏళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి, ఆయనకు అవయవాన్ని దానం చేసిన దాత ఇప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో తొలిసారిగా చేసిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఇదే కావడం గమనార్హం. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్ రెడ్డి పర్యవేక్షణలో డాక్టర్ గోపాలకృష్ణ, యూరాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్‌రావుల నేతృత్వంలోని వైద్య బృందం 1982 మే 16న నగరంలోని డబీర్‌పురాకు చెందిన మహ్మద్ ఇబ్రహీం(67)కు తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసింది. ఇబ్రహీం సోదరుడు ఇషాక్ ఆయనకు కిడ్నీ దానం చేశారు.
వీరికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసి ఇప్పటికి 34 ఏళ్లు పూర్తవుతుండగా.. వీరిద్దరూ ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఇబ్రహీంకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సకు అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. కాగా, కిడ్నీ మార్పిడి చేయించుకుని ఎక్కువ కాలం జీవించిన వారి జాబితాలో ఇబ్రహీం నాలుగో వ్యక్తి అని వైద్యులు చెపుతున్నారు.
ఇది ఉస్మానియా వైద్యుల చలవే
అప్పట్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఎక్కడా చేసేవారు కాదు. ఉస్మానియాలో పరీక్షలు చేయిస్తే కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు చెప్పారు. మొట్టమొదటిసారిగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రావడంతో మా తమ్ముడు తన కిడ్నీని దానం చేశాడు. అప్పట్లో రక్త పరీక్షలకు బొంబాయికి పంపేవారు. నెలకు రూ.వెయ్యి ఖర్చయ్యేది. మాకు ప్రభుత్వ ఖర్చులతోనే చేశారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఉస్మానియా వైద్యుల చలువే.
- ఇబ్రహీం, తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన వ్యక్తి
ఎంతో ఆనందంగా ఉంది
మా అన్న ఇబ్రహీంకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దాత కోసం చూసినా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నా కిడ్నీలు ఆయనకు మ్యాచ్ అవుతాయని వైద్యులు చెప్పడంతో ఇవ్వడానికి అంగీకరించా. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. అప్పటికి మా ఇద్దరికీ పెళ్లి కాలేదు. చికిత్స చేయించుకున్న రెండేళ్ల తర్వాత మా అన్న వివాహమైంది. ఆ తర్వాత నాదైంది. ప్రస్తుతం మా ఇద్దరికీ ముగ్గురు, ముగ్గురు పిల్లలున్నారు. మేం ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం.
- ఇషాక్, కిడ్నీ దాత