నేటి నుంచి పాలిటెక్నిక్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ | From today Polytechnic Admissions Counseling | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పాలిటెక్నిక్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌

Published Mon, May 14 2018 1:45 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM

From today Polytechnic Admissions Counseling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈనెల 14 నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు పాలిసెట్‌–2018 కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్, ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, పాలిసెట్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని చెప్పారు. సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ విద్యార్థుల ప్రవేశాలు మాత్రం వారి పదో తరగతి ఉత్తీర్ణతను బట్టి ఉంటాయని వెల్లడించారు.

విద్యార్థులు 14 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ((https://tspolycet. nic.in)) రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.300, ఇతరులు రూ.600 ప్రాసెసింగ్‌ ఫీజు ఆన్‌లైన్‌ (క్రెడిట్‌/డెబిట్‌కార్డు/నెట్‌ బ్యాంకింగ్‌) ద్వారా చెల్లించాలని వివరించారు. ఫీజు చెల్లించేటప్పుడు విద్యార్థి తన మొబైల్‌ నంబరు, ఈ–మెయిల్‌ ఐడీ, ఆధార్‌ నంబరు ఇవ్వాలని, ఆదాయ ధ్రువీకరణ పత్రం (వర్తించే వారు) నంబరు ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని పేర్కొన్నారు.

తగ్గిన కాలేజీలు, సీట్లు
ఈసారి పాలిటెక్నిక్‌ కాలేజీలతోపాటు సీట్లు తగ్గిపోయాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 181 కాలేజీల్లో 43,082 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి 13 కాలేజీలు తగ్గిపోయాయి. 4,470 సీట్లకు కోత పడింది. రాష్ట్రవ్యాప్తంగా 168 కాలేజీల్లో 38,612 సీట్ల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

గతేడాది 55 ప్రభుత్వ కాలేజీల్లో 11,752 సీట్లు ఉండగా.. ఈసారి అవే కాలేజీల్లో 11,512 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. 2 ఎయిడెడ్‌ కాలేజీల్లో గతేడాది 420 సీట్లు ఉండగా, ఈసారి 360 సీట్లు ఉన్నట్లు తెలిపింది. గతేడాది 122 ప్రైవేటు కాలేజీల్లో 30,190 సీట్లు ఉండగా, ఈసారి 111 ప్రైవేటు కాలేజీల్లో 26,740 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించింది.

వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలు
ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించి తేదీల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన విద్యార్థుల ర్యాంకుల వివరాలను సాంకేతిక విద్యాశాఖ తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఏ ర్యాంకుల వారికి ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయనే వివరాలను విద్యార్థుల అవగాహన కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

విద్యార్థులు పాలిసెట్‌ ర్యాంకు కార్డు, ఆధార్‌ కార్డు, టెన్త్‌ మెమో, రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు కాకుండా ఇతర బోర్డుల వారు హాల్‌టికెట్, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, 2018 జనవరి 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని వెల్లడించింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థులు ఇప్పుడే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వారికి రెండో దశలో మిగిలిపోయే సీట్లను కేటాయిస్తారు. వారు టెన్త్‌ ఉత్తీర్ణులైతేనే ఆ సీటు ఇస్తారు.

ఇదీ ప్రవేశాల షెడ్యూలు
14–5–2018 నుంచి 18–5–2018:
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు
15–5–2018 నుంచి 19–5–2018:
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌
15–5–2018 నుంచి 21–5–2018:
వెరిఫికేషన్‌ పూర్తయిన వారికి వెబ్‌ ఆప్షన్లు
23–5–2018: మొదటి దశ సీట్లు కేటాయింపు
23–5–2018 నుంచి 27–5–2018 వరకు: ట్యూషన్‌ ఫీజు చెల్లించడంతోపాటు కాలేజీలో చేరేందుకు ఆన్‌లైన్‌లో అంగీకారం తెలపాలి. సీట్లు పొంది ఫీజు చెల్లించకుండా, అంగీకారం తెలుపకపోతే రెండో దశలో అవకాశం ఉండదు. మొదటి దశలో సీటు వస్తే అంగీకారం తెలిపి, ఫీజు చెల్లించాలి. వారి పాత ఆప్షన్ల ప్రకారం కాలేజీలు, సీటును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
24–5–2018 నుంచి 27–5–2018: సీట్లు రాని వారు ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చుకోకపోతే ముందుగా వారు ఇచ్చిన ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు.
30–5–2018: సీట్లు మెరుగుపరుచుకోవాలని అంగీకారం తెలిపిన వారికి, మొదటి దశలో సీట్లు రాని వారికి రెండో దశ సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాయబోయే వారికి కేటాయిస్తారు.
30–5–2018 నుంచి 1–6–2018 వరకు: ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరికలు
1–6–2018 నుంచి: తరగతులు ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement