జర్మనీతో జట్టు కట్టేలా..! | AP Govt students have access to education employment opportunities | Sakshi
Sakshi News home page

జర్మనీతో జట్టు కట్టేలా..!

Published Wed, Mar 23 2022 3:36 AM | Last Updated on Wed, Mar 23 2022 7:00 AM

AP Govt students have access to education employment opportunities - Sakshi

సాక్షి, అమరావతి: సాంకేతిక విద్యారంగంలో యూరప్‌ దేశాల్లో.. మరీముఖ్యంగా జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి ద్వారా ఏర్పాట్లు చేయిస్తోంది. ఇప్పటికే జర్మన్‌ యూనివర్సిటీతో ఉన్నత విద్యామండలి రెండు విడతల రౌండ్‌టేబుల్‌ సమావేశాలను పూర్తి చేయించింది. ‘ఇండో–యూరో సింక్రనైజేషన్‌’లో భాగంగా జర్మన్‌ వర్సిటీ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్, ఏపీ ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో ‘జర్మన్‌–ఏపీ ఫోరమ్‌ ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ పేరుతో వర్చువల్‌గా సమావేశాలు నిర్వహించిన ఉన్నత విద్యామండలి అధికారులు జర్మనీ  ప్రతినిధులతో వివిధ అంశాలపై వివిధ వర్సిటీల ఉప కులపతులు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ అధికారులు చర్చలు జరిపించింది. తద్వారా జర్మనీలో విద్య, ఉద్యోగ అవకాశాలను మన రాష్ట్ర విద్యార్థులు దక్కించుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. 

ఉద్యోగాలు దక్కించుకునేలా.. 
‘ప్రీ–మాస్టర్‌ ఇండియా’ పేరుతో మన దేశంలో జర్మనీ ప్రారంభించనున్న కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆ దేశంలోని అవకాశాలను దక్కించుకోవడానికి వీలుపడుతుంది. ఇక్కడి విద్యార్థులు బీటెక్‌ ప్రోగ్రామ్‌లను పూర్తిచేశాక జర్మనీలో మాస్టర్‌ డిగ్రీని అభ్యసించడంతోపాటు నేరుగా అక్కడి కంపెనీల్లో పని చేసేందుకు వీలు కల్పిస్తారు. దీనిని ఆరు దశల్లో నిర్వహిస్తారు. జర్మనీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవాలంటే మన విద్యార్థులకు మంచి నైపుణ్యాలు, జర్మన్‌ సంస్కృతి, భాషపై కూడా అవగాహన అవసరం. ఆసక్తి గల విద్యార్థులకు ఆరు దశల కార్యక్రమంలో వీటిని నేర్పిస్తారు.

ఇటువంటి అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం డ్యూయెల్‌ డిగ్రీ కార్యక్రమాలు నిర్వహించనుంది. కాగా, ఉన్నత విద్యామండలి అనుమతితో క్రెడిట్‌ ఆధారిత కోర్సుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ) చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా విద్యార్థులకు మల్టీ స్కిల్లింగ్‌ మెథడాలజీలో వివిధ నైపుణ్యాలను అలవర్చనున్నారు. కోర్‌ స్కిల్స్, సాఫ్ట్‌ స్కిల్స్, లైఫ్‌ స్కిల్స్‌ ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకొనేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో ఆన్‌లైన్‌ కోర్సులను జర్మనీ వర్సిటీ అమలు చేయనుంది. 

అంతర్జాతీయంగా ఉద్యోగాల వెల్లువ 
ఆధునిక సాంకేతిక అంశాల్లో రానున్న కాలంలో 1.1 బిలియన్‌ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో ఆయా అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమలు చేయనున్నారు. కాలేజీల్లో పాఠ్యాంశాల్లోని నైపుణ్యాలను క్షేత్రస్థాయిలో వాస్తవికంగా విద్యార్థులు అలవర్చుకునేలా ప్రభుత్వం జిల్లాల వారీగా 47 వేలకు పైగా  సూక్ష్మ, మధ్య, భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో కాలేజీలను అనుసంధానించే కార్యక్రమం చేపట్టింది. ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ అమలు చేయిస్తోంది. ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. బ్లెండెడ్‌ స్కిల్లింగ్‌ కోర్సులకు శ్రీకారం చుట్టింది. 

55వేల మందికి శిక్షణ 
మరోవైపు ఆధునిక సాంకేతిక అంశాల్లో విద్యార్థులకు క్షేత్రస్థాయి పారిశ్రామిక అనుసంధానం ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పించడానికి ఏపీఐటీఏ ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలకు చెందిన దాదాపు 55 వేల మంది విద్యార్థులు ఏపీఐటీఏలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి వివిధ పారిశ్రామిక, ఐటీ సంస్థల ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయనున్నారు.  

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు 
జర్మనీ ప్రతినిధుల రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో చర్చకు వచ్చిన ముఖ్యమైన అంశాల్లో అంతర్జాతీయంగా నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యాంశాల్లో చేపట్టాల్సిన మార్పులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రణాళికలు ఉండేలా  చర్యలు తీసుకుంది. అంతేకాకుండా సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో విద్యార్థులకు వాస్తవిక ప్రయోగాలకు అనువుగా పరిశ్రమ ఆధారిత ప్రాజెక్టులకు రూపకల్పన చేయించింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌ చైన్, రోబోటిక్స్, ఆటోమేషన్‌ తదితర ఆధునిక సాంకేతిక అంశాల్లో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్‌డీసీ) ద్వారా పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయించింది. ఇవి నిరంతరం కొనసాగేలా ప్రతి డివిజన్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలతోపాటు ప్రత్యేకంగా స్కిల్‌ యూనివర్సిటీని నెలకొల్పుతోంది. 2,400 మందికి స్కిల్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయించింది. విద్యార్థులకు ఫలితాల ఆధారిత అభ్యాసం (అవుట్‌కమ్‌ బేస్డ్‌ లెర్నింగ్‌) ద్వారా బీటెక్‌ రెండో ఏడాది నుంచే ప్రభుత్వం క్రెడిట్‌లతో కూడిన నైపుణ్య కోర్సులను కూడా ఏర్పాటు చేయించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర కోర్సుల్లోనూ ప్రభుత్వం ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement