బోధనా విధానంలో మార్పు రావాలి : సుధీర్ కుమార్ జైన్‌ | To change the process of teaching: Sudhir Kumar Jain | Sakshi
Sakshi News home page

బోధనా విధానంలో మార్పు రావాలి : సుధీర్ కుమార్ జైన్‌

Published Sun, Oct 19 2014 11:02 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైన్‌, డెరైక్టర్‌,ఐఐటీ గాంధీనగర్ - Sakshi

ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైన్‌, డెరైక్టర్‌,ఐఐటీ గాంధీనగర్

గెస్ట్ కాలమ్
 
సాంకేతిక విద్య.. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించింది. కానీ ఎన్నో సమస్యలు. ముఖ్యంగా ఏటా లక్షలమంది సర్టిఫికెట్లు అందుకుంటున్నా.. ఉద్యోగ నైపుణ్యాలు లేవనేది ప్రధాన ఆరోపణ. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బోధనలో మార్పులు తెస్తేనే విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు కావాల్సిన నైపుణ్యాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గాంధీనగర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైన్. ఐఐటీ-రూర్కీలో 1979లో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేసి.. తర్వాత కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 1984 నుంచి ఐఐటీ-కాన్పూర్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత ఐఐటీ గాంధీనగర్ వ్యవస్థాపక డెరైక్టర్‌గా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైన్‌తో ఇంటర్వ్యూ..
 
అన్నిటా మార్పులు అవసరం

ఇంజనీరింగ్, సాంకేతిక విద్య విధానంలో మార్పులు తీసుకురావాలనే విద్యావేత్తల అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిందే. అయితే, ఇదే సమయంలో అన్ని కోర్సులకు సంబంధించిన విధానాల్లోనూ మార్పులు చేయాలి. ముఖ్యంగా ఉన్నత విద్యలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. స్ట్రక్చరల్ విధానంలోని కరిక్యులం, ఫ్యాకల్టీ కొరత, ఇండస్ట్రీ-అకడమిక్ వర్గాల మధ్య ఒప్పందాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వీటిల్లో ముఖ్యమైనవి. వీటిని అధిగమించాలంటే విద్యావేత్తలు, పరిశ్రమ వర్గాలు కలిసి చర్చించి ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన విధానాలు సూచించాలి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వంటి వినూత్న విధానాలను ప్రవేశపెట్టాలి. వీటివల్ల విద్యార్థులకు వాస్తవ పరిస్థితులకు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయి. దాంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సంసిద్ధత లభిస్తుంది.
 
ఇండస్ట్రీ - ఇన్‌స్టిట్యూట్ ఒప్పందాలు ముఖ్యం

విద్యార్థులకు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు లభించేలా తద్వారా పరిశ్రమ వర్గాల నుంచి గుర్తింపు పొందేలా చేయాలంటే ఇన్‌స్టిట్యూట్‌లు పరిశ్రమ వర్గాలతో ఎక్స్ఛేంజ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఐఐటీ- గాంధీనగర్ ప్రారంభించినప్పటి నుంచీ రీసెర్చ్, అకడమిక్స్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలతో నిరంతరం సంప్రదింపులు చేస్తోంది. అండర్ రైటర్స్ లేబొరేటరీ, ది రికో కంపెనీ, నీల్సన్ ఎల్‌ఎల్‌సీ వంటి అంతర్జాతీయ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాం.
 
ఐఐటీల్లో ఫ్యాకల్టీ కొరతకూ పరిష్కారం

ఐఐటీల్లో అందులోనూ కొత్తగా ఏర్పాటైన ఐఐటీలను వేధిస్తున్న సమస్య ఫ్యాకల్టీ కొరత. దీనికి కూడా పరిష్కారం ఉంది. ప్రస్తుత వేతన విధానాలు, ఇతర ప్రోత్సాహకాలను దృష్టిలో పెట్టుకుంటే.. అనుభవజ్ఞులైన వారికంటే యంగ్ టాలెంట్‌కు పెద్దపీట వేయాలి. దీనివల్ల ఫ్యాకల్టీ కొరత తీరడంతోపాటు టీచర్ - స్టూడెంట్స్ మధ్య జనరేషన్ గ్యాప్ కూడా తక్కువగా ఉంటుంది. విద్యార్థులు కూడా తమ టీచర్లతో బిడియం లేకుండా సందేహాలు నివృత్తి చేసుకోగలరు. విద్యా సంస్థలు.. పరిశోధన, అభివృద్ధికి పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు చేసుకుంటే అద్భుత ఫలితాలు సొంతమవుతాయి. ఇవి విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించడంతోపాటు, సామాజిక అవసరాలను తీర్చేందుకు దోహదం చేస్తాయి. ఈ క్రమంలో ఇన్‌స్టిట్యూట్‌లు స్పాన్సర్డ్ రీసెర్చ్ కోసం ప్రయత్నించాలి. పరిశ్రమలను మెప్పించే రీతిలో తమ ఇన్‌స్టిట్యూట్‌లోని సదుపాయాలు, సౌకర్యాల గురించి వివరించాలి. ఇలాంటి చర్యల ఫలితంగానే ఐఐటీ - గాంధీనగర్‌కు అమెరికాకు చెందిన అండర్ రైటర్స్ లేబొరేటరీస్ నుంచి ఫైర్ ఇంజనీరింగ్ లేబొరేటరీ, ఫైర్ సేఫ్టీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్స్ కోసం ఐదు లక్షల డాలర్ల గ్రాంట్ లభించింది.
 
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను అకడమిక్ స్థాయిలోనే

ప్రస్తుత పారిశ్రామికీకరణ, పోటీ వాతావరణం నేపథ్యంలో విద్యార్థులకు అకడమిక్ స్థాయి నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన కల్పించాలి. ఈ విషయంలో ఇతర ఇన్‌స్టిట్యూట్‌లతో పోల్చితే ఐఐటీలు కొంత ముందంజలో ఉన్నాయి. ఐఐటీ- గాంధీనగర్‌లో బీటెక్ స్థాయిలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ఎలక్టివ్‌గా, మైనర్‌గా పొందుపరిచాం. దేశంలో ఇటీవల కాలంలో వ్యక్తమవుతున్న మరో అభిప్రాయం కొత్త ఐఐటీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని! కానీ నా ఉద్దేశంలో పాత ఐఐటీలతో పోల్చితే కొత్త ఐఐటీలకు కొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం ఇందులో ముఖ్యమైంది, ప్రస్తావించదగింది. దీనివల్ల ఒక ఇన్‌స్టిట్యూట్ వృద్ధికి అవసరమైన మార్పులను వేగవంతంగా అమలు చేసే వీలు లభిస్తుంది. అంతేకాకుండా పాత ఐఐటీల్లో లోపాలను పరిశీలించి అవి కొత్త ఐఐటీల్లో తలెత్తకుండా చూడొచ్చు.
 
జాబ్ ప్రొవైడర్స్‌ను రూపొందించడమే లక్ష్యం

ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌కు జాబ్స్ సొంతమవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ జాబ్ ప్రొవైడర్స్‌ను తీర్చిదిద్దితే వారు మరికొందరికి అవకాశాలు కల్పిస్తారు. ఈ క్రమంలో ఐఐసీ పేరుతో ఇంక్యుబేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం. దీని ప్రధాన ఉద్దేశం ఔత్సాహిక విద్యార్థులు తమ సొంత వెంచర్లు ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించడం. స్టార్టప్స్ దిశగా నడవాలనుకునే విద్యార్థులకు మంచి ప్రోత్సాహమందిస్తున్నాం.
 
విస్తృత కోణంలో ఆలోచిస్తే విభిన్న అవకాశాలు

ఐఐటీలకు ఉన్న క్రేజ్‌తో ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో అడుగుపెట్టాలనుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల సీటు కొందరికే లభిస్తోంది. ప్రతిభ ఉంటే అవకాశాలకు ఎలాంటి హద్దులు లేవు అని గుర్తించాలి. ఐఐటీల స్థాయిలోనే దేశంలో మరెన్నో ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. వాటిలో చేరేందుకు కృషి చేయాలి. కోర్సులో చేరాక.. అభ్యసనం పరంగా స్వతంత్రంగా వ్యవహరించాలి. అన్నీ టీచర్లు చెబుతారు అనుకుంటే పొరపాటు. టీచర్ ఒక అంశం చెబితే దానికి అనుబంధంగా ఉండే అన్ని అంశాలను సొంతంగా నేర్చుకోవాలి. అప్పుడే కెరీర్‌లో రాణించగలుగుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement