సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ సోమవారం సందర్శించారు. బిల్డింగ్ పరిస్థితిని, అక్కడి వసతులను స్వయంగా సమీక్షించిన ఆమె.. రోగులకు అందుతున్న వైద్యం పైనా ఆరా తీశారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రి మెయింటెనెన్స్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారామె.
ఉస్మానియా లో కనీసం 3000 నుంచి 4000 బెడ్స్ ఉండాలి. కానీ, ఒక్క భవనంలోని మూడు బిల్డింగ్‌లకు సరిపడా రోగులు ఉంచుతున్నారు. ప్రభుత్వ ఇనిస్టిట్యూట్‌ల మీద నాకు అవగాహన ఉంది. కానీ, ఇంత ఇరుకుగా ఉన్న చోట మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి నా అభినందనలు.
మొదట్లో లేఖ అందింది..
2019 లో గవర్నర్ అయ్యాక మొదటి సారి నన్ను ఓజిహెచ్ వైద్యులు వచ్చి కలిసి, లేఖ అందించారు.ఆస్పత్రి భవంతి విస్తరించాలని, రోగులకి చోటు చాలడం లేదని అనేక మార్లు ప్రభుత్వానికి చెప్పాము. ఒక్కో బెడ్ మీద ఇద్దరు ముగురిని ఉంచి సేవలు అందించాల్సిన పరిస్థితి ఇక్కడుంది. ఆఖరికి టాయిలెట్‌లకు సరైన డోర్ లు కూడా లేకపోవడం బాధాకరం. భారీగా పెరిగిన రోగులతో ఆసుపత్రి కిక్కిరిసి , ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. అటెండర్ లకు కూడా ఉండేందుకు సరైన స్థలం లేదన్నారామె. రాజకీయ నేతలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతారు. మరి పేద వాళ్ల పరిస్థితి ఏంటి?.. 7.5 ఎకరాల్లో ఎక్కువ ఫ్లోర్ లు వేసి ఆసుపత్రి భవనం కట్టవచ్చా?. ఉస్మానియా ఆస్పత్రి కోసం కొత్త భవంతి కచ్చితంగా కట్టాలి అని ఉద్ఘాటించారామె.
అది రాజకీయం ఎలా అవుతుంది?
దశాబ్దాల నాటి భవంతి ఇది. ఆసుపత్రిలో కావాల్సినంత చోటు లేదు. రోగులకి ఇచ్చే సేవలతో కాంప్రమైజ్ అవ్వకూడదు. త్వరగా భవంతి కట్టాలని చెప్పడం కూడా రాజకీయం అనిపిస్తే ఏం చెప్పగలం?. అలాంటి విషయాలను సుహృద్భావంతో తీసుకోవాలి. కానీ నేను రాజకీయ నేతలా మాట్లాడుతున్నాను అనడం సరికాదు. సరైన స్థలం లేక బాధపడుతున్నప్పుడు గవర్నర్ గా వారికి సమస్యలను చూడటం నా బాధ్యత. నాకు సమస్యల గురించి చెప్పే హక్కు లేదా?. ఇప్పుడు కూడా ఒకే పడకపై ముగ్గురు పిల్లలు ఉన్న దృశ్యాలను నేను చూసాను ,అది బాధాకరం. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందలి అన్నదే నా లక్ష్యం. నన్ను ప్రశ్నించడానికి బదులుగా సమస్యకు పరిష్కారం చూపితే బావుంటుంది అని పేర్కొన్నారామె.
ప్రభుత్వం లీగల్ ఇష్యూ అని చెప్పి చేతులు దులువుకోవడం సరికాదని.. ఉస్మానియా పై మంత్రి నిర్వహిస్తున్న సమీక్ష ద్వారా మంచి పరిష్కారం అందాలని కోరుతున్నట్లు తెలిపారామె. ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మరోమారు స్పష్టం చేసిన ఆమె.. రోగులకు మంచి జరగాలి అనేదే తన ఉద్దేశమని చివర్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment