సాక్షి ప్రతినిధి, విజయనగరం ః నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న తీరులో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఖరారు చేయలేదన్న అక్కసుతో ఒత్తిళ్లకు దిగారు. ఎన్ని ఎత్తులు వేసినా ప్రయోజనం లేకపోవడంతో పాత ఏజెన్సీల(కాంగ్రెస్ మద్దతుదారులు)తో చేతులు కలిపారు. లోపాయికారీ డీల్ కుదుర్చుకుని వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కొత్త ఏజెన్సీలకు ఉద్యోగాల కేటాయింపులు చేయకుండా గాలిలో వదిలేసి, పాత వారినే కొనసాగించేలా కుట్ర పన్నారు. దీంతో కలెక్టర్ ఇచ్చిన నియామక ఉత్తర్వులు ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా రూ.3 లక్షలు డిపాజిట్ చేసిన కొత్త ఏజెన్సీలకు న్యాయం జరగకపోగా, వడ్డీని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అధికారులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తున్నారు.
వివరాలివి....
జిల్లాలో 40 ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగుల్లేక అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తున్నారు. వీరిని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సమకూర్చుకుంటున్నారు. ఈ మేరకు ఆయా ఉద్యోగులకిచ్చే జీతాల్లో కొంత మొత్తాన్ని కమీషన్‌గా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. తాత్కాలిక సమకూర్చే బాధ్యత చేపట్టే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను టెండర్ల ద్వారా ఖరారు చేస్తారు. ఈక్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను కొత్తగా ఖరారు చేసేందుకు జిల్లా కమిటీ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు 28 షెడ్యూళ్లు దాఖలయ్యాయి. కాకపోతే, ఇందులో అత్యధికం టీడీపీ నేతలకు చెందిన వారివే. దాఖలు చేసినవన్నీ ఖరారు అయ్యేలా తెరవెనుక పావులు కదిపారు. ఇదే విషయమై సెప్టెంబర్ 20వ తేదీన ’అవుట్ సోర్సింగ్‌లో సిండికేట్లు’ అనే శీర్షికతో సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది.
దీంతో అర్హతలుండి రాజకీయేతరంగా షెడ్యూల్ దాఖలు చేసిన వారు అప్రమత్తమయ్యారు. అడ్డగోలుగా ఖరారైతే కోర్టుకైనా వెళ్తామంటూ వారంతా సంకేతాలు పంపించారు. దీంతో అధికారులు అప్రమత్తమై అధికార పార్టీ నేతలు సూచించిన వాటిలో అర్హత గల ఏజెన్సీలను ఎంపిక చేయడంతో పాటు రాజకీయేతరంగా దాఖలై అర్హత ఉన్న వాటినీ ఎంపిక చేశారు. ఆమేరకు మూడు నెలల కాల పరిమితితో అక్టోబర్ 10వ తేదీన 16 ఏజెన్సీలను అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా సమాన ప్రాతిపదికన శాఖల వారీ ఉద్యోగాలు కేటాయించారు. ఇక్కడే ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారు. తాము సిఫారసు చేసిన ఏజెన్సీలన్నింటినీ ఎంపిక చేయలేదని అక్కసు వెళ్లగక్కారు . తమకు అనుకూల ఏజెన్సీలన్నీ ఎం పిక చేయకపోగా, ఎంపిక చేసిన ఏజెన్సీలకు ఎక్కువ ఉద్యోగాలు కేటాయింపు లు చేయలేదని, అందరిలాగే సమానంగా కేటాయించారని, సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకేముంది ఒకవైపు అధికారులపై ఒత్తిళ్లు చేస్తూనే మరోవైపు కొత్త ఎంపికైన ఏజెన్సీలను వెనక్కి తగ్గిపోవాలని పరోక్షంగా బెదిరించారు. కానీ రెండు వైపులా సానుకూలత రాలేదు. దీంతో ఆ ఎమ్మెల్యేలు వ్యూహం మార్చారు. సత్సంబంధాలున్న పాత ఏజెన్సీల(కాంగ్రెస్ మద్దతుదారులు)తో చేతులు కలిపారు. లోపాయికారీ ఒప్పందం చేసుకుని కొత్త నియామకాలు అమలుకు నోచుకోకుండా పాత వారినే కొనసాగించేలా తెరవెనుక పావులు కదిపారు. ఓ మంత్రి చేత ఒత్తిడి చేయించి, కొత్త ఏజెన్సీలను గాలిలో ఉంచేలా సఫలీకృతులయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్ల అనుకున్నవి జరగడమే కాకుండా ఆర్థిక పరమైన లబ్ధి కూడా పొందుతున్నట్టు తెలుస్తోంది. కొత్త ఏజెన్సీల కాలపరిమితి(మూడు నెలలు) జనవరి పదో తేదీతో ముగియబోతోంది. అంటే కలెక్టర్ ఇచ్చిన నియామక ఉత్తర్వులు ఆచరణకు నోచుకోకుండానే గడువు ముగిసిపోతోంది.
లబోదిబోమంటున్న కొత్త ఏజెన్సీ నిర్వాహకులు
గతంలో ఏజెన్సీలు రూ.50వేలు డిపాజిట్ చేస్తే సరిపోయేది. కానీ ఈసారి రూ.3లక్షలకు డిపాజిట్ మొత్తాన్ని పెంచారు. మూడు నెలలు(అక్టోబర్, నవంబర్, డిసెంబర్)కే కాంట్రాక్ట్ అని షరతు పెట్టారు. ఈ మూడు నెలలైనా ఎంతో కొంత సంపాధించుకోవచ్చన్న ఆశతో పలు ఏజెన్సీలు షెడ్యూల్ దాఖలు చేశాయి. అర్హతలతో ఎంపికయ్యాయి.
కానీ, టీడీపీ ఎమ్మెల్యేల జోక్యంతో నిలిచిపోయిన ప్రక్రియతో ఈ ఏజెన్సీల నిర్వాహకులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
దీంతో వారు లబోదిబోమంటున్నారు. తమకు జరిగిన అన్యాయంపై కోర్టుకు వెళతామని వారు చెబుతున్నారు.
కుమ్మక్కు కుట్రకు...కొత్త ఏజెన్సీలు అవుట్!
Published Thu, Dec 25 2014 1:08 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement