ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దక్కని ప్రతిభా అవార్డులు
కార్పొరేట్ విద్యాసంస్థలకే పెద్దపీట
ఎంపిక విధానంపై ఎన్నో అనుమానాలు
రేపు తిరుపతిలో అవార్డుల ప్రదానం
విజయవాడ : ప్రతిభ అవార్డుల ఎంపిక ప్రహసనంగా మారింది. పేదింటి విద్యా కుసుమాల కష్టానికి గుర్తింపు దక్కలేదు. ప్రతిభకు పురస్కారం లభించలేదు. అసలు ప్రతిభ అవార్డుల ఎంపిక విధానమే లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యను ప్రోత్సహించేందుకు పదో తరగతిలో నూరు శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ అవార్డులు అందజేస్తుంది. ఈ మేరకు 2014 సంవత్సరానికి సంబంధించి మండలానికి ఆరుగురు చొప్పున జిల్లాలో 299 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఆ జాబితాను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం తిరుపతిలో జరగనుంది. ఎంపికైన విద్యార్థులకు పతకం, జ్ఞాపికతో పాటు రూ.20 వేలు నగదు బహుమతిగా ఇస్తారు. ఈ నగదును నేరుగా విద్యార్థి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
ఎంపిక విధానంపై అనుమానాలు
విద్యా శాఖ విడుదల చేసిన జాబితాపై ఉపాధ్యాయ సంఘాల నేతలు పలు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఏ ప్రాతిపదికన అవార్డులకు విద్యార్థులను ఎంపిక చేశారనే విషయంపై ప్రధానోపాధ్యాయుల వద్ద కూడా సరైన సమాధానం లేదు. కొన్ని పాఠశాలల వారు ప్రతిభ అవార్డులకు అర్హులైన తమ విద్యార్థుల జాబితాను సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం జాబితా ప్రకటించడంతో అందరూ నివ్వెరపోయారు. విజయవాడ పరిసర మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి పదో తరగతి పరీక్షల్లో పదికి పది పాయింట్లు సాధించిన వారి పేర్లు ఈ జాబితాలో లేకపోవడం వెనుక కార్పొరేట్ పాఠశాల ఒత్తిళ్లు పనిచేశాయనే అనుమానాలను పలువురు వ్యక్తంచేస్తున్నారు. విజయవాడ అర్బన్, రూరల్, కంకిపాడు, పెనమలూరు మండలాలకు సంబంధించి విద్యా శాఖ ప్రకటించిన జాబితా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విద్యార్థుల ఎంపిక తమ చేతుల్లో లేదని, ఈ ప్రక్రియను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారే చూస్తున్నారని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. కులం, ప్రతిభ, పాయింట్లను బట్టి అవార్డుల ఎంపిక చేస్తారని చెప్పారు.
సమాచారం లేదు
ప్రతిభ అవార్డులు ఎప్పుడు ప్రదానం చేస్తారు.. విద్యార్థులను ఎలా ఎంపిక చేస్తారు.. అనే విషయాలపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్దిష్టమైన సమాచారం లేదు. విద్యాశాఖ కూడా వీరికి ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. దినపత్రికల్లో ప్రకటన చేయడం మినహా పాఠశాలలకు నేరుగా సమాచారం పంపలేదు.
95 శాతం ప్రైవేటు స్కూళ్ల వారికే !
రెండు సంవత్సరాలుగా ప్రతిభ అవార్డులు ప్రదానం చేయలేదు. గతంలో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఇచ్చారు. ఈ సంవత్సరం ఒక్కసారిగా అవార్డులు ప్రకటించడం, అందులోనూ 95 శాతం ప్రైవేట్ పాఠశాలల వారినే ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో రాజకీయ ప్రమేయం ఉందనే అనుమానాలు పలువురు వ్యక్తంచేస్తున్నారు.
‘కల్యాణి’కి దక్కని అవార్డు
విజయవాడ కృష్ణలంకకు చెందిన పొడుగు కళ్యాణి నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి. ఆమె వీఎంఆర్‌ఆర్ మున్సిపల్ బాలికల పాఠశాలలో పదో తరగతి చదివింది.
పరీక్షల్లో పదికి పది పాయింట్లు సాధించింది. ఆమెకూ ప్రతిభ అవార్డు దక్కలేదు. దీంతో తనకు అవార్డు వస్తుందని భావించిన కళ్యాణి నిరుత్సాహానికి గురైంది. మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఈ జాబితా చూసి మండిపడుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ‘కార్పొరేషన్’ పాఠశాలల్లో బోధన చేస్తున్నామని, ఫలితాలు సాధిస్తున్నామని, అయితే ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో తమ విద్యార్థులకు చోటుదక్కలేదని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఎత్తుగడల్లో భాగమే
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు దూరం చేసే ఎత్తుగడల్లో భాగమే ఈ అవార్డుల ఎంపిక. కార్పొరేట్ పాఠశాలలపై మోజు పెంచేందుకు, అక్కడ విద్యా ప్రమాణాలు బాగుంటాయన్న సందేశాన్ని పంపడానికి ఈ అవార్డుల ఎంపికను వేదికగా తీసుకున్నారు. ప్రభుత్వం తీరు దారుణం.
- పూర్ణచంద్రరావు,
ఏపీటీఎఫ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్
పాపం ‘పావని’
విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2014లో పదో తరగతి పూర్తిచేసిన పావని నిరుపేద విద్యార్థిని. ఆమె తండ్రి ఆటో కార్మికుడు. పావని కష్టపడి చదవి పదికి పది పాయింట్లు సాధించింది. ఆమెకు ప్రతిభ అవార్డు లభిస్తుందని, ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని అందరూ భావించారు. ఈ మొత్తం పావని చదువుకు ఉపయోగపడుతుందని ఆశించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు విస్మయానికి గురయ్యారు.
ప్రతిభకు చోటేదీ!
Published Thu, Feb 26 2015 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement