సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులను ఖైదీల్లా చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు భోజనం ప్లేట్లో పెట్టుకున్న వెంటనే తినడానికి వీల్లేదు. సిబ్బంది అందరినీ నిలబెట్టి ఫొటో తీస్తారు. ఫొటోలో విద్యార్థులందరూ వచ్చారని, ఆహార పదార్థాలాన్నీ స్పష్టంగా కనపడుతున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే తినాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, రాత్రి భోజన సమయంలో విధిగా ఫొటోలు తీస్తారు. ఎప్పుడు ఏమి పెట్టారు, ఎంతమందికి పెట్టారనేది ఫొటోలో స్పష్టంగా కనిపించాలి. భోజన సమయంలో ఫొటో తీస్తే కూరలు, అన్నం స్పష్టంగా కన్పించాలన్నమాట. ఈ విధంగా విద్యార్థుల్ని లెక్కించి బిల్లులు చెల్లిస్తున్నారు. ఒకవేళ లెక్క సరిగా లేకపోతే కుకింగ్ ఏజెన్సీ బిల్లుల్లో ఆ మేరకు కోత విధిస్తున్నారు. ఆ భారం కాస్తా ప్రిన్సిపాళ్లపై పడుతుండటంతో వారు లబోదిబోమంటున్నారు. విద్యార్థుల విషయంలో ఈ పద్ధతి సరికాదనే విమర్శలు తీవ్రంగా విన్పిస్తున్నాయి.
ప్రిన్సిపాల్స్‌పైనే భారం
ఫొటోల్లో విద్యార్థులను లెక్కించి ఆ మేరకే కుకింగ్ ఏజెన్సీలకు బిల్లులు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ప్రిన్స్‌పాల్ చెప్పిన లెక్క ప్రకారమే కుకింగ్ ఏజెన్సీ వారు భోజనాలు తయారు చేస్తారు. బిల్లులు చెల్లించే సమయంలో ప్రిన్స్‌పాల్ చెప్పిన హాజరు ప్రకారం ఫొటోల్లో విద్యార్థులు కన్పించకుంటే ఆ మేరకు కోత విధిస్తున్నారు. అయితే మీరు చెప్పిన సంఖ్య ప్రకారమే మేము భోజనం తయారు చేస్తున్నామంటూ కుకింగ్ ఏజెన్సీ వారు ప్రిన్స్‌పాళ్లను నిలదీస్తున్నారు. మీరు చెప్పిన పిల్లల హాజరు ప్రకారమే భోజనాలు, ప్రత్యేక వంటకాలు తయారు చేయించామని, అలాంటప్పుడు మాకు ఇచ్చే బిల్లుల్లో కోత ఎలా పెడతారని ప్రశ్నిస్తుండటంతో ప్రిన్స్‌పాళ్లకు దిక్కు తోచడం లేదు. ఈ నేపథ్యంలో తాము వేల రూపాయల్లో కుకింగ్ ఏజెన్సీకి తమ సొంత డబ్బులు చెల్లించాల్సి వస్తున్నదని ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు.
కోతేసి మిగుల్చుకుంటున్నారు..
రాష్ట్రంలో మొత్తం 188 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి నెలకు ప్రభుత్వం మెస్ చార్జీల కింద సుమారు రూ.12.50 కోట్లకు పైగా వెచ్చిస్తుండగా ప్రతినెలా రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఈ విధంగా కోత విధిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 2018 ఆగస్టులో రూ.12,61,19,074 ఖర్చుపెట్టాల్సి ఉండగా.. విద్యార్థులు లేరని, ప్రత్యేక వంటకాలు సరిగా పెట్ట లేదని, ఫొటోల్లోని విద్యార్థులతో వాస్తవ సంఖ్య సరిపోలడం లేదనే నెపంతో ఏజెన్సీ బిల్లుల్లో రూ.42,29,166 కోత విధించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి ఆగస్టు నెలలో మిగులుగా అధికారులు చూపించారు.
ఫొటోలో కన్పించకపోతే కోతే..!
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ అన్నపూర్ణ అనే యాప్‌ను తయారు చేయించింది. ఈ యాప్‌లో విద్యార్థుల ఏరోజు భోజనం ఖర్చుల వివరాలు ఆరోజు కాలేజీ ప్రిన్స్‌పాళ్ల ద్వారా అప్‌లోడ్ చేయాలి. ప్రతి విద్యార్థి, ఉద్యోగి బయోమెట్రిక్ ఉపయోగించాలి. దీనివల్ల ఎవరు హాజరయ్యారు, కాలేదనే వివరాలు నమోదవుతాయి. ఆ సంఖ్యను బట్టే భోజనం తయారు చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. భోజనం వడ్డించేటప్పుడు ఫొటోలు తీస్తున్నారు. స్కూల్లో వెయ్యి మంది విద్యార్థులు ఉంటే అందరూ పూర్తిగా ఫొటోలో కనిపించాలని ప్రిన్స్‌పాళ్లకు గురుకుల కార్యదర్శి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అలాగే కోడిగుడ్డు, అరటి పళ్ళు, ప్రత్యేక వంటకాలు పెట్టినప్పుడు ఫొటోల్లో స్పష్టంగా కనిపించాలని కూడా గురుకుల సొసైటీ నుంచి ఆదేశాలు ఉన్నట్లు ఆయా స్కూళ్ళ ప్రిన్స్‌పాళ్లు చెబుతున్నారు. అయితే ఒక్కోసారి ఫొటోలో అందరూ కనిపించకపోవచ్చునని, ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతోందని వారు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment