బడుగులకు దూరమవుతున్న బడి విద్య
గత 50 ఏళ్లుగా సాధారణ విద్యపై పాలకులు చూపిస్తూ వచ్చిన వివక్ష కారణంగా తెలంగాణలో బడుగులకు విద్య అందని ద్రాక్షలా తయారైంది. స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు దాటుతున్నా, బడి విద్య అనేది బడుగులకు నేటికీ కలగానే మిగిలింది. పేద, బలహీన, దళిత, గిరిజన వర్గాలలో అంత రాలు పెరగడానికి ఇదే కారణం. విద్య పేదలకు ఖరీదైన సరుకుగా మారి పోయింది. పాలకుల దివాలాకోరు విధానం వల్ల తెలంగాణలో అక్షరా స్యత కేవలం అంకెలకే పరిమితమైంది. నాలుగున్నర దశాబ్దాల పోరా ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో బడుగుల అభి వృద్ధి ఇకనైనా సాధ్యపడుతుందని ఆశించారు. తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ హామీ లవర్షం కురిపించారు కేసీఆర్.
అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా దీనిపై స్పష్టతలేదు. పైగా హేతుబద్ధీకరణ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని బడుగు లకు బడి విద్యను దూరం చేస్తున్నారు. డ్రాపవుట్ శాతం పెరుగుతోంది.. తగ్గించాలని చెబుతూనే, పిల్లలు తక్కువమంది ఉన్నారు అని పాఠశాలలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గ్రామంలో, ఒక కాలనీలోని పాఠశా లలో పిల్లలు తక్కువగా ఉన్నారన్న సాకుతో వాటిని మూసివేస్తే ఆ పిల్లలు ఎక్కడికెళతారు? పాఠశాలల్లో మౌలిక వసతుల లేమికి, సరైన ఉపాధ్యా యులు లేనందుకు ప్రభుత్వ అసమర్థతే కారణం. దీంతోనే ప్రభుత్వ పాఠశా లలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి బదులుగా అక్కడే ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను మూసివేయడమే ఈ సమస్యకు అసలైన పరిష్కారం.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ హేతుబద్ధీకరణ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 2,881 పాఠశాలలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 669 పాఠశాలలు, నిజామాబాద్‌లో 198, కరీంనగర్‌లో 404, మెదక్‌లో 226, హైదరాబాద్‌లో 12, రంగారెడ్డిలో 145, మహబూబ్‌నగర్‌లో 241, నల్గొండలో 305, వరంగల్‌లో 404, ఖమ్మంలో 347.. ఇలా మొత్తం 2981 పాఠశాలలు మూసివేతకు గురవనున్నాయి. మరోవైపు తెలంగా ణలో సుమారు 5 లక్షల మంది బాల కార్మికులున్నారు. స్వచ్ఛ హైదరా బాద్ పేరుతో నగరంలో మురికివాడల చుట్టూ తిరుగుతున్న సీఎం కేసీ ఆర్‌కి లక్షలాది బాల కార్మికులు కనబడలేదా? వీరికోసం ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 25 వేల ప్రభుత్వ పాఠశాలలు అవసరం. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయవలసిందిపోయి బడుగులకు బడి విద్యను దూరం చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇకనైనా మేలుకోవాలి. పాఠశాలల మూసివేతను మానుకుని, ప్రస్తుతం తెలంగాణలో ఖాళీగా ఉన్న 26 వేల ఉపాధ్యాయ నియామకాలను భర్తీచేయాలి. రేషనలైజేషన్‌ను వెంటనే ఆపివేయాలి. (బడుగులకు బడి విద్య, కేజీ టు పీజీ ఉచిత విద్య కోసం తెలంగాణ విద్యార్థి సంఘాలు నేడు తలపెడుతున్న సమ్మె, నిరసనల సందర్భంగా...)
- తోట రాజేష్, ప్రగతిశీల యువజన సంఘం నాయకులు