15 తర్వాత ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు! | 15 after Engineering Web options! | Sakshi
Sakshi News home page

15 తర్వాత ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు!

Published Tue, May 27 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

15 తర్వాత ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు!

15 తర్వాత ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు!

జూలై 15లోగా ప్రవేశాల పూర్తికి సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు
ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించడానికి కసరత్తు

 
హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం వచ్చే నెల 15 తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వెబ్ ఆప్షన ్ల నుంచి మొదలుపెట్టి మొత్తం ప్రవేశాల ప్రక్రియను జూలై 15లోగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ జూలై 15 నాటికి పూర్తి కాకపోయినా 25 నాటికి ఆ ప్రక్రియను పూర్తిచేసి ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం జూన్ 9న ఎంసెట్ ర్యాంకులను వెల్లడించిన వెంటనే వెబ్ ఆప్షన్లకు సంబంధించిన చర్యలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 31 నాటికే ప్రవేశాలను పూర్తిచేసి ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించడంతో ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రవేశాల ప్రక్రియపై మరింత స్పష్టత అవసరమని అధికారులు భావిస్తున్నా.. వెబ్ ఆప్షన్లకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

వన్‌టైమ్ పాస్‌వర్డ్‌తో ఆప్షన్లు..

ఈసారి వెబ్ ఆప్షన్లకు వన్‌టైమ్ పాస్‌వర్డ్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఆప్షన్లు ఇచ్చే సమయంలో లాగిన్ కాగానే విద్యార్థి మొబైల్ నంబరుకు పాస్‌వర్డ్ వస్తుంది. ఆ నంబర్‌ను ఎంటర్ చేసి ఆప్షన్ల పేజీలోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆ పాస్‌వర్డ్ 15 నిమిషాలపాటు మాత్రమే పని చేస్తుంది. ఆ సమయంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం పూర్తికాగానే విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. మళ్లీ లాగౌట్ అయి, లాగిన్ అయితేనే మరో పాస్‌వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి మళ్లీ మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.. ఇచ్చిన ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్ల విధానం వల్ల ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు విద్యార్థి స్క్రాచ్ కార్డులోని పాస్‌వర్డ్‌ను దొంగిలించడం, వారికి తెలియకుండానే కొన్ని కాలేజీల్లో ఆప్షన్లు ఇవ్వడం వంటి మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ వన్‌టైమ్ పాస్‌వర్డ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement