హతవిధీ..ఇది ధర్మాసుపత్రి
ఉస్మానియా ఆస్పత్రిలో బెడ్లు కరువు
కటిక నేలపై రోగుల అవస్థలు
అఫ్జల్‌గంజ్: అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వ ధర్మాసుపత్రికి వచ్చే రోగులను వైద్య సేవలు నేలకీడుతున్నాయి. మందులు, సేవల విషయం దేవుడెరుగు.. కనీసం పడుకోవడానికి బెడ్లు కూడా కరువయ్యాయి. నాణ్యమైన ఉచిత వైద్యమంటూ గొప్పలు చెప్పుకునే ప్రభత్వం కళ్లకు ఉస్మానియా ఆస్పత్రిలో తాండవిస్తోన్న సమస్యలు మాత్రం కనిపిండం లేదు. ఈ ఆస్పత్రికి వచ్చే రోగులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఇక్కడ చాలినన్ని బెడ్లు లేక రోగులు కటిక నేలపైనే వైద్యం పొందుతూ అవస్థలు పడుతున్నారు. ఇక అర్ధరాత్రిళ్లు వచ్చే అత్యవసర రోగుల పరిస్థితీ మరీ దారుణంగా ఉంటోంది.
నేలపైనే వైద్య సేవలు..
బెడ్లు లేక నేలపైనే పడుకున్న రోగులకు ఆస్పత్రి సిబ్బంది సైతం అక్కడే వైద్యం చేస్తున్నారు. రోగికి ఇబ్బందిగా ఉంది బెట్టు ఇప్పించాలని కోరితే.. తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారు. నేలపై రోగులు పగుతున్న అవస్థలను ఉన్నతాధికారులు చూస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. వందల మంది నిత్యం ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. అయితే, ప్రభుత్వం వీరికి కావాల్సినన్ని ఏర్పాట్లు చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్నకొద్ది పాటి బెడ్లు చిరిగిపోయి పడుకోలేని స్థితి.
ఈ చిత్రంలో నేలపై పడుకొని కనిపిస్తున్న వ్యక్తి పేరు హనుమంతరావు. ఇతడిది కూకట్‌పల్లిలోని వెంకటేశ్వర్‌నగర్ కాలనీ. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు తీవ్ర అస్వస్థతతో ఉస్మానియా ఆస్పత్రికి వచ్చాడు. బెడ్లు ఖాళీ లేక అతడిని నేలపైనే పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు.