
అమ్మా.. తలుపు తీయమ్మా..!
ఐదేళ్ల కుమారుడిని షాపునకు పంపి తల్లి ఆత్మహత్య
గచ్చిబౌలి: చిన్నా.. పాలప్యాకెట్ తీసుకురా అని ఆ తల్లి ఐదేళ్ల కుమారుడిని షాపునకు పంపింది.. పాలప్యాకెట్ తెచ్చిన ఆ చిన్నారి.. తలుపు వేసి ఉండటంతో అమ్మా.. అని పిలిచాడు. స్పందన లేదు. మళ్లీ పిలిచాడు.. అయినా ప్రయోజనం లేదు.. ఎన్నిసార్లు పిలిచినా అమ్మ పిలుపు వినపడలేదు.. దీంతో ఏడవడం మొదలుపెట్టాడు.. బాలుడి ఏడుపు గమనించిన స్థానికులు కూడా పిలిచారు..లోపలినుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి షాక్‌కు గురయ్యారు.. ఫ్యాన్‌కు ఉరివేసుకొని నిర్జీవంగా వేలాడుతోంది ఆ చిన్నారి తల్లి.. ఈ హృదయవిదారక సంఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో జరిగింది. ఎస్‌ఐ భూపతి తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు( చందుగొండ) చెందిన దంపతులు పి.కృష్ణవేణి(27), నాగరాజు కొండాపూర్ శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు.
వీరికి ప్రణయ్ (3), అఖిల్(5)కుమారులు. కృష్ణవేణి ఇళ్లలో చిన్న పిల్లలకు కేర్‌టేకర్‌గా పని చేస్తుండగా, నాగరాజు గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. చిన్న కుమారుడిని అక్కడే వదిలి బుధవారం భర్త, పెద్ద కొడుకు అఖిల్ తో కలిసి శ్రీరాంనగర్‌కు వచ్చింది. గురువారం ఉదయం 7.30 గంటలకే వంట చేసి భర్తను ఆఫీస్‌కు పంపించింది. అదే సమయంలో మరిది సతీష్ కోచింగ్ కోసం వెళ్లాడు. 8 గంటల సమయంలో కొడుకు అఖిల్‌ను షాపుకు వెళ్లి పాలు తీసుకురమ్మని పంపించింది. బాలుడు షాపు నుంచి తిరిగి వచ్చి పిలిచినా తలుపులు తెరవకపోవడంతో ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో అఖిల్ ఏడుస్తూ ఉండిపోయాడు. పక్కనే ఉండే వెంకటయ్య, రాజవర్థన్‌రెడ్డి గమనించి తలుపులు విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే వారు పోలీసులకు, భర్తకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండేళ్లుగా మానసిక పరిస్థితి బాగాలేదని, హిస్టీరియాతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు.