సాక్షి, హైదరాబాద్: డిగ్రీనా... అనే చులకన భావం ఇక నుంచి ఉండదంతే. దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్సులకు భవిష్యత్‌లో డిమాండ్ పెరగబోతోంది. ఇంతకాలం కొనసాగిన సంప్రదాయ కోర్సుల్లో అనేక మార్పులు తెస్తున్నారు. సాంకేతిక విద్యకు తీసిపోని రీతిలో సాన పడుతున్నారు. దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలుండేలా తీర్చి దిద్దుతున్నారు. అనేక కొత్త కోర్సుల మేళవింపు, కంప్యూటర్ అప్లికేషన్ల గుభాళింపు డిగ్రీ కోర్సుల తీరు తెన్నులనే మార్చబోతోంది.
హానర్స్ కోర్సులకు ప్రాధాన్యం
తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ హానర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొందించింది. ఈ ఏడాది నుంచే తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (హానర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెస్తున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు హానర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. నాలుగేళ్ళు చదివితే హానర్స్ డిగ్రీ ఇస్తారు. మూడేళ్ళకే మానుకుంటే సాధారణ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో పాటు ఏ తరహా డిగ్రీ చేసినా, ఇష్టమైన ఓ సబ్జెక్టును చేసే సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చారు. అంటే బీఏ కోర్సు చేస్తున్న విద్యార్థి కూడా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఓ సబ్జెక్టు చేసే వీలుంది.
వాణిజ్య విప్లవంలో డిగ్రీకి ప్రాధాన్యత
గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ–కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అకౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్ళల్లోనే ఏడు రెట్లు పెరిగాయి.
బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. దీంతో బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, హానర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్‌ను తీసుకొచ్చారు. బీమా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం, జీఎస్‌టీ తీసుకురావడంతో టాక్స్ నిపుణుల అవసరం రెట్టింపయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ–కామర్స్, రిటైల్ సంస్థల పెరుగుదల కూడా కలిసివచ్చింది.
పెరుగుతున్న క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్
కేవలం ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళే ఐటీ కంపెనీలు ఇప్పుడు నాణ్యమైన విద్యను అందించే డిగ్రీ కాలేజీల్లోనూ నియామకాలు చేపడుతున్నాయి. నాన్–ఇంజనీరింగ్‌గా పిలిచే డిగ్రీ విద్యార్థులను గత రెండేళ్ళుగా పెద్ద ఎత్తున తమ కంపెనీల్లో చేర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో 110 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోనే దాదాపు 300 కాలేజీలున్నాయి.
అధికారిక లెక్కల ప్రకారం దాదాపు వంద కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నారు. ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్, మార్కెటింగ్ కంపెనీలతో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, సీజీఎల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ కోసం వస్తున్నాయి. ప్రతీ ఏటా ఈ కంపెనీలు 10 నుంచి 20 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ వార్షిక వేతనం ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment