సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్‌లపై ‘ఈనాడు’, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా మండిపడింది. పేద పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా సాంకేతిక విద్యను ట్యాబ్‌ల ద్వారా అందిస్తుంటే భరించలేక అవి అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది.
వాళ్లు సాంకేతిక విద్య ద్వారా రాణిస్తే మీకు కడుపుమంటా అని ప్రశ్నించింది. వాస్తవాలను కప్పిపుచ్చి అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాయడం, ఆరోపణలు చేయడాన్ని ఖండించింది. పనికిమాలిన తప్పుడు అంశాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాస్తవాలు ఏమిటో ప్రజల ముందుంచింది.
విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లకు సంబంధించి ‘8.7 అంగుళాల తెరపై వివాదాలు’ అంటూ ‘ఈనాడు’లో వచ్చిన కథనం, ‘సీఎం జగన్‌కు రూ.221 కోట్ల కానుక’ అంటూ తెలుగుదేశం చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. అంతేకాక.. టెండర్ల ప్రక్రియలో ఎవరైనా పాల్గొనే అవకాశమున్నప్పటికీ మీరెందుకు పాల్గొనలేదని విద్యాశాఖ వాటిని సూటిగా ప్రశ్నించింది.
నిజానికి.. ప్రభుత్వం ఇస్తున్న ట్యాబ్‌లకు మూడేళ్ల వారంటీతోపాటు పలు ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. అలాగే, టెండర్లలో శాంసంగ్ పాల్గొని ఎల్–1గా నిలిచింది కాబట్టి టెండర్‌ను ఆ సంస్థకు అప్పగించామని స్పష్టంచేసింది. ఇక వచ్చే ఏడాది కూడా ఐదు లక్షలకు పైగా ట్యాబ్‌లు అవసరమవుతాయని.. ఇవే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉన్న ట్యాబ్‌లను మూడేళ్ల వారంటీతో రూ.12వేలకు ఈనాడు, తెలుగుదేశం పార్టీలు ఇస్తే కాంట్రాక్టును వారికే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ సవాల్ చేసింది.
రివర్స్ టెండరింగ్‌తో రూ.187 కోట్లు ఆదా
ఇక ట్యాబ్‌లకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నాలుగు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వం రూ.187 కోట్లు ఆదా చేసింది. నిజానికి.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్‌లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలు అమెజాన్ లాంటి సంస్థలు అందించే ట్యాబ్‌లలో లేవు. రూ.12,843 ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ ట్యాబ్‌లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలతో అమెజాన్ లాంటి సంస్థలు ఇచ్చే ట్యాబ్ ధర రూ.3,603 ఎక్కువగా (22 శాతం) ఉంది. అలాగే, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలోనే మండల పాయింట్ల వరకు వాటిని చేర్చేందుకు అయ్యే ఖర్చు కూడా కలిపి ఉంది.
ఆరోపణ–1: 8వ తరగతి విద్యార్థులకు అందించిన పీసీ ట్యాబ్ ఖరీదు రూ.11,999. ఆన్‌లైన్‌లో ఇదే పరికరాన్ని బల్క్‌గా కొనుగోలుచేస్తే రూ.9వేలే. ఈ లెక్కన ట్యాబ్‌ల పంపిణీలో రూ.221 కోట్లు స్వాహా చేశారు.
వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ నిజం కాదు. ఆన్‌లైన్ పోర్టళ్లు కూడా బల్క్‌లో నేరుగా ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్ (ఓఈఎం) నుంచి కొనుగోలుచేసి తక్కువ మార్జిన్‌కు అమ్ముతుంటాయి. అందువల్ల ఆన్‌లైన్ ధరలు తక్కువగా ఉంటాయనడం నిజంకాదు. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పీసీ ట్యాబ్‌లను అదనపు ఫీచర్లు ఇతర ఐటెమ్‌లతో కలిపి కొనుగోలు చేసింది. ఇవేవీ ఆన్‌లైన్ కొనుగోళ్లలో కవర్ కావు. ఆయా వస్తువులు మార్కెట్ ధరకన్నా ఎంతో తక్కువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ వివరాలు..
ఆరోపణ–2: ట్యాబ్ డిస్‌ప్లే సైజు శ్యామ్‌సంగ్ కంపెనీకి తగ్గట్లుగా 8.7 అంగుళాల సైజును టెండర్లలో పెట్టారు. 8 అంగుళాలు ఆపైన డిస్‌ప్లే సైజు ఉండాలనేలా నిబంధనను మార్పు చేయాలని ఇతర కంపెనీలు కోరినా పట్టించుకోలేదు. వారిని పోటీ నుంచి తప్పించేందుకే ఇలా చేశారు.
వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ కూడా నిజం కాదు. టెండర్ డాక్యుమెంటు పత్రాల్లో స్పెసిఫికేషన్లలో డిస్‌ప్లే సైజు 8.7 అంగుళాలు లేదా ఆపై, 1,280 800 రిజల్యూషన్లో, టచ్‌స్క్రీన్ ఉండాలని పేర్కొన్నారు. ఏ ట్యాబ్ అయినా 8.7 అంగుళాల స్క్రీన్‌సైజు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవి ఆమోదయోగ్యమని స్పష్టంగా ఉంది. ఒరిజినల్ ఎక్విప్‌మెంటు మాన్యుఫాక్చరర్ల నుంచి 10 అంగుళాల పీసీ ట్యాబ్‌కు కూడా బిడ్లు స్వీకరించారు. బిడ్ల ఇవాల్యుయేషన్‌లో టెండర్ కండిషన్లను అనుసరించి ఉన్న వాటిని ఆమోదించారు.. అని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment