Selected on merit awards
-
‘ప్రైవేటుకే’ పట్టాభిషేకం !
ప్రతిభ అవార్డుల ఎంపికలో లోపించిన పారదర్శకత {పైవేటు విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం అవార్డుల ప్రదానం ఒకేచోట కావడంతో విద్యార్థులకు తప్పని తిప్పలు సర్కారు విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామంటూ పదేపదే చెప్పే విద్యాశాఖ పెద్దలు విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహకరంగా అందించే ప్రతిభ అవార్డుల ఎంపికలో పారదర్శకతను గాలికి వదిలేశారు. విద్యార్థుల సంఖ్య పతనావస్థకు చేరుకుని ప్రభుత్వ పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న తరుణంలో ప్రైవేటు పాఠశాలలనే ప్రోత్సహించే దిశగా ప్రతిభ అవార్డుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చిత్తూరు(ఎడ్యుకేషన్): శుక్రవారం తిరుపతిలో జరగనున్న ప్రతి భ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి, ప్రధానంగా ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి ఎంపికైన విద్యార్థులను ఒకేచోటుకు పిలవడంతో వారు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తిరుపతికి చేరుకున్న విద్యార్థులకు మూడు జిల్లాల వారికి ఒక చోట బస ఏర్పాటు చేయడంతో వారు అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది 10వ తరగతికి సంబంధించి ఉత్తమ ఫలితాలు సాధించిన 3,965 మంది విద్యార్థులను, ఇంట ర్మీడియెట్లో 504 మందిని ప్రతిభ అవార్డులకు ఎంపిక చేశారు. వీరందరికీ శుక్రవా రం తిరుపతి తారకరామ స్టేడియంలో అవార్డుల ప్రదా న కార్యక్రమం జరగనుంది. చిత్తూరు జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 395 మంది విద్యార్థులను ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. ప్రతి మండలం నుంచి ఆరుగురు విద్యార్థుల(జనరల్-2, ఎస్సీ-1,ఎస్టీ-1,బీసీ-1,బాలిక-1)ను అవార్డులకు ఎంపిక చేశారు. వీరికి ఒక్కొక్కరికి రూ.20వేలు చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి అందిస్తారు. అయితే ఈ ఎంపికలో ప్రధానంగా గ్రామీణ విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం లేకపోవడంతో వారు నష్టపోతున్నారు. పరోక్షంగా ప్రభుత్వ విద్యాసంస్థల మనుగడను మరింత దిగజార్చే చర్యలకు ప్రభుత్వం పూనుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఇంటర్మీడియట్లో జీరో : ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ-ఎంఈసీ విభాగాలకు సంబంధించి జిల్లాలో ప్రకటించిన ప్రతిభ పురస్కారాల జాబితాలో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ కళాశాల విద్యార్థి పేరు కూడా లేకపోవడం విస్మయానికి గురిచేసే అంశం. ప్రతి జిల్లాకు 39చొప్పున 13 జిల్లాలకు 504 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపికచేశారు. ఇక జిల్లాలో 10వ తరగతికి సంబంధించి 230 మంది ప్రభుత్వ హైస్కూళ్ల విద్యార్థులను, 165మంది ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులను ఎంపిక చేశారు. మండల స్థాయిలో అవార్డుల ఎంపికకు సంబంధించి కనీసం ఎంఈవోలకు కూడా సమాచారం లేకుండానే జాబితాను సిద్ధం చేశారు. 10వ తరగతికి సంబంధించి మండలాలవారీగా ఎంపిక జరగడం వల్ల ప్రైవేటు స్కూళ్లు లేని మారుమూల మండలాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల పేర్లు కనిపించాయి. కొన్ని మండలాల్లో, ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఇచ్చిన ఆరు అవార్డులకు ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులనే ఎంపిక చేశారు. ఎంపికలో ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రత్యేక కోటా : అవార్డుల ఎంపికలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక కోటాను కేటాయించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించలేని విద్యార్థులే ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనిపిస్తారు. వీరికి రూ.20వేలు ప్రోత్సాహం అంటే ఉన్నత చదువులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యానికి దోహదం చేస్తుంది. ప్రాక్టికల్స్ ప్రాబ్లం గత విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి అవార్డులు సాధించిన విద్యార్థుల్లో కొంతమంది ప్రస్తుత విద్యాసంవత్సరంలో డిగ్రీ చదువుతున్న వారికి ప్రాక్టికల్ పరీక్షలు జరగుతుండటంతో అవార్డుల కార్యక్రమానికి హాజరుకావడం సమస్యగా పరిణమించింది. ప్రాక్టికల్ పరీక్షను వదులుకుంటేగానీ తిరుపతికి హాజరుకాలేని పరిస్థితి. పైగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందినవారందరినీ తిరుపతికి ఆహ్వానించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వారికి తిరుపతిలో బస సౌకర్యాలు కూడా సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నెలకు ముందే జరిపి ఉంటే కొంత సౌకర్యంగా ఉండేది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రాధాన్యమివ్వాలి ప్రతిభ అవార్డులకు ఎంపికైన విద్యార్థులందరికీ శుభాభినందనలు. ప్రతిభ ఆధారంగా ప్రభుత్వం అందించే పురస్కారాలకు ప్రధానంగా గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ప్రాధాన్యతను పెంచాలి. ఈ విద్యా సంవత్సరం నుంచైనా ప్రత్యేక కోటాను ఏర్పాటుచేసి అవార్డుల ఎంపిక చేపట్టాలి. ప్రాక్టికల్ పరీక్షలకు ముందుగానే అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించి ఉంటే బాగుండేది. -యండపల్లి శ్రీనివాసులురెడ్డి, పట్టభద్రుల శాసనమండలి సభ్యులు. -
ప్రతిభకు చోటేదీ!
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దక్కని ప్రతిభా అవార్డులు కార్పొరేట్ విద్యాసంస్థలకే పెద్దపీట ఎంపిక విధానంపై ఎన్నో అనుమానాలు రేపు తిరుపతిలో అవార్డుల ప్రదానం విజయవాడ : ప్రతిభ అవార్డుల ఎంపిక ప్రహసనంగా మారింది. పేదింటి విద్యా కుసుమాల కష్టానికి గుర్తింపు దక్కలేదు. ప్రతిభకు పురస్కారం లభించలేదు. అసలు ప్రతిభ అవార్డుల ఎంపిక విధానమే లోపభూయిష్టంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యను ప్రోత్సహించేందుకు పదో తరగతిలో నూరు శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ అవార్డులు అందజేస్తుంది. ఈ మేరకు 2014 సంవత్సరానికి సంబంధించి మండలానికి ఆరుగురు చొప్పున జిల్లాలో 299 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఆ జాబితాను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం తిరుపతిలో జరగనుంది. ఎంపికైన విద్యార్థులకు పతకం, జ్ఞాపికతో పాటు రూ.20 వేలు నగదు బహుమతిగా ఇస్తారు. ఈ నగదును నేరుగా విద్యార్థి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఎంపిక విధానంపై అనుమానాలు విద్యా శాఖ విడుదల చేసిన జాబితాపై ఉపాధ్యాయ సంఘాల నేతలు పలు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఏ ప్రాతిపదికన అవార్డులకు విద్యార్థులను ఎంపిక చేశారనే విషయంపై ప్రధానోపాధ్యాయుల వద్ద కూడా సరైన సమాధానం లేదు. కొన్ని పాఠశాలల వారు ప్రతిభ అవార్డులకు అర్హులైన తమ విద్యార్థుల జాబితాను సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం జాబితా ప్రకటించడంతో అందరూ నివ్వెరపోయారు. విజయవాడ పరిసర మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి పదో తరగతి పరీక్షల్లో పదికి పది పాయింట్లు సాధించిన వారి పేర్లు ఈ జాబితాలో లేకపోవడం వెనుక కార్పొరేట్ పాఠశాల ఒత్తిళ్లు పనిచేశాయనే అనుమానాలను పలువురు వ్యక్తంచేస్తున్నారు. విజయవాడ అర్బన్, రూరల్, కంకిపాడు, పెనమలూరు మండలాలకు సంబంధించి విద్యా శాఖ ప్రకటించిన జాబితా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విద్యార్థుల ఎంపిక తమ చేతుల్లో లేదని, ఈ ప్రక్రియను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారే చూస్తున్నారని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. కులం, ప్రతిభ, పాయింట్లను బట్టి అవార్డుల ఎంపిక చేస్తారని చెప్పారు. సమాచారం లేదు ప్రతిభ అవార్డులు ఎప్పుడు ప్రదానం చేస్తారు.. విద్యార్థులను ఎలా ఎంపిక చేస్తారు.. అనే విషయాలపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్దిష్టమైన సమాచారం లేదు. విద్యాశాఖ కూడా వీరికి ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. దినపత్రికల్లో ప్రకటన చేయడం మినహా పాఠశాలలకు నేరుగా సమాచారం పంపలేదు. 95 శాతం ప్రైవేటు స్కూళ్ల వారికే ! రెండు సంవత్సరాలుగా ప్రతిభ అవార్డులు ప్రదానం చేయలేదు. గతంలో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఇచ్చారు. ఈ సంవత్సరం ఒక్కసారిగా అవార్డులు ప్రకటించడం, అందులోనూ 95 శాతం ప్రైవేట్ పాఠశాలల వారినే ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో రాజకీయ ప్రమేయం ఉందనే అనుమానాలు పలువురు వ్యక్తంచేస్తున్నారు. ‘కల్యాణి’కి దక్కని అవార్డు విజయవాడ కృష్ణలంకకు చెందిన పొడుగు కళ్యాణి నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి. ఆమె వీఎంఆర్ఆర్ మున్సిపల్ బాలికల పాఠశాలలో పదో తరగతి చదివింది. పరీక్షల్లో పదికి పది పాయింట్లు సాధించింది. ఆమెకూ ప్రతిభ అవార్డు దక్కలేదు. దీంతో తనకు అవార్డు వస్తుందని భావించిన కళ్యాణి నిరుత్సాహానికి గురైంది. మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఈ జాబితా చూసి మండిపడుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ‘కార్పొరేషన్’ పాఠశాలల్లో బోధన చేస్తున్నామని, ఫలితాలు సాధిస్తున్నామని, అయితే ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో తమ విద్యార్థులకు చోటుదక్కలేదని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎత్తుగడల్లో భాగమే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు దూరం చేసే ఎత్తుగడల్లో భాగమే ఈ అవార్డుల ఎంపిక. కార్పొరేట్ పాఠశాలలపై మోజు పెంచేందుకు, అక్కడ విద్యా ప్రమాణాలు బాగుంటాయన్న సందేశాన్ని పంపడానికి ఈ అవార్డుల ఎంపికను వేదికగా తీసుకున్నారు. ప్రభుత్వం తీరు దారుణం. - పూర్ణచంద్రరావు, ఏపీటీఎఫ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ పాపం ‘పావని’ విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2014లో పదో తరగతి పూర్తిచేసిన పావని నిరుపేద విద్యార్థిని. ఆమె తండ్రి ఆటో కార్మికుడు. పావని కష్టపడి చదవి పదికి పది పాయింట్లు సాధించింది. ఆమెకు ప్రతిభ అవార్డు లభిస్తుందని, ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని అందరూ భావించారు. ఈ మొత్తం పావని చదువుకు ఉపయోగపడుతుందని ఆశించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు విస్మయానికి గురయ్యారు.