విజయనగరం టౌన్: ప్రజలందరూ గోదావరి నదిలో పుష్కర స్నానమాచరించి పునీతులు కావాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని కోరారు. ఈ నెల 14 నుంచి 25 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు జిల్లా నుంచి ప్రారంభమైన శోభాయాత్రను కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా నుంచి నాలుగు బస్సుల్లో సుమారు 250 మంది భక్తులను పంపుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, వసతి, తాగునీరు, తదితర మౌలిక సౌకర్యాలను కల్పించామని వివరించారు. రాజమండ్రిలో డ్వాక్రా బజారును ఏర్పాటు చేశామన్నారు.
స్నానాలకు, పిండ ప్రదానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రోజుకు రెండు లక్షల మందికి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. జిల్లా నుంచి పుష్కర శోభాయాత్రకు బయలుదేరిన భక్తులు ద్వారకా తిరుమల వరకూ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో వెళ్లి అక్కడ నుంచి కాలినడకన వెళతారని చెప్పారు. ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరాపల్లి, కొవ్వూరుల్లో శోభాయాత్ర భక్తులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాజమండ్రిలో పుష్కర స్నానం అనంతరం అక్కడ నుంచి తీసుకువచ్చిన పుష్కర జలాలను వనంగుడిలోని పైడితల్లి అమ్మవారికి అభిషేకించి, అన్ని మండలాలకు పంపాలన్నారు.
ఆ నీటిని ఆయా మండలాల్లోని నీటి వనరుల్లో కలపాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ శోభాయాత్రకు వె ళ్లిన భక్తులను తిరిగి జాగ్రత్తగా తీసుకురావాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఆర్.పుష్పనాథంను ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతి బస్సుతో ఇద్దరు దేవాదాయశాఖ అధికారులను పంపామన్నామని చెప్పారు. అనంతరం పుష్కరం పిలుస్తోంది పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, విజయనగరం, పార్వతీపురం ఎమ్మెల్యేలు మీసాల గీత, బొబ్బిలి చిరంజీవులు, అదనపు సంయుక్త కలెక్టర్ యుసీజీ.నాగేశ్వరరావు, డీఆర్‌వో జితేంద్ర, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, దేవాదాయ శాఖ సహాయ కమిషనరు పుష్పనాథం, ఈవో భానురాజా తదితరులు పాల్గొన్నారు.
పుష్కర స్నానంతో పునీతులు కండి
Published Mon, Jul 13 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement