రాష్ట్రంలో పాఠశాల విద్యా రంగంలో ఇక నుంచి విద్యార్థుల తల్లిదండ్రులదే కీలక భూమిక కానుంది. పాఠశాలల అభివృద్ధితోపాటు బోధనాభ్యసన కార్యక్రమాలు, ప్రమాణాల పెంపు అంశాల్లోనూ వారిని భాగస్వాములను చేస్తూ పాఠశాలల సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)లను పేరెంట్ మేనేజ్‌మెంట్ కమిటీ (పీఎంసీ)లు లేదా పేరెంట్ కమిటీలుగా మార్పు చేసింది. ప్రభుత్వ స్కూళ్లలోనే కాకుండా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలోనూ ఈ కమిటీలను ఏర్పాటు చేయించి విద్యార్థి కేంద్రంగా విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. తద్వారా యాజమాన్య ప్రయోజనాలకు అడ్డుకట్ట వేయనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పేరెంట్ కమిటీల ప్రాధాన్యతను పలుమార్లు నొక్కిచెప్పారు.
సాక్షి, అమరావతి: పాఠశాలల అభివృద్ధిలో పేరెంట్ కమిటీలదే కీలక పాత్ర కావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వాటికి మరింత ప్రాధాన్యత పెరుగుతోంది. గత టీడీపీ ప్రభుత్వం చాలాకాలం కమిటీలను ఏర్పాటు చేయలేదు. అయితే.. పాఠశాల యాజమాన్య కమిటీలు తప్పనిసరి అని, కమిటీలకు ఎన్నికలు నిర్వహించకుంటే సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) నిధులు నిలిపివేయాల్సి ఉంటుందని కేంద్రం తాఖీదులు ఇవ్వడంతో ఆదరాబాదరాగా ఎన్నికలు చేపట్టి వాటిని టీడీపీ నేతలతో నింపేసింది. పాఠశాలలకు ఎస్‌ఎస్‌ఏ ద్వారా ఇచ్చే నిధులను యాజమాన్య కమిటీల ఖాతాల్లో వేస్తారు. అయితే.. డమ్మీ కమిటీలను ఏర్పాటు చేసిన టీడీపీ.. క్రీడల నిర్వహణ, పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలకు ఇచ్చిన నిధులే కాకుండా సుద్దముక్కలు, డస్టర్లు, తెల్ల కాగితాలు, ఇతర బోధన పరికరాలకు కేంద్రం ఇచ్చిన మొత్తాలను భారీ ఎత్తున దారి మళ్లించింది.
పేరెంట్ కమిటీల ఎంపిక ఇలా..
- పేరెంట్ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పిస్తారు.
- మూజువాణీ విధానంతో ఎన్నిక నిర్వహిస్తారు. అవసరమైతే రహస్య బ్యాలెట్ పద్ధతిని అనుసరిస్తారు.
- తల్లిదండ్రులు, సంరక్షకుల్లో 50 శాతానికి తగ్గకుండా ఎన్నికకు హాజరు కావాల్సి ఉంటుంది.
- తల్లిదండ్రుల్లో ఒక్కరికే ఓటుహక్కు ఉంటుంది.
- ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులను సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారితోపాటు ఇద్దరు మహిళలై ఉండాలి.
- ఎన్నికైన సభ్యులు తమ నుంచి ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. వీరిద్దరిలో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారు, మరొకరు మహిళ ఉండాలి.
- ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 24 మంది సభ్యులుంటారు.
- ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి 9 మంది సభ్యులను ఎన్నుకుంటారు.
- సభ్యుల కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది, లేదా ఆ విద్యార్థులు పాఠశాలను వదిలి వెళ్లే వరకు ఉంటుంది.
- స్కూల్ హెడ్‌మాస్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఒక టీచర్, సంబంధిత వార్డు మెంబర్, కౌన్సిలర్/ కార్పొరేటర్, ఏఎన్‌ఎం, వార్డు మహిళా సమాఖ్య అధ్యక్షులు, అంగన్‌వాడీ వర్కర్‌లను నియమిస్తారు.
- కోఆప్టెడ్ సభ్యులుగా పాఠశాల అభివృద్ధికి తోడ్పడే విద్యావేత్తలను, దాతలను, స్వచ్ఛంద సేవకులను ఎంపిక చేస్తారు.
పేరెంట్ కమిటీలకు కీలక బాధ్యతలు
ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో స్కూళ్ల సమగ్రాభివృద్ధికి పేరెంట్ కమిటీలను బలోపేతం చేయనుంది. కమిటీలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. కమిటీలను ఏర్పాటు చేసి కీలక బాధ్యతలు అప్పగించనుంది.
- విద్యా హక్కు చట్టం ప్రకారం.. విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందేలా కమిటీలు చూస్తాయి.
- నిధులను వినియోగించే అధికారం కమిటీలకే ఉంటుంది.
- పాఠశాలల పనితీరును సమీక్షించి సరైన రీతిలో కొనసాగేలా చేస్తాయి.
- స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడంతోపాటు పనులు అనుకున్న విధంగా జరిగేలా చూస్తాయి.
- ప్రభుత్వ నిధులతో కొనసాగే నిర్మాణ పనులు, ఇతర కార్యక్రమాల్లో లోపాలు లేకుండా పర్యవేక్షిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment