15,036 సీట్లు ఖాళీ
- ముగిసిన ఇంజనీరింగ్, బీఫార్మసీ తుది దశ కౌన్సెలింగ్
- కొత్తగా 13,953 మందికి సీట్లు..
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్ (ఇంజనీరింగ్, బీఫార్మసీ) తుదిదశ కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. మొత్తంగా 28,989 సీట్లు అందుబాటులో ఉండగా.. కొత్తగా 13,953 మందికి సీట్లు లభించాయని సాంకేతిక విద్య కమిషనర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. గతంలో సీట్లు పొందిన అభ్యర్థుల్లో 15,822 మంది స్లైడింగ్ ద్వారా ఇతర కోర్సులు/కళాశాలల్లో సీట్లు పొందారని తెలిపారు. ఇంకా 15,036 సీట్లు మిగిలిపోయాయని చెప్పారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో 12,638 సీట్లు, ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో 2,394 సీట్లు మిగిలాయని వెల్లడించారు. ఇక తుది దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నా.. 2,583 మంది అభ్యర్థులకు సీట్లు లభించలేదని తెలిపారు. ఇక 80 కళాశాలల్లో వందశాతం సీట్లు భర్తీకాగా.. రెండు కళాశాలలకు ఒక్క విద్యార్థి కూడా ఆప్షన్ ఇవ్వకపోవడం గమనార్హం. మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఆయా కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకునే అవకాశం ఉంది. స్పాట్ అడ్మిషన్ ద్వారా పొందిన సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.
2 లోగా ‘సెల్ఫ్ రిపోర్టింగ్’ చేయాలి...
తుదిదశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోగా ఫీజు చెల్లించి వెబ్‌సైట్లో ‘సెల్ఫ్ రిపోర్టింగ్’ చేయాలని అధికారులు సూచించారు. సీటు లభించిన కళాశాల్లో రిపోర్టు చేసేందుకు కూడా ఆగస్టు 2 చివరి తేదీ అని చెప్పారు. సీటు రద్దు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 4 లోగా ఫీజు రశీదు, సర్టిఫికెట్ల ఎక్నాలెడ్జిమెంట్ రశీదుతో మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో సంప్రదించాలని సూచించా రు.ఫీజు రీయింబర్స్‌మెంట్ నిమిత్తం ఆదాయ ధ్రువీకరణ సమర్పించని అభ్యర్థులు ఆగస్టు 1లోగా రాష్ట్రంలో ఏదైనా హెల్ప్‌లైన్ కేంద్రంలో అప్‌డేట్ చేసుకోవచ్చు.
బీఫార్మసీ, ఫార్మ్-డిలపై తగ్గిన మోజు
బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సులపై అభ్యర్థుల్లో మోజు తగ్గడంతో భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఎంపీసీ స్ట్రీమ్ నుంచి చేరే బీఫార్మసీ కోర్సుల్లో కేవలం 5.83శాతం సీట్లు, ఫార్మ్-డి కోర్సులో 12.35 శాతం సీట్లు భర్తీ కావడం గమనార్హం.