నల్లగొండ: జిల్లాలో జౌట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక వ్యవహారం గందరగోళంగా మారుతోంది. ఏజెన్సీల ఎంపిక, ఉద్యోగాల నియామకానికి సంబంధించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు కాలరాస్తూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం ఇందుకు మూలకారణమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం పలు శాఖల్లో ఖాళీలను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీచేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. కానీ ఉద్యోగ నియామకాలు, ఏజెన్సీల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీన్నే అదునుగా భావించిన ఏజెన్సీలు, అధికారులు కుమ్మకై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగాలను అమ్ముకుంటు న్నారన్న ఆరోపణలున్నాయి.
జిల్లాలో 90 వరకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉపాధి కల్పన కార్యాలయంలో రిజిష్టరై ఉన్నాయి. ఈ ఏజెన్సీలకు అవకాశం ఇవ్వకుండా కేవలం నాలుగైదు ఏజెన్సీలకు మాత్రమే గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టు అప్పగిస్తూ అధికారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ గుత్తాధిపత్యాన్ని జీర్ణించుకోలేని కొన్ని ఏజెన్సీలు హైకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఉమ్మడి ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 4271 ప్రకార ం ఉద్యోగాల నియామకం, ఏజెన్సీల ఎంపిక చే సినట్లయితే నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది చివరి మాసాల్లో విద్యాశాఖ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 47 పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు, ఏజెన్సీలు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది.
వివాదాస్పదంగా మారుతున్న ఉద్యోగాల భర్తీ
మోడల్ స్కూళ్లలో 33 పీఈటీ పోస్టులు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలి. ఏజెన్సీల ఎంపికకు టెండర్లు ఆహాన్వించి అర్హత ఉన్న వాటిని జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాలి. అయితే సమైక్య రాష్ట్రంలో కూడా మోడల్ స్కూల్స్‌లో కొన్ని పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే భర్తీ చేశారు. దీంతో కొత్తగా మంజూరైన పీఈటీ పోస్టులకు కొత్త ఏజెన్సీలు ఎంపిక చేయకుండా పాత ఏజెన్సీలకే కాంట్రాక్టు క ట్టబెట్టారు. అప్పట్లో ఆ ఏజెన్సీల నిర్వాకం వల్ల పోస్టుల భర్తీ వివాదస్పదంగా మారింది. కాగా మళ్లీ ఇప్పుడు పాత ఏజెన్సీలకే ఉద్యోగాల నియాకమం, రాత పరీక్ష వగైరా బాధ్యతలు అప్పగించడం విమర్శలకు దారితీస్తోంది. నిబంధనల ప్రకారం అయితే ఔట్‌సోర్సింగ్ పోస్టుల నోటిఫికేషన్‌లు జారీ అయిన ప్రతిసారి ఏజెన్సీల ఎంపికకు టెండర్లు పిలవాలి.
కానీ అలా చేయడంలేదు. నకిరేకల్, చండూరు, మునుగోడు, ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మంజూరైన 14 పోస్టుల భర్తీకి సంబంధించి ఏజెన్సీలు వ్యవహరించిన తీరు పట్ల నిరుద్యోగులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. టెండర్ లేకుండానే జిల్లా సెలక్షన్ కమిటీ విచక్షాణా ధికారంతో మూడు ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పజెప్పింది. దీంతో ఆ ఏజెన్సీల నిర్వాహకులు లక్షల రూపాయాలకు ఉద్యోగాలను బేరంపెట్టారు. దీనికి రాజకీయ ఒత్తిళ్లు కూడా తోడు కావడంతో ఈ నియామకాల పై సందిగ్ధత ఏర్పడింది. ఇక, బీబీనగర్‌లో నిర్మిస్తున్న నిమ్స్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ద్వారా పోస్టులు భర్తీ అయితే కోర్టు మెట్లెక్కింది. ఇందుకోసం జిల్లా నుంచి ఒక ఏజెన్సీని ఎంపిక చేయాలని కోరుతూ జిల్లా ఉపాధి కల్పన శాఖకు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. దీనిని కూడా జిల్లా సెలక్షన్ కమిటీ టెండరు లేకుండానే తాము మెచ్చిన ఏజెన్సీని ఎంపిక చేసి పంపించారు. టెండరు లేకుండా ఏజెన్సీ ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించాయి. పోస్టుల నోటిఫికేషన్ జారీ కాకముందే ఏజెన్సీల ఎంపిక వివాదస్పదంగా మారడం గమనా ర్హం.
నిబంధనలు ఇవీ...
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 4271 ప్రకారం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక.. టెండర్ల ద్వారా జరగాలి. టెండర్లు దాఖలు చేసిన ఏజెన్సీలను జిల్లా సెలక్షన్ కమి టీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా జిల్లా ఉపాధి కల్పన అధికారి, సభ్యులుగా డిప్యూటీ డెరైక్టర్ (డీటీఓ), జిల్లా కార్మిక శాఖ అధికారి ఉంటారు. ఏజెన్సీల ఎంపిక పూర్తయిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ఓ నిబంధన ఉంది. దీనికి కూడా కలెక్టర్ స్థాయిలో ప్రత్యేకమైన కమిటీ ఉంది. జిల్లా ఉపాధి కల్పన శాఖలో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువకులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అట్టి జాబితాలో సీనియారిటీ ఉన్న అభ్యర్థుల అర్హతలు, రిజర్వేషన్లు, రోస్టర్‌పాయింట్లు అమలు చేస్తూ ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. గతంలో జిల్లాలో ఈ పద్ధతిలోనే కాంట్రాక్టు ఉద్యోగ నియామకాల భర్తీ జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ అటకెక్కడం, కాసులిచ్చిన వారికే కొలువులు కట్టబెడుతుండడం గమనార్హం. ఇంకో విచిత్రమేమిటంటే... అనేక అధికారిక వ్యవహారాల్లో బిజీగా ఉండే కలెక్టర్ దృష్టికి వెళ్లకుండానే కిందిస్థాయి అధికారులు ఈ వ్యవహారాలు నడుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
సెలక్షన్ కమిటీదే బాధ్యత - అక్బర్ హబీబ్ , జిల్లా ఉపాధి కల్పన అధికారి
పాత ఏజెన్సీలకే మోడల్ స్కూల్స్‌లో పోస్టులు భర్తీ చేసే కాంట్రాక్టు అప్పగించారు. దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. కొనసాగుతున్న పాత ఏజెన్సీలకే కొత్త పోస్టుల భర్తీ కాంట్రాక్టు ఇవ్వాలనే నిబంధన లేదు. దానికి సంబంధించిన జీఓ కూడా మావద్ద లేదు. నిమ్స్ ఆసుపత్రి ఏజెన్సీ ఎంపికకు టెండరు పిలవకపోవడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించిన మాట వాస్తవం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏజెన్సీల ఎంపిక కోసం కూడా టెండరు పిలవలేదు . జిల్లా సెలక్షన్ కమిటీ ఆదేశం మేరకు ఆ ఏజెన్సీలను ఎంపిక చేశాం.
అంత.. ప్రేమెందుకో?
Published Sun, Jan 4 2015 3:07 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement