మధ్యలోనే మంగళం
- నాలుగేళ్లలో చదువు ఆపేసిన విద్యార్థులు 2,59,000
- కోర్సులకు సగటున 60 వేల మంది డిగ్రీ, పీజీ విద్యార్థుల బ్రేక్
- ఆర్థిక సమస్యలు, పరీక్షల్లో ఫెయిలవడమే కారణం
- సంక్షేమ శాఖ పరిశీలనలో వెలుగుచూసిన వాస్తవాలు
సాక్షి, హైదరాబాద్
గ్రాడ్యుయేషన్... ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవసరమైన కనీస విద్యార్హత ఇది. ఎలాంటి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నా డిగ్రీ ఉండాల్సిందే. మరికొన్ని ఉద్యోగాలకైతే పోస్టు గ్రాడ్యుయేషన్ సైతం తప్పనిసరి. పదేళ్ల క్రితం వరకు ఇంజనీరింగ్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో సీటు రావడం గగనంగా ఉండేది. ప్రస్తుతం కాలేజీల సంఖ్య పెరగడం, దానికితోడు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయడంతో ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పథకాలు ముంగిట్లోకి వచ్చినప్పటికీ ఏటా కొన్ని వేల మంది విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవడంలేదు. పలు కారణాలతో కోర్సులకు మధ్యలోనే చెక్ పెట్టేస్తున్నారు.
డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారిలో సగటున 60 వేల మంది చదువులకు అర్ధంతరంగా మంగళం పాడేస్తున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2,59,375 మంది విద్యార్థులు కోర్సులను మధ్యలోనే ఆపేయడం గమనార్హం. రాష్ట్రంలో 7,005 కళాశాలలుండగా అందులో 2,750 కాలేజీలు ఇంటర్మీడియెట్, వొకేషనల్ కోర్సులకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే మిగతా 4,245 కాలేజీలు డిగ్రీ, వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులను బోధిస్తున్నాయి. 2016–17 విద్యాసంవత్సరం గణాంకాల ప్రకారం ఈ కాలేజీల్లో 16.5 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 13.67 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు.
ఆరు శాతం... మధ్యలోనే తిరుగుముఖం...
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించి లబ్ధిదారులపై సాంఘిక సంక్షేమ శాఖ పరిశీలన చేపట్టింది. లబ్ధి పొందే విద్యార్థులు కోర్సులను పూర్తి చేస్తున్నారో లేదో అనే అంశంపై ఆన్‌లైన్‌లో విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కింద దరఖాస్తు చేసేకున్న వారిలో ఏటా సగటున 6 శాతం మంది విద్యార్థులు కోర్సులను మధ్యలోనే వలిలేస్తున్నట్లు తేలింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగాలు చేయాల్సి రావడం, సెమిస్టర్ పరిక్షల్లో ఫెయిల్ కావడం ఫలితంగా డిటెండ్ అవ్వడం, దీర్ఘకాలిక గైర్హాజరు వల్ల విద్యార్థులు చదువు ఆపేస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక కారణాలతో చదువును ఆపేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ డిటెండ్ విద్యార్థుల సంఖ్య భారీగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు.
శ్రద్ధ లేకపోవడమే..
కోర్సులను మధ్యలో ఆపేస్తున్న వారిలో ఎక్కువగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులే ఉంటున్నట్లు అధికారుల పరిశీలనలో తెలిసింది. చదువు కొనసాగింపు ప్రక్రియలో కొందరు విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాక దీర్ఘకాలంపాటు గైర్హాజరవుతున్నట్లు వెల్లడైంది. పరీక్ష ఫీజులు, ఉపకార దరఖాస్తుల సమయంలో మినహా మిగతా సమయాల్లో తరగతి గది ఎరుగని విద్యార్థులు సైతం ఉంటున్నారు. ఇలాంటి విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కళాశాలల యాజమాన్యాలు పరీక్షలకు అనుమతించకపోవడంతో డ్రాపవుట్లుగా మారిపోతున్నారు. అలాంటి విద్యార్థులు తిరిగి పరీక్షలు రాయడం లేదని అధికారులు విశ్లేషిస్తున్నారు. కోర్సు ప్రవేశాల్లో చూపిన శ్రద్ద.. ఆ తర్వాత లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు.
గత నాలుగేళ్లలో కోర్సులను మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు
సంవత్సరం విద్యార్థులు
201213 51,500
201314 54,769
201415 63,654
201516 89,452