కొత్త జీతాల్లేవు!
శ్రీకాకుళం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం సూచించిన మేరకు కొత్త జీతాలు అందడం లేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని నియమించకపోవడమే దీనికి కారణమని తెలిసింది.ఈ విద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. రాతపరీక్ష ద్వారా నియమితులైన బోధనా సిబ్బందికి జూన్ నెల నుంచి కొత్త జీతాలు అందజేస్తున్నారు. బోధనేతర సిబ్బంది నేరుగా నియమితులు కావడంతో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకాలు జరిగినట్టు పరిగణించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మే నెలలోనే ఆర్‌వీఎం అధికారులు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ నియామకానికి ప్రయత్నించారు.
ఇందుకు అవసరమైన నోటిఫికేషన్ కూడా జారీ చేయగా ఒకరిద్దరు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పట్లో జాతీయస్థాయిలో చక్రం తిప్పిన ఓ ప్రజాప్రతినిధి తన అనుయాయునికే ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాలని పట్టుబట్టారు. దీనికి అధికారులు తలొగ్గి, ఆయన్నేనియమించినప్పటికీ, అతనిపై తీవ్ర ఆరోపణలు రావడంతో తర్వాత రద్దు చేశారు. మరో ఏజెన్సీని నియమించేందుకు ప్రయత్నాలు జరిగినా అవాంతరాలు సృష్టించడం ద్వారా కొందరు అది జరగకుండా చేశారు. ఇంతలో ఎన్నికలు రావడం కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ఏజెన్సీ నియామకంలో అధికారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్టు సమాచారం.
ఇద్దరు ప్రజాప్రతినిధులు తమ వారికే ఏజెన్సీ కట్టబెట్టాలని ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు భోగట్టా. ఈ కారణంగా రెండు నెలలుగా ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. ఫలితంగా కేజీబీవీల్లోని బోధనేతర సిబ్బంది కొత్త జీతాలకు నోచుకోలేక పోతున్నారు. మిగిలిన జిల్లాల్లో జూన్ నెల నుంచే కొత్త జీతాలు అందుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని బోధనేతర సిబ్బంది మాత్రం పాత జీతాలతోనే పనిచేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఐదు నెలల కొత్త జీతాలను వీరు నష్టపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీని నియమించడం ద్వారా అందరికీ కొత్త జీతాలు అందేలా చూడాలని బోధనేతర సిబ్బంది కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆర్‌వీఎం పీవో గణపతిరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమపైన ఎవరూ ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. ఉన్నతాధికారులపై కూడా ఎటువంటి ఒత్తిడి లేదని, త్వరలోనే ఏజెన్సీ నియామకం పూర్తవుతుందని చెప్పారు. ఏజెన్సీ పరిధిలోకి బోధనేతర సిబ్బందిని తీసుకువచ్చిన తరువాత కొత్త జీతాలను మంజూరు చేస్తామన్నారు.