అన్నపూర్ణా సోనీ.. సింగర్ కావాలనుకుని యాక్టర్ అయింది. చక్కటి స్వరం ఒక్కటే ఆమె ప్రత్యేకత అనుకుంది. కానీ, కాలం ఆమెకు నటనపై ఆసక్తిని కలిగించి, వరుస అవకాశాలతో మంచి నటిని చేసింది. ఆ విషయాలే క్లుప్తంగా...
మొదటిసారి నా గురించి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు.. మా ఇంట్లో వాళ్లు చాలా హ్యాపీగా ఫీలై, ఆ పేపర్‌ని ఇరుగు పొరుగు వారందరికీ గొప్పగా చూపించారు. నేనిప్పటికీ అదే ఉత్సాహంతో ఉంటాను. సింగర్ కంటే కూడా మంచి నటి అనే గుర్తింపునే ఇష్టపడతాను. అందుకే క్లిష్టమైన పాత్రల్లో నటించి, గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా!
– అన్నపూర్ణా సోనీ.
⇒ అన్నపూర్ణా సోనీ మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించింది. చిన్నప్పుడే సంగీతంలో శిక్షణ తీసుకుంది. సంగీతంతోపాటు నాట్యం, నటన, మైమ్.. ఇలా ఎన్నో కళల్లో ప్రతిభ చూపేది.
⇒‘వివేచన రంగమండల్’ అనే నాటక సంస్థలో చేరిన తర్వాత అక్కడ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్నెస్‌డీ) గురించి గొప్పగా విని, ఎలాగైనా అందులో చేరాలని నిశ్చయించుకుంది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. కానీ, రెండో ప్రయత్నంలో సీటు సాధించింది. లఘు చిత్రాలు, స్టేజ్ షోలు చేస్తూ నటనకు మెరుగులుదిద్దుకుంది.
⇒ఆమె తొలి లఘు చిత్రం ‘చీపటాకడుంప’ దేశీయంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ లఘు చిత్రాన్ని ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్‌నూ గెలుచుకుంది.
⇒షార్ట్ ఫిల్మ్స్‌లో ఆమె నటనను చూసిన బాలీవుడ్.. ‘గుడ్‌బై’, ‘ఢిల్లీ క్రైమ్ 2 ’, ‘ ఛపాక్’ వంటి సినిమాల్లో అవకాశాలను ఇచ్చింది. అవన్నీ విజయం సాధించాయి.
⇒ఆ విజయాలతో అన్నపూర్ణా వెబ్ దునియా దృష్టిలోనూ పడింది. ‘సన్‌ప్లవర్ ’, ‘రంగ్‌బాజ్ ’, ‘ద రైల్వే మెన్’ అనే సిరీస్‌లతో ఆమె టాలెంట్‌కి వెబ్ స్క్రీన్ కూడా స్పేస్‌నిచ్చింది. ఆ సిరీస్‌లు జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment