టాస్క్‌ఫోర్స్ నివేదికింకా గుట్టుగానే ! | Task force report secret to Inspection of Engineering Colleges | Sakshi
Sakshi News home page

టాస్క్‌ఫోర్స్ నివేదికింకా గుట్టుగానే !

Published Mon, Mar 10 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

టాస్క్‌ఫోర్స్ నివేదికింకా గుట్టుగానే !

టాస్క్‌ఫోర్స్ నివేదికింకా గుట్టుగానే !

ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీల వివరాలు వెలుగుచూడని వైనం
సాంకేతిక విద్యాశాఖ వద్దే నివేదికను పెండింగ్‌లో పెట్టిన సర్కారు
మళ్లీ ప్రవేశాల ప్రక్రియ మొదలుతో తల్లిదండ్రుల్లో ఆందోళన

 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై తనిఖీలు చేసి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఇంకా గుట్టుగానే ఉంచింది. తనిఖీలు పూర్తయి ఏడాది గడిచినా ఆ నివేదికను బయట పెట్టకుండా సాంకేతిక విద్యాశాఖ వద్దే పెండింగ్‌లో పెట్టింది. కాలేజీల వారీగా నివేదికలోని అంశాలు బయటకు వస్తే నాణ్యతా ప్రమాణాలు కొరవడిన విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరరు. అందుకే కొన్ని కళాశాలల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే టాస్క్‌ఫోర్స్ నివేదికను ప్రభుత్వమే బయటకు రానివ్వట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది కూడా నివేదికలోని అంశాలను పక్కనబెట్టి అన్ని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టిన ప్రభుత్వం... ఇప్పుడు మళ్లీ ప్రవేశాల సమయం వచ్చినా దానిపై స్పందించట్లేదు.
 
 ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ గత నెల 20నే ప్రారంభమైంది. అప్పుడే తల్లిదండ్రుల్లో ఏది మంచి కళాశాల? ఎక్కడ ఎలాంటి బోధనా సిబ్బంది ఉన్నారు? సదుపాయాలెలా ఉన్నాయనే అంశాలపై ఆలోచన మొదలైంది. ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నేపథ్యంలో అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడికి అవకాశం లేదు. ఇప్పుడైనా ఆ టాస్క్‌ఫోర్స్ నివేదికను బయటపెట్టాలని, కాలేజీల వారీగా వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం ద్వారా విద్యార్థులకు మేలు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీలు చేసే ప్రచారంతో మోసపోకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
 
 సౌకర్యాల్లేకున్నా భారీగా ఫీజు....
 2012-13 విద్యా సంవత్సరం ఫీజుల ప్రతిపాదనల కోసం ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యా కళాశాలలు సమర్పించిన వ్యయ నివేదికల్లో... కొన్ని యాజమాన్యాలు రూ. లక్షకు పైగా ఫీజు ప్రతిపాదించాయి. చాలా కాలేజీల్లో సౌకర్యాలేవీ లేకున్నా ఫీజు భారీగా పెంచాలని పేర్కొన్నాయి. దీంతో కాలేజీల్లో వసతులపై తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చట్టసవరణ చేసి 2012, ఆగస్టు 11న జీవో 54 జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.సిన్హా, సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్ షరాఫ్ సభ్యులుగా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కన్వీనర్‌గా రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు ప్రారంభించి, గత ఏడాది ఫిబ్రవరిలో పూర్తి చేసింది.
 
 దీని ఆధ్వర్యంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీలు 686 ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు చేశాయి. నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలకు వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు ఇవ్వొద్దని కమిటీ సిఫారసు చేసింది. సంబంధిత నివేదికను గత ఏడాది ఫీజుల నిర్ధారణ కోసం ఏఎఫ్‌ఆర్‌సీకి అందజేసింది. ప్రభుత్వానికి మాత్రం ఇప్పటికీ ఆ నివేదిక అందలేదు. ఒకవేళ ప్రభుత్వానికి చేరితే నివేదికను బయటపెట్టాల్సి వస్తుందని, తద్వారా కాలేజీల్లోని లోపాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే తొక్కిపెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
 నివేదికలోని కొన్ని అంశాలు...
-  60 శాతం కాలేజీల్లో నిబంధనల ప్రకారం ప్రయోగశాలలు, పరికరాలు లేవు. కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నా 75 శాతం కాలేజీల్లో ఇంటర్‌నెట్ సదుపాయమే లేదు.
-  లైబ్రరీల్లో విద్యార్థుల రిఫరెన్స్‌కు ఉపయోగపడే జర్నల్స్ లేవు.
-  20 శాతం కాలేజీల్లో నిబంధనల ప్రకారం భవనాలు లేవు. ఏటేటా అదనపు కోర్సులను, సీట్లను మంజూరు చేయించుకునే కాలేజీ యాజమాన్యాలు... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలను మాత్రం నిర్మించట్లేదు.
-  ప్రతి 15 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఫ్యాకల్టీ ఉండాల్సి ఉన్నా 75 శాతం కాలేజీల్లో ఆ నిష్పత్తిలో లేరు.
-  164 కాలేజీలు మాత్రమే నిబంధనల ప్రకారం ఆరో వేతన స్కేళ్లను అమలు చేస్తున్నాయి. మిగిలిన 500కు పైగా కాలేజీల్లో అమలుకు నోచుకోవట్లేదు.
-  ఫ్యాకల్టీకి ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్హత ఉండాల్సి ఉన్నా 70 శాతం మంది బీటెక్ అర్హతతోనే పనిచేస్తున్నారు. వారికి ఆయా యాజమాన్యాలు రూ. 6 వేల నుంచి రూ. 10 వేలు వరకు మాత్రమే చెల్లిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement