
జానకిరామ్‌కు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్ శివారులోని హరికృష్ణ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు
చితికి నిప్పంటించిన పెద్ద కుమారుడు తారక రామారావు
శోకసంద్రంలో నందమూరి కుటుంబం.. బోరున విలపించిన హరికృష్ణ
జానకిరామ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
హరికృష్ణ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖుల రాక
హైదరాబాద్/ మొయినాబాద్ రూరల్: నందమూరి జానకిరామ్‌కు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు అశ్రునయనాలతో ఆదివారం తుది వీడ్కోలు పలికారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తుజాగూడ సమీపంలో ఉన్న హరికృష్ణ వ్యవసాయ క్షేత్రంలో జానకిరామ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
నల్లగొండ జిల్లా ఆకుపాముల గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ (42) మృతి చెందిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి జానకిరామ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించి.. శనివారం రాత్రే ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మసాబ్‌ట్యాంక్ ప్రాంతంలోని హరికృష్ణ నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. జానకిరామ్ మృతి వార్త తెలిసిన నందమూరి బంధుగణంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక కన్నీటిలో మునిగిపోయిన హరికృష్ణను, మా నాన్నకేమైందంటూ రోదిస్తున్న జానకిరామ్ కుమారుడు తారకరామారావును, సోదరులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లను బంధుమిత్రులు, ఆప్తులు ఓదార్చారు. హీరో నందమూరి బాలకృష్ణ, నంద మూరి బంధువులు హరికృష్ణ ఇంటి వద్దకు చేరుకొని జానకిరామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బంధువులు, అభిమానుల సందర్శనార్థం జానకిరామ్ పార్థివ దేహాన్ని ఇంటి ఆవరణలో ఉంచారు. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్, దగ్గుబాటి వెంకటే శ్వరరావు తదితరులు అంతిమ సంస్కారాలకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
అంత్యక్రియల కోసం ఒకటిన్నర గంటల సమయంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తుజాగూడ గ్రామ సమీపంలోని హరికృష్ణ ఫామ్‌హౌస్‌కు పార్థివ దేహాన్ని తరలించారు. వాహనం ముందు సీట్లో హీరో కల్యాణ్‌రామ్, జానకిరామ్ పెద్ద కుమారుడు తారకరామారావు కూర్చున్నారు. ఆ వాహనం వెనుక నారా లోకేశ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు వారి వాహనాల్లో వెళ్లారు. ఫామ్‌హౌస్‌లో జానకిరామ్ కుమారుడు తారక రామారావుతో అంత్యక్రియలు నిర్వహింపజేశారు. ఈ సమయంలో కుమారుడిని గుర్తుచేసుకుంటూ హరికృష్ణ బోరున విలపించారు.
పరామర్శించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర ప్రముఖులు
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9.30 గంటలకు నందమూరి హరికృష్ణ నివాసానికి వెళ్లి జానకిరామ్ కుటుంబసభ్యులను ఓదార్చారు. వారితో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు పరిటాల సునీత, చిన రాజప్ప కొల్లు రవీంద్ర, ఎంపీలు చిరంజీవి, కె.నారాయణ, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రులు కె.విజయరామారావు, పెద్దిరెడ్డి, కాసు కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే బాబూమోహన్, వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు అడుసుమిల్లి జయప్రకాశ్, కృష్ణయాదవ్, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. కాగా సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, డి.సురేష్‌బాబు, ఆదిశేషగిరిరావు, బోయపాటి శ్రీనివాస్, పూరీ జగన్నాథ్, జగపతిబాబు, బండ్ల గణేశ్, శ్రీను వైట్ల, చలపతిరావు, అల్లు అర్జున్, నారా రోహిత్, మంచు విష్ణు, అల్లరి నరేష్, జీవిత, వందేమాతరం శ్రీనివాసరావు, గీతాంజలి, పృథ్విరాజ్, జయవాణి, అఖిల్ తదితరులు హరికృష్ణ కుటుంబాన్ని
ఓదార్చారు.
ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు
మునగాల: జానకిరామ్ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ జిల్లా మునగాల ఎస్‌ఐ ఎస్.రమేశ్ తెలిపారు. ఎస్‌ఐ వెల్లడించిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడానికి చెందిన రైతు వెంకన్న ఆకుపాముల జాతీయ రహదారి పక్కన సాగు చేసిన వరినారును తీసుకెళ్లడానికి సొంత ట్రాక్టర్‌తో వచ్చాడు. వరినారు తీసుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు ఆకుపాముల శివారులో రాంగ్‌రూట్‌లో వచ్చి.. ట్రాక్టర్‌ను యూ టర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న జానకిరామ్ టాటా సఫారీ వాహనం ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌ను డ్రైవర్ నడుపుతున్నాడా..? యజమాని నడిపాడా? అన్నది ఇంకా తేలాల్సి ఉందని ఎస్‌ఐ చెప్పారు. ప్రస్తుతానికి పరారీలో ఉన్న డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, అతని పేరు కూడా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
‘ఎన్టీఆర్ కుటుంబంతో నా అనుబంధం ప్రత్యేకమైనది. జానకిరామ్ మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ నా మోకాలి గాయం కారణంగా.. వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించలేకపోయాను. ఈ విషాదం నుంచి కోలుకునే స్థైర్యాన్ని నందమూరి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’’
- కైకాల సత్యనారాయణ
‘‘అన్నగారు ఎన్టీఆర్‌తో నాకున్న అనుబంధం గురించి తెలిసిందే. చెన్నైలో ఉన్నప్పట్నుంచీ హరికృష్ణ కుటుంబంతో స్నేహబంధం ఉంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత తన తాత పేరు మీద జానకిరామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్‌ను ఆరంభించారు. అప్పుడు నిర్మాతల మండలిలో సభ్యత్వం కోసం వేరే నిర్మాత సంతకం అడిగితే.. తను నా దగ్గరికే వచ్చాడు. మా కుటుంబంతో అంత చనువుగా ఉండేవాడు. అలాంటి జానకిరామ్ ఇప్పుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. దేవుడు హరికృష్ణ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.’’
- మోహన్‌బాబు
‘జానకిరామ్ మరణవార్త చాలా బాధ కలిగించింది. ‘గోపాల గోపాల’ షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉన్నందున రాలేకపోయాను. హరికృష్ణ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. జానకిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’’
- పవన్ కల్యాణ్