ఐదు నెలలుగా జీతాలు కరువు
ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం
ఆర్థిక ఇబ్బందుల్లో పశుసంవర్ధకశాఖ అటెండర్లు
కర్నూలు(అగ్రికల్చర్) : అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వల్ల పశుసంవర్ధక శాఖలో 47 మందికి ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో సంబంధిత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. అధికారులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఎప్పటికప్పుడు ఉద్యోగుల జీతాల బిల్లులు చెల్లిస్తున్నా ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, సర్వీస్ టాక్స్ చెల్లింపులో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారు. రాయలసీమ అనిమల్ హజ్బెండరీ బ్రీడ్ డెవలప్‌మెంట్, సర్వీస్ వెల్ఫేర్ సొసైటీ పశుసంవర్ధక శాఖలోని వివిధ పశువైద్యశాలలకు అవుట్ సోర్సింగ్‌పై అటెండర్లను నియమించింది. అయితే ఈ ఏజెన్సీ నిర్వాకం కారణంగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు అంద డంలేదు.
ఈపీఎఫ్, ఈఎస్‌ఐ జమ కావడం లేదు. పశుసంవర్ధక శాఖ అధికారులు గత ఏడాది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 47 మంది అటెండర్ల జీతాల బిల్లుల కింద మార్చి మొదటి వారంలో 21 లక్షలు చెల్లించారు. ఈ మొత్తం నుంచి సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జీతాలు జమ చేసి, అదే నెలలోనే ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, సర్వీస్ ట్యాక్స్ చెల్లించి సంబంధిత బిల్లులు సమర్పించాలి. అయితే జీతాలు బ్యాంకు ఖాతాలకు జమ చేసినా ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, సర్వీస్ ట్యాక్సులు చెల్లింపులో అలసత్వం వహించారు. ఉద్యోగుల ఒత్తిడి పెరగడంతో జులైలో జమ చేసినట్లు సమాచారం.
ఈ మొత్తాన్ని జమ చేసినా బిల్లులు ఇవ్వకపోవడంతో 47 మంది అటెండర్లు మార్చి నుంచి జీతాలకు దూరమయ్యారు. దీనిపై సంబంధిత ఏజెన్సీ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే తనకు ఇలాంటి ఏజెన్సీలు చాలా ఉన్నాయి.. అన్ని చూసుకోవాలి కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆలస్యంగా ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, సర్వీస్ ట్యాక్స్ చెల్లించినా బిల్లులు ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో పెట్టాము చూసుకొమ్మని నిర్లక్ష్యంగా చెప్పినట్లు తెలుస్తోంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యాన్ని గుర్తించిన పశుసంవర్థక శాఖ అధికారులు ఏజెన్సీని మార్చాలని కొద్ది రోజుల క్రితమే జిల్లా ఉపాధి కల్పనా సంస్థ అధికారికి లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితి ఇతర శాఖల్లో కూడా ఉన్నట్లు సమాచారం.
కుటుంబ పోషనకు అప్పులు చేస్తున్నాం
ఫిబ్రవరి నుంచి జీతాలు లేకపోవడంతో అనేక కష్టాలు పడుతున్నాం. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని సంసారాలను నెట్టుకొస్తున్నాం. ఈ ఏజెన్సీ కారణంగానే ఇప్పుడు జీతాలకు దూరమయ్యాం. అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.
- ఎం.ప్రసాద్, అటెండర్, క్ష్మీపురం గ్రామీణ పశువైద్యశాల
జీతాలిప్పించండి..
ఐదు నెలలుగా జీతాలు లేకపోతే ఎలా బతకాలి. ఎప్పటికప్పుడు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ చె ల్లించాలని ఏజెన్సీ నిర్వాహకుడిని కోరుతున్నాం. కానీ ఫలి తం లేదు. ఇందువల్ల మాకు జీతాలు ఆలస్యం అవుతున్నాయి. అధికారులే కాస్త చొరవ తీసుకుని మా ఇబ్బందులు తీర్చాలి.
-సలాం బాషా, అటెండర్, అల్లూరు పశువైద్యశాల
పొరుగు ఉద్యోగుల అరణ్య రోదన
Published Wed, Aug 5 2015 3:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement
Advertisement