ఉస్మానియా ఆసుపత్రికి కొత్త హంగులు
రెండు టవర్లు.. 24 అంతస్తులు.. 2,500 పడకలు
వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: రాజధానిలోని ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో 24 అంతస్తులతో రెండు టవర్లతో భారీ భవనాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. అందులో అత్యాధునిక సదుపాయాలు కల్పించి 2,500 పడకలతో రోగులకు విస్తృత సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతమున్న ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవలను కొనసాగిస్తూనే ఈ కొత్త భవనాలను నిర్మించాలని చెప్పారు. బుధవారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై దాదాపు ఏడు గంటలపాటు సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందాతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను మెరుగుపరచడం, ఆసుపత్రుల అభివృద్ధిపై చర్చించారు.
నిలోఫర్ ఆసుపత్రికి కొత్త భవనాన్ని సమకూర్చాలని, గాంధీ ఆసుపత్రిలోనూ అవసరమైన మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 20 వేల నుంచి 25 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని, ప్రతీ నియోజకవర్గంలో వంద గ్రామాలకు ఉపయోగపడే విధంగా ఏరియా ఆసుపత్రి ఉండాలని సీఎం నిర్దేశించారు. రెవెన్యూ జిల్లాల ప్రాతిపదికన కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆరోగ్య జిల్లాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. పీహెచ్‌సీలను 30 పడకల ఆసుపత్రులుగా, ఏరియా ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా, జిల్లా ఆసుపత్రులను సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చాలని చెప్పారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులను రెండు వేల పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది, పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఆసుపత్రుల్లో సౌకర్యాలపై దృష్టి
ఆసుపత్రుల్లో సాంకేతిక పరికరాలను నిర్వహించడానికి బయో మెడికల్ ఇంజనీర్లను నియమించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇన్, ఔట్ పేషంట్లు వివరాలపై సరైన అంచనాలు ఉండాలన్నారు. వరంగల్ ఎంజీఎంను కూడా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనకు కేంద్ర సాయం తీసుకోవాలని సూచించారు. త్వరలో వైద్యులతో కూడా సమావేశమై రాష్ట్రానికి అవసరమయ్యే సరైన వైద్య విధానాన్ని రూపొందిస్తానని వెల్లడిం చారు. ప్రభుత్వ వైద్యాన్నంతా ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రాథమిక వైద్యశాలలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల ఏర్పాటు, నిర్వహణలో ఆచరణాత్మక విధానం రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రభుత్వాసుపత్రులను పూర్తిస్థాయిలో అభివృద్ధిపరిచి వాటిపట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలని హితవు పలికారు. మౌలిక వసతులన్నీ కల్పించాక అందుకు తగ్గట్లు పనిచేయని అధికారులపై తగు చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్రంలో వైద్య పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. ఇక గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై అధ్యయనం చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి వైద్యులు ముందుకు రాకపోవడాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకమిచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. 104, 108 సేవలు కూడా ప్రభుత్వ వైద్యంతో కలిసే ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు. వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థలో అవినీతి రాజ్యమేలుతుందని ఆ శాఖ ఈడీ రాజేందర్‌పై కేసీఆర్ మండిపడినట్లు తెలిసింది. ఆ విభాగంలోని అధికారాలను అవసరమైతే బదిలీ చేయాలని సూచించారు. బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు సరిగా లేవని వెద్య విద్యాశాఖ సంచాలకులు పుట్టా శ్రీనివాస్‌ను మందలించినట్లు సమాచారం. విధులకు గైర్హాజరయ్యే వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.