మంత్రి మాట ‘అవుట్’ ! | New recruitment outsourcing agencies | Sakshi
Sakshi News home page

మంత్రి మాట ‘అవుట్’ !

Published Sun, Jan 11 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

మంత్రి మాట ‘అవుట్’ !

మంత్రి మాట ‘అవుట్’ !

 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  ‘అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కొత్త నియామకాలా...అటువంటిదేమి లేదే. విధి విధానాలు ఖరారయ్యేంత వరకు కొత్త నియామకాలుండవు. ఇప్పటికే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశించారు. అవి వచ్చిన తర్వాతే కొత్త ఏజెన్సీల నియామకాలుంటాయి. అంతవరకు పాత ఏజెన్సీలే కొనసాగుతాయి.’ ఇవీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని శుక్రవారం విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు.  కానీ మంత్రి ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే, అందుకు భిన్నమైన ఉత్తర్వులొచ్చాయి. 16 కొత్త అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకాల్ని ఖరారు చేసి, శాఖల వారీగా ఉద్యోగాలను కేటాయింపు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.  రెండు నెలల 10 రోజుల కాల పరిమితి నిర్ధేశిస్తూ శనివారం ఆ ఏజెన్సీలకు ఉత్తర్వులు అందాయి. దీన్ని బట్టి మంత్రి, అధికారుల మధ్య సమన్వయ లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 శుక్రవారం విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతానికైతే కొత్త ఏజెన్సీల నియామకాల్లేవని, కలెక్టర్ కూడా నియామకాలు చేసి ఉండరని చెప్పిన    24 గంటల్లోనే ప్రతికూల పరిస్థితి ఎదురైంది. ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం మరింత ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఇదొక్కటి చాలు పాలనా వ్యవహారాలపైనా, అధికారులపైనా మంత్రికి ఉన్న పట్టు ఏంటో అర్థం చేసుకోడానికని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయిఅన్నింటా చుక్కెదురే... ఒక్క అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకాల విషయంలోనే కాదు... అనేక విషయాల్లో ఆమె మాట చెల్లుబాటు కాలేదు. అటు ప్రభుత్వ స్థాయిలోనూ, ఇటు జిల్లా స్థాయిలోనూ ఆమె ఆదేశాలు అమలు కావడం లేదు. డీసీఎంఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు ఐసీడీఎస్ సరుకుల సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని, నాణ్యతా లోపాలు, నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారని ఆ మధ్య మంత్రి మృణాళిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 దీనికంతటికీ డీసీఎంఎస్‌కు సబ్ కాంట్రాక్ట్‌గా ఉన్న వ్యాపారస్తుల పనేనని చెప్పారు. తక్షణమే ఆ సబ్ కాంట్రాక్టర్లను తీసేసి కొత్తగా టెండర్లు పిలిచి, అర్హులైన ఏజెన్సీలను ఖరారు చేయాలని ఆదేశించారు. కానీ ఇంతవరకు ఆ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు సరికదా, మంత్రి ఆరోపణలు చేసిన వ్యాపారులే ఇప్పటికీ సరుకులు సరఫరా చేస్తున్నారు.  ఇటీవల ఒక కేజీబీవీ(కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం)ని ఆమె ఆకస్మికంగా  తనిఖీ చేసినప్పుడు నాసిరకం ఆహారం అందిస్తున్నారని గుర్తించారు. సంబంధిత అధికారులపైనా, సరుకులు సరఫరా చేస్తున్న వ్యక్తులపైనా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.  బెల్ట్‌షాపులు, ఎంఆర్‌పీకి మించి మద్యం విక్రయాల విషయంలోనూ ఆమె ఆదేశాలు అమలు కావడం లేదు.
 
 ఇవన్నీ పక్కన పెడితే తన శాఖ పరిధిలో గల డీఆర్‌డీఎ పీడీ, డ్వామా పీడీలను బదిలీ చేసి నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ పోస్టుల్లో కొత్తవారు చేరలేదు. తానే చొరవ తీసుకుని పోస్టింగ్స్ వేయించినా, గుంటూరు నుంచి ఇక్కడికి రావల్సిన ఢిల్లీరావు, ప్రశాం తిలకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల చేత రిలీవింగ్ ఆర్డర్స్ ఇప్పించినా ఇంతవరకు అక్కడి కలెక్టర్ రిలీవ్ చేయలేదు. దీంతో గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి సొంత జిల్లాలో కీలకమైన డ్వామా, డీఆర్‌డీఎ పీడీ పోస్టులు ఇన్‌చార్జ్‌ల పాలనలో నడుస్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే, ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం మంత్రి హోదాలో వ్యక్తిగతంగా విజ్ఞాపన పత్రం అందజేసినా ప్రభుత్వం స్పందించలేదు. సరికదా ప్రైవేటు కళాశాల ఇస్తామంటూ ఆమె లేఖను పక్కన పెట్టేసింది.
 
 ఇక జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంత్రి లేని సమయంలో నిర్వహించారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. కేబినెట్ సమావేశం ఎప్పుడుంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టేశారో, మంత్రి లేకపోయినా ఫర్వాలేదనుకున్నారో తెలియదు గానీ జెడ్పీ యంత్రాంగం జిల్లా మంత్రి లేని సమయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించింది. అలాగే, ఆమె పీఏ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు, సమీక్షలు చేయడమే కాకుండా ఆదేశాలు,హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక పార్టీ ఎమ్మెల్యేల విషయం చెప్పనక్కర్లేదు. కనీసం పట్టించుకోవడం లేదు. తలోదారి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్కసారి ఆమెను టార్గెట్ చేసి వ్యాఖ్యలు, రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె సిఫార్సు చేసినా ఉన్నత స్థాయిలో సదరు ఎమ్మెల్యేలు ఆపేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. దీంతో ఆమెకున్న పట్టు, ప్రాధాన్యం ఏంటో స్పష్టమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement